Real Traders
-
దర్జాగా కబ్జా..
ఖమ్మం: రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సాగర్ కాల్వలు వరంలా మారాయి. పంట పొలాలకు నీరందించే కాల్వలను కొల్లగొడుతూ.. పక్కనే తమ వెంచర్లలో యథేచ్ఛగా విలీనం చేసుకుంటూ కోట్లు గడిస్తున్నారు. రైతులు మాత్రం తమ పంట భూములకు నీరందించే కాల్వలు బక్కచిక్కిపోవడం.. ఆక్రమణలకు గురికావడంతో ఆయకట్టుకు నీరందక అవస్థలు పడుతున్నారు. ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెం వద్ద మేజర్ కాల్వ నుంచి పెదతండా సాయిబాబా గుడి వరకు వచ్చే మూడో కాల్వ ప్రస్తుతం కనుమరుగైంది. సుమారు 20 అడుగుల వరకు ఉన్న మూడో కాల్వ పల్లెగూడెం నుంచి రెడ్డిపల్లి, తాళ్లేసేతండా, పెదతండా వరకు వందల ఎకరాలకు సాగునీరు అందించేది. రానురాను వ్యవసాయ భూములుగా వెంచర్లుగా మారుతున్నాయి. ఇదే అదనుగా భావించిన రియల్టర్లు తాము కొనుగోలు చేసిన భూముల్లో కాల్వలను కూడా కలిపేసుకుంటున్నారు. ప్రస్తుతం మూడో కాల్వ అనేది నామరూపాలు లేకుండా పోయింది. దీని కింద కొద్దోగొప్పో భూమి ఉండి.. సాగు చేస్తున్న రైతుల భూములకు సాగు నీరందని పరిస్థితి నెలకొంది. రియల్టర్లు పెదతండా వద్ద తవుడు మిల్లు సమీపంలోని కాల్వలను తమ భూముల్లో కలుపుకుని వాటి ఆనవాళ్లు కూడా లేకుండా చేయడం గమనార్హం. ఏదులాపురం చెరువు కాల్వ మాయం.. ఏదులాపురం నుంచి పెదతండా, గుర్రాలపాడు మొదటి భాగం భూముల వరకు వెళ్లే నీటి కాల్వ ఒకప్పుడు 20 అడుగులకుపైగా ఉండేది. ప్రస్తుతం 5 నుంచి 6 అడుగులకు చేరింది. దీనినిబట్టి కబ్జాదారులు ఎంతకు బరితెగించారో ఇట్టే అర్థమవుతోంది. సుమారు 3 కిలోమీటర్ల దూరం వచ్చిన కాల్వ రెండు వైపులా కలిపి 15 అడుగుల వరకు ఆక్రమణకు గురికావడం చూస్తే ఇక్కడే ఏడెనిమిది ఎకరాలు కబ్జాకు గురైనట్లు తెలుస్తోంది. వరంగల్ క్రాస్‌రోడ్ వద్ద ఓ రియల్టర్ ఏకంగా సాగర్ కాల్వ మధ్యలో ఇంటి నిర్మాణానికి పూనుకున్నాడు. దర్జాగా పిల్లర్లు వేసి కొంత మేర గోడలు కూడా నిర్మించాడు. అప్పట్లో రెవెన్యూ, పంచాయతీ అధికారులను మచ్చిక చేసుకుని దర్జాగా నడీ కాల్వపై ఇంటి నిర్మాణం చేపట్టాడు. దీనిపై రైతులు కొందరు రెవెన్యూ, పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో తర్జన భర్జనల నడుమ తొలగించారు. అలాగే వరంగల్ క్రాస్‌రోడ్ నుంచి పెదతండా వరకు, పక్కనే ఎఫ్‌సీఐ గోడౌన్ల ఎదురుగా, ఆటోనగర్ ప్రాంతంలో కూడా కాల్వ ఆక్రమణకు గురైంది. 50 ఎకరాలు ఆక్రమణ దశాబ్ద కాలంగా ఆక్రమణదారులు పంట కాల్వలను ఆక్రమించుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై రైతులు సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారు లేకపోవడంతో ఆక్రమణల దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. రాజకీయ ఒత్తిళ్లు, ఇతరత్రా కారణాలతో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. 20 అడుగుల కాల్వ ఉండేది.. పల్లెగూడెం నుంచి పెదతండా సాయిబాబా ఆలయం వరకు నాలుగు కిలోమీటర్ల మేర గతంలో 20 అడుగుల వెడల్పుతో పంట కాల్వ ఉండేది. అందులో వచ్చే నీటితో రెండు పంటలు పుష్కలంగా పండేవి. ప్రస్తుతం పంట భూములు ప్లాట్లుగా మారడంతో అసలు కాల్వే లేకుండా పోయింది. ఉన్న కొద్దిపాటి భూములకు నీరందడం లేదు. – బాణోత్ తారాచంద్, పెదతండా సాగునీటికి ఇబ్బందులు.. గతంలో ఏదులాపురం చెరువు నుంచి వచ్చే పంట కాల్వ 20 అడుగుల వరకు ఉండేది. ఇప్పుడది అయిదారు అడుగులకు మించిలేదు. కాల్వ వెడల్పు ఉన్నప్పుడు పంటలకు నీరు సమృద్ధిగా