రియల్ మోసం
- కారుచౌకగా 110 ఎకరాలు కొట్టేసిన వ్యాపారులు
- ఐదింతలు ఎక్కువకు ఏపీఐఐసీకి కట్టబెట్టేందుకు వ్యూహం
- మోసపోయామంటూ అధికారులను ఆశ్రయించిన బాధితులు
- రెండేళ్లుగా ఫైల్‌ను పెండింగ్‌లో ఉంచిన యంత్రాంగం
- తాజాగా కలెక్టర్ స్మితా సబర్వాల్‌పై వ్యాపారుల ఒత్తిడి
- ఆగమేఘాల మీద కదులుతున్న ఫైలు
- కొత్త ప్రభుత్వం ఏర్పడేలోపే తతంగం ముగించేందుకు మంత్రాంగం
పేదలను కొట్టి పెద్దలు జేబులు నింపుకోవడమంటే ఇదే. వ్యవసాయ భూములను కారుచౌకగా కొట్టేసిన ‘రియల్’ వ్యాపారులు ఆ భూములనే ఐదింతలు ఎక్కువ చేసి ఏపీఐఐసీకి కట్టబెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ మోసం గురించి తెలుసుకున్న రైతన్న నెత్తీనోరు మొత్తుకుని న్యాయం చేయాలంటూ రెండేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేకుండా పోయింది. సాక్షాత్తూ జాయింట్ కలెక్టరే ఇది ‘రియల్’ మోసం అని నిర్ధారించినా బడుగు రైతులకు న్యాయం జరగడం లేదు. తాజాగా కలెక్టర్‌పై ఒత్తిడి తెచ్చిన వ్యాపారులు.. తమ పథకం అమలు చేసేందుకు పెండింగ్‌లో ఉన్న ఫైల్‌ను ఆగమేఘాల మీద క్లియర్ చేయిస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మసిపూసి ‘మాయ’ చేసి.. అధికారులకు ‘ఆశ’ చూపి... రైతులను అమాయకులను చేసి రూ .కోట్ల ప్రజాధనం కొల్లగొడుతున్న ‘రియల్’ మోసమిది. ఎకరాకు రూ. లక్ష చెల్లించి రైతుల నుంచి కొనుగోలు చేసిన రియల్ వ్యాపారులు గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండానే ఇండస్ట్రీయల్ పార్కుగా మలిచి ఏపీఐఐసీకి ఎకరాకు రూ. 6 లక్షల చొప్పున అంటగట్టేందుకు సిద్ధమయ్యారు.
ధర చెల్లింపు విషయంలో మోసం జరిగిందని బాధిత రైతులు కలెక్టర్‌కు రెండు సంవత్సరాల క్రితం ఫిర్యాదు చేసినా, అవేమీ పట్టించుకోని యంత్రాగం 110 ఎకరాల భూమిని ఏపీఐఐసీకి కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. కలెక్టర్ కార్యాలయంలో దీనికి సంబందించిన ఫైల్ వాయువేగంతో పరుగులు పెడుతోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడే లోగా ఫైల్‌ను క్లియర్ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
రూ.కోట్ల కూడబెట్టే కుట్ర
నంగనూరు మండలం నర్మెట గ్రామ పంచాయతీ పరిధిలోని మైసంపల్లి మదిర గ్రామ శివారులో భూములున్న రైతుల నుంచి 2010లో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు సర్వే నంబర్ 341 నుంచి 350 వరకు సుమారు 110 ఎకరాలను కొనుగోలు చేశారు. అప్పట్లో గ్రామానికి చెందిన రైతులు చంద్రయ్య, ఐలయ్య, రవి, నర్సింహులుతో పాటు మరికొందరు రైతుల నుంచి ఎకరాకు రూ.60 వేల నుంచి రూ. ఒక లక్ష వరకు రైతుల అవసరాలను బట్టి భూమికి ధర నిర్ణయించి కారు చౌకగా భూములు కొట్టేశారు.
అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంతో తమకు ఉన్న పలుకుబడిని ఉపయోగించి ఈ భూమిని అధిక ధరకు ఏపీఐఐసీకి అప్పగించేందుకు పథక రచన చేశారు. జరిగిన మోసాన్ని ఆలస్యంగా గుర్తించిన రైతులు 2011లో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మైసంపల్లి, నర్మెట గ్రామాల రైతుల పిటిషన్‌తో స్పందించిన జేసీ శరత్ 2012లో గ్రామ రెవెన్యూ సదస్సుల్లో ఈ విషయంపై చర్చించారు. రైతులకు అన్యాయం జరిగిందని నిర్ధారించారు. వారికి న్యాయం జరిగిన తర్వాతే ఆ భూముల ను ఇండస్ట్రీయల్ పార్క్‌కు అప్పగించాలని సూచించారు. అప్పటి నుంచి దీనికి సంబంధించిన ఫైల్ పెండింగ్ ఉంది.
కలెక్టర్‌పై ఒత్తిడి
తాజాగా 110 ఎకరాలకు సంబంధించిన ఈ ఫైల్ క్లియర్ చేయించడానికి ఓ వ్యక్తి వ్యాపారుల తో డీల్ కుదుర్చుకుని జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్‌పై ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తోంది. ఒత్తిడికి తలొగ్గిన అధికారులు ఆగమేఘాల మీద ఫైల్ తెప్పించి వ్యాపారులకు అనుకూలంగా క్లియర్ చేస్తున్నట్లు సమాచారం. ఎకరాకు రూ.6 లక్షల చొప్పున 105 ఎకరాలను, ఎకరాకు రూ. 5 లక్షల చొప్పున మరో ఐదు ఎకరాలను మొత్తం దాదాపు రూ. 6.55 కోట్లకు ఏపీఐఐసీకి అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. అంతా సవ్యంగా సాగితే కొత్త ప్రభుత్వం ఏర్పడటానికి ఒక రోజు ముందుగానే సిద్ధం చేసిన చెక్కులు వ్యాపారుల చేతిలోకి వెళ్లిపోయే అవకాశం ఉంది.
కాసులకు కక్కుర్తిపడి
ఈ వ్యవహారంలో రెవిన్యూ అధికారుల ఉదాసీనత కిందస్థాయి నుంచి పై స్థాయి వరకు కనపడుతోంది. గ్రామ పంచాయతీ పరిధిలోని వ్యవసాయ భూములను ఇండస్ట్రీయల్ పార్కుగా మార్చాలంటే కచ్చితంగా గ్రామ పంచాయతీ తీర్మానం ఉండాలి. కానీ పార్కు నిర్మాణానికి సంబంధించి నేటికీ గ్రామ పంచాయతీ తీర్మానం జరగలేదు.
2012 నుంచి రైతులు చేసిన ఫిర్యాదులు పెండింగ్‌లోనే ఉన్నాయి. భూమికి సంబంధించిన పరిహార వ్యవహారాలను పర్యవేక్షించే విభాగం సంగారెడ్డిలో ఉండడంతో రైతులు ఆ కార్యాలయం చుట్టూ ఏళ్లుగా తిరుగుతూనే ఉన్నారు. ఇదేమీ పట్టించుకోకుండా జిల్లా కలెక్టర్ కార్యాలయం గుడ్డిగా ఫైల్ క్లియర్ చేయడానికి సిద్ధంకావడం సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.