చేరేవి. పంటలకు కూడా నీటి ఇబ్బంది లేకుండా ఉండేది. కాల్వ వెడల్పు తగ్గడంతో నీళ్లు రావడం తగ్గింది. ఆయకట్టు కొన్నేళ్లుగా ఎండిపోతోంది. – బాణోత్ సేవాలాల్, రైతు, పెదతండా ఆక్రమిస్తే సహించేది లేదు.. ఎక్కడైనా పంట కాల్వలు ఆక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటివరకు వరంగల్ క్రాస్‌రోడ్ ప్రాంతంలో సాగర్ పంట కాల్వపై రియల్టర్ నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించాం. పంట కాల్వలు ఆక్రమిస్తే తమకు వెంటనే సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటాం ఈ విషయంలో ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు. – బి.నర్సింహారావు, తహసీల్దార్ -
రియల్ వ్యాపారుల బరితెగింపు
తటాకాల భూముల కబ్జాకు పక్కా ప్రణాళిక.. దొంగచాటుగా చెరువుల్లో నీటిని ఖాళీ చేస్తున్న వైనం.. ఓ కీలక ప్రజాప్రతినిధి బినామీల దందా.. కొత్త జిల్లా నిర్మల్‌లో బరితెగిస్తున్న రియల్ వ్యాపారులు సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : నిర్మల్ జిల్లా ప్రకటనతో అక్కడ ‘రియల్’ దందా జోరందుకుంది. వంద గజాల ప్లాటు విలువ రూ.లక్షల్లో పలుకుతోంది. ఈ తరుణంలో రియల్ గద్దల కన్ను ఇప్పుడు చెరువు భూములపై పడింది. రూ.కోట్లు విలువై చెరువు భూములను కబ్జా చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. నిండుకుండను తలపిస్తున్న చెరువు నీటిని దొంగచాటున తోడేస్తున్నారు. దీంతో ఖాళీ అవుతున్న చెరువు భూములను కబంధ హస్తాల్లోకి తీసుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ప్రభుత్వం ఒకవైపు మిషన్ కాకతీయ పేరుతో చెరువుల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టింది. రూ.వందల కోట్లు వెచ్చించి చెరువులకు మరమ్మతులు చేపట్టింది. కానీ ప్రభుత్వ లక్ష్యానికి విరుద్ధంగా అక్రమార్కులు ఈ చెరువులను కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కళ్ల ముందే చెరువు భూములను కబ్జా చేస్తుంటే ఇటు రెవెన్యూ అధికారులు గానీ, చిన్న నీటి పారుదల శాఖ అధికారులు గానీ అటువైపు కన్నెత్తి చూస్తున్న దాఖలాలు లేకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. నీళ్లు ఖాళీ చేస్తున్నదెవరూ.? కంచరోని చెరువులో నుంచి గత నెల రోజులుగా తరచూ నీటిని వదిలేస్తున్నారు. ఈ చెరువు కింద భూములకు పంటల కోసం నీరు వదులుతున్నారని భావిస్తే కాలువలో కాలేసినట్లే. ఎందుకంటే ఈ చెరువు కింద ఉన్న భూములు ఎప్పుడో రియల్ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. శ్యాంఘడ్కు చుట్టూ సుమారు పదికి పైగా అక్రమ వెంచర్లు వెలిశాయి. ఎలాంటి అనుమతులు లేకుండా ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా చెరువునే కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ధర్మసాగర్ చెరువులో నిత్యం నిర్మాణాలే.. నిర్మల్ పట్టణంతోపాటు, చుట్టూ పలు గొలుసుకట్టు చెరువులున్నాయి. ఒక్క చెరువు నిండితే మరో చెరువులోకి నీళ్లు వచ్చే విధంగా వీటిని నిర్మంచారు. పట్టణం విస్తరించడంతో అక్రమార్కులు ఈ చెరువులు, వాటి కాలువలను క్రమంగా కబ్జా చేస్తున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులతోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్ ఇలా అన్ని పార్టీల కీలక ప్రజాప్రతినిధులు, నేతలు ఈ భూములను కబ్జా చేశారు. 65 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు కబ్జాలతో పూర్తిగా కుచించుకుపోయింది. తాజాగా ఈ చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చి దిద్దే పనుల పేరుతో ఈ చెరువు నీటిని కూడా ఖాళీ చేయిస్తున్నారు. ఇప్పటికే సగం చెరువు ఖాళీ అయ్యింది. దీన్ని ఆసరాగా చేసుకుని చెరువులో మరిన్ని అక్రమ నిర్మాణాలు చేపట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మా దృష్టికి రాలేదు నిర్మల్ పట్టణంలోని కంచరోని చెరువుల్లో నీటిని ఖాళీ చేస్తున్నట్లు మా దృష్టికి రాలేదు. చెరువు భూములు కబ్జా అవుతున్నట్లు మాకు తెలియదు. ఆర్డీఓతో మాట్లాడి చెరువు భూములను కాపాడేందుకు చర్యలు తీసుకుంటాం. ఆసుపత్రులు, డ్రైనేజీ వేస్ట్ వాటర్‌తో ధర్మసాగర్ చెరువులో నిండిన మురికి నీటిని తొలగిస్తున్నాము. చెరువు భూములు కబ్జా కాకుండా చూస్తాం. -శ్రీనివాస్, నీటి పారుదల శాఖ పర్యవేక్షక ఇంజినీర్ -
భగ్గుమంటున్న భూముల ధరలు
► గజం ధర రూ. 6 వేల నుంచి రూ. 12 వేల వరకు ►భూపాలపల్లి నుంచి గణపురం వరకు వెంచర్లు ►నెల రోజుల్లోనే మూడింతలు పెరిగిన ధరలు ►జిల్లా ఏర్పాటు చర్చతో రియల్ బూమ్ భూపాలపల్లి: భూపాలపల్లిలో భూముల ధరలు చుక్కలనంటుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం భూపాలపల్లిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయనున్నట్లు వార్తలు వస్తుండటంతో నెల రోజుల వ్యవధిలోనే భూముల ధర లు మూడింతలు పెరిగాయి. ఎక్కడ చూసినా వెంచర్లు దర్శనమిస్తున్నా యి. పట్టణ శివారు నుంచి మొదలుకొని గణపురం క్రాస్‌రోడ్ వరకు రియల్ వ్యాపారులు తిష్టవేసి భూముల క్రయవిక్రయాలు జరుపుతున్నా రు. జిల్లాల పునర్విభజనపై గత నెల రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర కసరత్తు జరుపుతుంది. ఈ క్రమంలో భూపాలపల్లిని జిల్లాగా ఏర్పాటు చేసి.. ఇందులో విలీనం చేయబోయే నియోజకవర్గాలపై చర్చ జరుగుతో ంది. జిల్లాగా ఏర్పడితే భూముల ధరలు ఆకాశాన్ని అంటే అవకాశం ఉం దని భావించిన కొందరు రియల్, వ్యాపారులు, భూస్వాములు గత కొద్ది రోజులుగా భూముల క్రయ విక్రయాలను జోరుగా సాగిస్తున్నారు. మూడింతలు పెరిగిన గజం ధర.. భూపాలపల్లి నుంచి గణపురం వరకు గజం ధర నెల రోజుల వ్యవధిలోనే మూడింతలయింది. కొద్ది రోజుల క్రితం వరకు భూపాలపల్లి పట్టణంలోని పోలీస్‌స్టేషన్, తహశీల్దార్ కార్యాలయం, బస్ డిపో సమీపాల్లో గజం ధర రూ. 3 వేల వరకు ఉండేది. కాగా ప్రస్తుతం ఆయా స్థలాల్లో గజం ధర రూ. 10 వేల నుంచి రూ. 12 వేల వరకు పలుకుతోంది. పట్టణ సరిహద్దు నుంచి చెల్పూరు వరకు గతంలో గజం ధర రూ. 3 వేలు మాత్రమే ఉండగా ప్రస్తుతం సుమారు రూ. 6 వేల నుంచి రూ. 9 వేల వరకు ఉంది. ఇదిలా ఉండగా పట్టణం నుంచి చెల్పూరు వరకు భూముల ధరలు పెరిగిన విషయాన్ని గమనించిన కొందరు వ్యాపారులు, రైతులు గణపురం క్రాస్‌రోడ్ వద్ద వ్యవసాయ భూములను ప్లాట్లుగా ఏర్పాటు చేసి విక్రయాలు జరుపుతున్నారు. అక్కడ ప్రస్తుతం గజం ధర రూ. 3 వేల వరకు పలుకుతోంది. భూపాలపల్లి, గణపురం మండల కేంద్రాల మధ్య గత ఏడాది క్రితం వరకు వ్యవసాయ భూములు దర్శనమిచ్చేవి. కాగా ప్రస్తుతం ప్లాట్లు, భవనాలు కనిపిస్తున్నాయి. మరో ఏడాది వరకు రెండు మండలాల మధ్య ఖాళీ స్థలాలు, వ్యవసాయ భూములు కనిపించే అవకాశాలు కానరావడం లేదు. ఏది ఏమైనప్పటికీ బొగ్గు, విద్యుత్ రంగ పరిశ్రమలతో భూపాలపల్లి మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉండటమే కాక జిల్లాగా ఏర్పడనున్నట్లు వార్తలు వస్తుండటంతో భూముల ధరలు సామాన్యుడికి అందకుండాపోతున్నాయి. -
దర్జాగా కబ్జా..!
అదో పంట కాల్వ.. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎమ్మార్పీ) పరిధిలోని డి-10,11 డిస్ట్రిబ్యూటరీ అని ఆ కాల్వను పిలుస్తారు. పెద వూర మండలంలో ఉన్న ఆ కాల్వ ద్వారా నీళ్లు వస్తే రైతులు పంటలు పండించుకుని దర్జాగా బతకొచ్చు. కానీ రియల్టర్ల కళ్లు పడ్డాయి. దర్జాగా ఆక్రమించేసి వ్యాపారం చేసుకుంటున్నారు. కాల్వను చదును చేసి మరీ ప్లాట్లు చేసేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఇదో.. రైతులను నట్టేటా ముంచే రియల్‌దందా.. ఇప్పటికే నీళ్లు రాక అల్లాడుతున్న రైతాంగం వెతలను పట్టించుకోకుండా ఆ కాల్వలను రియల్ వ్యాపారులు దర్జాగా కబ్జా చేసి తమ భూముల విలువ పెంచుకుంటున్నారు. డిస్ట్రిబ్యూటరీ కాల్వలో ప్రైవేటు గూనలు వేసి తాత్కాలికంగా మూసివేశారు. యంత్రాల సాయంతో చదును చేసి మరీ యథేచ్ఛగా వ్యాపారం చేసుకునేందుకు ముమ్మరంగా పనులు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా సాగునీటి శాఖ అధికారులకు ఏమీ పట్టడం లేదు. ప్రభుత్వ సొమ్ములు పెట్టి రైతుల నుంచి సేకరించిన భూమిని పంటకాల్వ సరిహద్దుగా, తనిఖీలకు దారిగా ఉపయోగించుకునే వీలు లేకుండా పది రోజుల నుంచి ఏకంగా కాల్వను 200 మీటర్లకు పైగా మూసివేస్తున్నా అటువైపు కన్నెత్తి చూడడం లేదు. పెదవూర గ్రామశివారులో జరుగుతున్న ఈ భూదందా విషయంలో సాగునీటి శాఖ అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతులకు నీళ్లు రాకున్నా వ్యాపారులకు కాసుల పంట పండాలంట..! వాస్తవానికి ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు ద్వారా పెదవూర మండల కేంద్రం వరకు సజావుగా నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. మండలంలోని సంగారం సమీపంలో తవ్విన కాల్వల వద్దే ఎత్తుపల్లాలు ఉండడంతో మండల కేంద్రం శివారు వరకు వచ్చి నీ ళ్లు ఆగిపోయే పరిస్థితి. అక్కడి వరకు ఉన్న కాల్వల ద్వారా కేవలం వందల సంఖ్యలోనే ఎకరాల్లో పంటలు పండించుకుంటున్నారు రైతులు. అయితే, హైదరాబాద్ రోడ్డులో ఉన్న పెట్రోలు బంక్ ఎదురుగా ఉన్న భూమిని రియల్ వ్యాపారం ద్వారా అమ్మి సొమ్ము చేసుకోవాలనే ఆలోచనతో కొందరు వ్యాపారులు ఆ కొంచెం కూడా రైతులకు దక్కకుండా చేస్తున్నారు. అక్కడ ఉన్న డిస్ట్రిబ్యూటరీ కాల్వను గూనల ద్వారా మూసివేసి ఆ భూమిని రోడ్డు మీదకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. 20 రోజుల నుంచి ఈ భూమిలో రియల్ పనులు జరుగుతుండగా, 10 రోజుల క్రితం ఈ కాల్వను పూడ్చివేసి అటూ ఇటూ చిన్న సైజు గూనలు వేసినట్టు సమాచారం. దీంతో ఆ భూమి రోడ్డు ఫేసింగ్కు వచ్చి రేటు పలుకుతుందనేది వ్యా పారుల ఆలోచన. అయితే, ఈ కాల్వను పూడ్చివేయడం ద్వారా తమకు నష్టం జరుగుతుందని సమీప రైతులు వాపోతున్నా అటు రియల్ వ్యాపారులు కానీ, ఇటు సాగునీటి శాఖ అధికారులు కానీ పట్టించుకోకపోవడం గమనార్హం. సాగునీటితో పాటు తాగునీటికి కష్టాలే డిస్ట్రిబ్యూటరీ కాల్వను పూడ్చివేసి కేవలం గూనల ద్వారా నీళ్లు వెళ్లేలా ప్రైవేటు వ్యాపారులు చేస్తున్న ఈ ప్రయత్నాలు భవిష్యత్తులో అక్కడి రైతాంగానికి నష్టం కలిగిస్తుందని స్థానికులంటున్నారు. కాల్వ పక్కనే ఉన్న ప్రైవేటు భూమిలోనికి వెళ్లే దారి కోసం ఎక్కడో ఒక చోట మార్గం ఏర్పాటు చేసుకోవచ్చు కానీ ఏకంగా 200 మీటర్ల మేర కాల్వను పూడ్చివేయడం ఎంతవరకు సమంజసమనేది వారి ప్రశ్న. అయితే, ఈ కాల్వ మీదనే ఇప్పుడు రియల్ఎస్టేట్ వ్యాపారానికి సిద్ధమవుతున్న భూమికి సమీపంలోనే ఓ స్పిన్నింగ్‌మిల్ ఉంది. ఈ మిల్లుకు వెళ్లేందుకు గాను వాహనాల రాకపోకల కోసం కాల్వను కొంత పూడ్చివేసి గూనలు ఏర్పాటు చేశారు. అంతవరకు బాగానే ఉంది కానీ ఏకంగా ఫర్లాంగుల మేర కాల్వను పూడ్చడం తమకు నష్టం కలిగిస్తుందని రైతులంటున్నారు. ఇదే భూమికి ఎదురుగా మరో కాల్వ కూడా ఉంది. ఆ కాల్వకు, డిస్ట్రిబ్యూటరీకి ఉన్న లింకు కూడా ఈ గూనల ఏర్పాటుతో తొలగిపోయింది. దీంతో భవిష్యత్తులో కాల్వల మరమ్మతులు చేయాలన్నా, కాల్వలకు సీసీలైనింగ్ ఏర్పాటు చేయాలన్నా కష్టమవుతుందనేది రైతుల వాదన. అంతేకాకుండా చిన్న చిన్న గూనల ఏర్పాటు చేస్తే ఎక్కడయినా నీరు ఆగిపోతే ఎలా సవరిస్తారు.. నీటిని సక్రమంగా వెళ్లే ఏర్పాట్లు ఎలా చేస్తారనేది అంతుపట్టడం లేదని రైతులంటున్నారు. దీనిపై ఎన్నోసార్లు ఏఎమ్మార్పీ ఇంజినీర్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, తమ పరిధిలోనికి రాదంటే తమ పరిధిలోనికి రాదని దాటవేస్తున్నారని వారంటున్నారు. వాస్తవానికి ఈ భూమి స్థానిక రాజకీయ నాయకుడిదే అయినా, హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి దాన్ని కొని రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వినియోగించుకుంటున్నాడని, స్థానికంగా కొందరిని, అధికారులను ప్రలోభపెట్టి యథేచ్ఛగా కాల్వను మూసివేశారని రైతులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో సాగునీటి శాఖ అధికారులు ఇప్పటికయినా దృష్టి సారించి రైతాంగానికి నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. మరోవైపు ఈ కాల్వను సజావుగా పెదవూర మండల కేంద్రంలోనికి తీసుకెళ్తే పెదవూర చెరువుకు నీటిని సరఫరా చేయవచ్చని, అక్కడి నుంచి ఇప్పటికే మూడు గ్రామాలకు తాగునీరు వెళ్లే స్కీం ఒకటి పనిచేస్తోందని స్థానికులంటున్నారు. భవిష్యత్తులో ఈ స్కీంను మరింత విస్తరించి ఆరేడు గ్రామాలకు నీటిని సరఫరా చేయాలన్న ఆలోచన ఉందని, ఇప్పుడు ఈ ప్రైవేటు గూనలతో ఆ ప్రతిపాదన అటకెక్కినట్టేనని వారంటున్నారు. ఇదిలా ఉంటే, గూనలు వేసి తమ భూమిని రోడ్డు ఫేసింగ్కు తెచ్చుకున్న రియల్ వ్యాపారులు ఇప్పుడు అక్కడ షట్టర్లు వేసి ఒక్కో షట్టర్‌ను 3-4లక్షల రూపాయలకు విక్రయించేందుకు కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సాగునీటి శాఖ అధికారులు ఈ గూనలతో చేస్తున్న రియల్ వ్యాపారంపై దృష్టి సారించి రైతులకు నష్టం కలగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాల్సిందే. -
పెద్దచెరువు కాలువనూ ఆక్రమించారు!
చిన్నకోడూరు : కబ్జాకు కాదేది అనర్హం అన్నట్లుగా పెద్దచెరువు కాలువనే కబ్జా చేసి లక్షలాది రూపాయల విలువైన నీటిపారుదల భూములు రియల్ వ్యాపారులు కబ్జా చే శారు. ఈ సంఘటన మండల పరిధిలోని ఇబ్రహీంగనర్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని రాజీవ్ రహదారికి పక్కన విలువైన భూములు ఉన్నాయి. ఇదే సమయంలో రోడ్డు విస్తరణ జరగడంతో రియల్ వ్యాపారం జోరందుకుంది. ఈ క్రమంలో ఇబ్రహీంగనర్ పెద్దచెరువు కట్టుకాలువపై కన్నేసిన రియల్ వ్యాపారులు కాలువను చదును చేసి కబ్జా చేశారు. ప్రస్తుతానికి ఎకరాకు రూ. 40 లక్షల ధర పలుకుతుండడంతో కట్టు కాలువకు చెందిన 25 గుంటలను వ్యాపారులు యథేచ్ఛగా ఆక్రమించారు. దీంతో పెద్దచెరువుపై ఆధారపడిన గ్రామ రైతులకు ఈ కబ్జా సాగునీటి ప్రవాహానికి ఆటంకంగానే మారనుందని చెప్పాలి. సంబంధిత కట్టు కాలువ కబ్జాను నియంత్రించి అధికారులు సమగ్రమైన చర్యలు చేపట్టి భూమిని కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. విలువైన ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్న అధికారులు స్పందించక పోవడంతో సదరు భూములు అక్రమార్కులు దర్జాగా ఆక్రమిస్తున్నారని వాపోతున్నారు. కబ్జాదారుల చెర నుంచి ఆ భూములు రక్షించాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయమై తహశీల్దార్ పరమేశంను వివరణ కకోరగా ఇబ్రహీంనగర్ పెద్ద చెరువు కాలువను పరిశీలించి కబ్జాకు గురైన భూమిని స్వాధీనం చేసుకుంటామన్నారు. ఈ విషయంలో ఎంతటివారైనా ఉపేక్షించేది లేదన్నారు. ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములు తిరిగి స్వాధీనం చేసుకుంటాం. -
‘రియల్’ మాయ..!
సామాన్యుడికి సొంతిల్లు కలగానే మారింది... లక్షల రూపాయలు పోసి కొన్న ప్లాటును దక్కించుకునేందుకు ఎన్నో పాట్లు పడాల్సి వస్తోంది... రియల్ వ్యాపారులు జనం ఆకాంక్షను పెట్టుబడిగా పెట్టి కోట్లు గడిస్తున్నారు. ఇబ్బడి ముబ్బడిగా అనుమతి లేని వెంచర్లను తెరమీదకు తెస్తున్నారు... పంచ రంగుల కరపత్రాలతో ప్రచారం చేసి ప్రజలను మోసగిస్తున్నారు... ఆదిలోనే వీటిని నివారించాల్సిన రెవెన్యూ అధికారులు రియల్ మాయలో పడి కళ్లు మూసుకుంటున్నారు. ⇒ విచ్చలవిడిగా అక్రమ లేఅవుట్లు ⇒ ప్రభుత్వ ఆదాయానికి రూ.కోట్లలో గండి ⇒ మోసపోతున్న కొనుగోలుదారులు ⇒ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ లభించని సమాచారం ⇒ పట్టించుకోని అధికారులు సంగారెడ్డి క్రైం: పచ్చని పంట పొలాలు కనుమరుగవుతున్నాయి. పట్టణాలు, మండల కేంద్రాలను ఆనుకొని ఉన్న గ్రామాల చుట్టూ అక్రమ లేఅవుట్లు వెలుస్తున్నాయి. జిల్లాలోని సిద్దిపేట, సంగారెడ్డి, జోగిపేట, పటాన్చెరు, రామచంద్రాపురం, గజ్వేల్, మెదక్, జహీరాబాద్, తూప్రాన్ తదితర ప్రాంతాల్లో అక్రమ లేఅవుట్లు వందల సంఖ్యలో ఉన్నాయి. అనుమతులు ఉన్న వెన్ని?.. లేనివెన్నో అధికారులకే తెలియని పరిస్థితి. ఇవేవీ తెలి యని అమాయక జనం వాటిని కొనుగోలు చేసి మోసపోతున్నారు. లేఅవుట్ వేయాలంటే వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చాలి. ఇందుకు మార్కెట్ విలువలో పది శాతం డబ్బులను ప్రభుత్వానికి చెల్లించాల్సి. కానీ జిల్లా లో వందల ఎకరాలను వ్యవసాయేతర భూమిగా మార్చకుండానే లేఅవుట్లు వేయడంతో ప్రభుత్వం రూ.కోట్లలో ఆదాయాన్ని కోల్పోతుంది. అనుమతి పొందిన లేఅవుట్లో పది శాతం భూమిని సామాజిక అభివృద్ధి కోసం వదలాలి. అంటే పది ఎకరాల్లో లేఅవుట్ చేస్తే ఎకరాను వదిలేయాలి. ఇందుకు ససేమిరా అంటున్న రియల్ వ్యాపారులు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. లే అవుట్లలో మౌలిక వసతులు కల్పించే అంశాన్ని విస్మరిస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల ఉదాసీనత, మామూళ్ల మత్తు కారణంగానే అక్రమ లే అవుట్లు విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. పంచాయతీలు, మున్సిపాలిటీలకు ఇది ఆదాయ వనరుగా మారాయన్న విమర్శలున్నాయి. అగ్రికల్చర్ ల్యాండ్‌ను వ్యవసాయేతర భూమిగా మార్చకుండా లేఅవుట్ చేస్తే రెవెన్యూ అధికారులు అడ్డుకోవాలి. కానీ వారు అవినీతిపరులకే వత్తాసు పలుకుతున్నారు. పంచాయతీ, మున్సిపాలిటీల తీర్మానం తర్వాత విస్తీర్ణం అనుసరించి జిల్లా టౌన్ ప్లానింగ్, రీజినల్ డెరైక్టరేట్ ఆఫ్ టౌన్ ప్లానింగ్‌కు పంపాలి. అన్నీ పకడ్బందీగా ఉంటేనే వారు అనుమతిస్తారు. కానీ ప్రతి దశలోనూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నా పట్టించుకునే వారే లేకుండా పోయారు. మామూళ్లు తగ్గినప్పుడే రెవెన్యూ అధికారులు అక్కడక్కడా దాడులు చేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఏయే సర్వే నంబర్లలో ఎంత విస్తీర్ణంలో లేఅవుట్ వేశారన్న అధికారిక సమాచారాన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రభుత్వం అందుబాటులో ఉంచాలి. అనుమతి ఉన్న లే అవుట్లలోనే ప్లాట్లు చేయాలన్న నిబంధన గట్టిగా విధించాలి. ఇలా చేస్తేనే అక్రమాలను అరికట్టేందుకు అవకాశం ఉంటుంది. -
నమ్మి కొంటే.. నట్టేట ముంచారు!
కందవాడ (చేవెళ్లరూరల్): వె ంచర్ యజమానులు గ్రామస్తులే కదా అని నమ్మి ప్లాట్లు కొన్న ఇద్దరు నట్టేట మునిగిపోయారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. రియల్ వ్యాపారులు తమ రాజకీయ పలుకుబడితో కేసు నమోదు కాకుండా చూస్తున్నారని బాధితులు విలేకరుల ఎదుట వాపోయారు. బాధితులు తెలిపిన వివరాలు ఈవిధంగా ఉన్నాయి. మండల పరిధిలోని కందవాడ గ్రామంలో సర్వేనెంబర్ 284లో రెండు ఎకరాల భూమిని 2012లో అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు పెంటారెడ్డి, అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి మల్లేశ్‌తో కలిసి వెంచర్ చేశాడు. సుమారు 50 ప్లాట్లతో లేఅవుట్ చేశారు. వెంచర్ యజమానులు తమ గ్రామానికి చెందిన వారే కదా అని నమ్మిన కందవాడకు చెందిన కావలి శ్రీశైలం, కావలి శ్రీనివాస్‌లు తమ భార్యల పేరుమీద 150 గజాల చొప్పున రూ. 1.5 లక్షలు వెచ్చించి ప్లాట్లు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇటీవల వాని ప్లాట్లు ట్రాక్టర్ దున్ని వెంచర్ యజమానులు ఇతర వ్యక్తులకు అమ్మేందుకు యత్నించారు. ఈ విషయం తెలుసుకున్న బాధితులు వెంచర్ యజమానులు ప్రశ్నించగా ప్లాట్లతో మీకు ఎలాంటి సంబంధం లేదని బెదిరించారు. దీంతో చేసేదిలేక బాధితులు ఈనెల 19న పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. ఇరువర్గాలు రాజీ కుదుర్చుకుంటామని చెప్పడంతో కేసు నమోదు చే యలేదు. కాగా తమపైనే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తారా..? అంటూ రియల్ వ్యాపారులు తమను బెదిరిస్తున్నారని బాధితులు విలేకరుల ఎదుట సోమవారం వాపోయారు. తాము రెక్కలుముక్కలు చేసుకొని పైసాపైసా కూడబెట్టుకుంటే ఇలా మోసం చేయడం ఎంతవరకు అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంచర్ యజమానులు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని చెబితే నమ్మి కొనుగోలు చేశామని.. ఇప్పుడు మోసం చేస్తున్నారని చెప్పారు. ఈవిషయమై ఎస్ఐ లక్ష్మీరెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరగాా.. ఫిర్యాదు అందిన విషయం వాస్తవమేనని చెప్పారు. ఇరువర్గాల వారు రాజీ కుదుర్చుకుంటామని చెబితే కేసు నమోదు చేయలేదు. బాధితులు తమ వద్ద ఉన్న పత్రాలతో కేసు నమోదు చేయాలని కోరితే తప్పకుండా చేస్తామని తెలిపారు. ఈ విషయమై వెంచర్ యజమాని పెంటారెడ్డి మాట్లాడుతూ.. బాధితు లకు తాము తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పారు. తాము ఎవరినీ బెదిరించలేదని తెలియ జేశారు. రాజకీయంగా తమను ప్రత్యర్థులు దెబ్బతీసేందుకు యత్నిస్త్త్త్తున్నారని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. -
రియల్ మోసం
- కారుచౌకగా 110 ఎకరాలు కొట్టేసిన వ్యాపారులు - ఐదింతలు ఎక్కువకు ఏపీఐఐసీకి కట్టబెట్టేందుకు వ్యూహం - మోసపోయామంటూ అధికారులను ఆశ్రయించిన బాధితులు - రెండేళ్లుగా ఫైల్‌ను పెండింగ్‌లో ఉంచిన యంత్రాంగం - తాజాగా కలెక్టర్ స్మితా సబర్వాల్‌పై వ్యాపారుల ఒత్తిడి - ఆగమేఘాల మీద కదులుతున్న ఫైలు - కొత్త ప్రభుత్వం ఏర్పడేలోపే తతంగం ముగించేందుకు మంత్రాంగం పేదలను కొట్టి పెద్దలు జేబులు నింపుకోవడమంటే ఇదే. వ్యవసాయ భూములను కారుచౌకగా కొట్టేసిన ‘రియల్’ వ్యాపారులు ఆ భూములనే ఐదింతలు ఎక్కువ చేసి ఏపీఐఐసీకి కట్టబెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ మోసం గురించి తెలుసుకున్న రైతన్న నెత్తీనోరు మొత్తుకుని న్యాయం చేయాలంటూ రెండేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేకుండా పోయింది. సాక్షాత్తూ జాయింట్ కలెక్టరే ఇది ‘రియల్’ మోసం అని నిర్ధారించినా బడుగు రైతులకు న్యాయం జరగడం లేదు. తాజాగా కలెక్టర్‌పై ఒత్తిడి తెచ్చిన వ్యాపారులు.. తమ పథకం అమలు చేసేందుకు పెండింగ్‌లో ఉన్న ఫైల్‌ను ఆగమేఘాల మీద క్లియర్ చేయిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మసిపూసి ‘మాయ’ చేసి.. అధికారులకు ‘ఆశ’ చూపి... రైతులను అమాయకులను చేసి రూ .కోట్ల ప్రజాధనం కొల్లగొడుతున్న ‘రియల్’ మోసమిది. ఎకరాకు రూ. లక్ష చెల్లించి రైతుల నుంచి కొనుగోలు చేసిన రియల్ వ్యాపారులు గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండానే ఇండస్ట్రీయల్ పార్కుగా మలిచి ఏపీఐఐసీకి ఎకరాకు రూ. 6 లక్షల చొప్పున అంటగట్టేందుకు సిద్ధమయ్యారు. ధర చెల్లింపు విషయంలో మోసం జరిగిందని బాధిత రైతులు కలెక్టర్‌కు రెండు సంవత్సరాల క్రితం ఫిర్యాదు చేసినా, అవేమీ పట్టించుకోని యంత్రాగం 110 ఎకరాల భూమిని ఏపీఐఐసీకి కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. కలెక్టర్ కార్యాలయంలో దీనికి సంబందించిన ఫైల్ వాయువేగంతో పరుగులు పెడుతోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడే లోగా ఫైల్‌ను క్లియర్ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రూ.కోట్ల కూడబెట్టే కుట్ర నంగనూరు మండలం నర్మెట గ్రామ పంచాయతీ పరిధిలోని మైసంపల్లి మదిర గ్రామ శివారులో భూములున్న రైతుల నుంచి 2010లో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు సర్వే నంబర్ 341 నుంచి 350 వరకు సుమారు 110 ఎకరాలను కొనుగోలు చేశారు. అప్పట్లో గ్రామానికి చెందిన రైతులు చంద్రయ్య, ఐలయ్య, రవి, నర్సింహులుతో పాటు మరికొందరు రైతుల నుంచి ఎకరాకు రూ.60 వేల నుంచి రూ. ఒక లక్ష వరకు రైతుల అవసరాలను బట్టి భూమికి ధర నిర్ణయించి కారు చౌకగా భూములు కొట్టేశారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంతో తమకు ఉన్న పలుకుబడిని ఉపయోగించి ఈ భూమిని అధిక ధరకు ఏపీఐఐసీకి అప్పగించేందుకు పథక రచన చేశారు. జరిగిన మోసాన్ని ఆలస్యంగా గుర్తించిన రైతులు 2011లో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మైసంపల్లి, నర్మెట గ్రామాల రైతుల పిటిషన్‌తో స్పందించిన జేసీ శరత్ 2012లో గ్రామ రెవెన్యూ సదస్సుల్లో ఈ విషయంపై చర్చించారు. రైతులకు అన్యాయం జరిగిందని నిర్ధారించారు. వారికి న్యాయం జరిగిన తర్వాతే ఆ భూముల ను ఇండస్ట్రీయల్ పార్క్‌కు అప్పగించాలని సూచించారు. అప్పటి నుంచి దీనికి సంబంధించిన ఫైల్ పెండింగ్ ఉంది. కలెక్టర్‌పై ఒత్తిడి తాజాగా 110 ఎకరాలకు సంబంధించిన ఈ ఫైల్ క్లియర్ చేయించడానికి ఓ వ్యక్తి వ్యాపారుల తో డీల్ కుదుర్చుకుని జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్‌పై ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తోంది. ఒత్తిడికి తలొగ్గిన అధికారులు ఆగమేఘాల మీద ఫైల్ తెప్పించి వ్యాపారులకు అనుకూలంగా క్లియర్ చేస్తున్నట్లు సమాచారం. ఎకరాకు రూ.6 లక్షల చొప్పున 105 ఎకరాలను, ఎకరాకు రూ. 5 లక్షల చొప్పున మరో ఐదు ఎకరాలను మొత్తం దాదాపు రూ. 6.55 కోట్లకు ఏపీఐఐసీకి అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. అంతా సవ్యంగా సాగితే కొత్త ప్రభుత్వం ఏర్పడటానికి ఒక రోజు ముందుగానే సిద్ధం చేసిన చెక్కులు వ్యాపారుల చేతిలోకి వెళ్లిపోయే అవకాశం ఉంది. కాసులకు కక్కుర్తిపడి ఈ వ్యవహారంలో రెవిన్యూ అధికారుల ఉదాసీనత కిందస్థాయి నుంచి పై స్థాయి వరకు కనపడుతోంది. గ్రామ పంచాయతీ పరిధిలోని వ్యవసాయ భూములను ఇండస్ట్రీయల్ పార్కుగా మార్చాలంటే కచ్చితంగా గ్రామ పంచాయతీ తీర్మానం ఉండాలి. కానీ పార్కు నిర్మాణానికి సంబంధించి నేటికీ గ్రామ పంచాయతీ తీర్మానం జరగలేదు. 2012 నుంచి రైతులు చేసిన ఫిర్యాదులు పెండింగ్‌లోనే ఉన్నాయి. భూమికి సంబంధించిన పరిహార వ్యవహారాలను పర్యవేక్షించే విభాగం సంగారెడ్డిలో ఉండడంతో రైతులు ఆ కార్యాలయం చుట్టూ ఏళ్లుగా తిరుగుతూనే ఉన్నారు. ఇదేమీ పట్టించుకోకుండా జిల్లా కలెక్టర్ కార్యాలయం గుడ్డిగా ఫైల్ క్లియర్ చేయడానికి సిద్ధంకావడం సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.