‘రియల్’ మాయ..!
సామాన్యుడికి సొంతిల్లు కలగానే మారింది... లక్షల రూపాయలు పోసి కొన్న ప్లాటును దక్కించుకునేందుకు ఎన్నో పాట్లు పడాల్సి వస్తోంది... రియల్ వ్యాపారులు జనం ఆకాంక్షను పెట్టుబడిగా పెట్టి కోట్లు గడిస్తున్నారు. ఇబ్బడి ముబ్బడిగా అనుమతి లేని వెంచర్లను తెరమీదకు తెస్తున్నారు... పంచ రంగుల కరపత్రాలతో ప్రచారం చేసి ప్రజలను మోసగిస్తున్నారు... ఆదిలోనే వీటిని నివారించాల్సిన రెవెన్యూ అధికారులు రియల్ మాయలో పడి కళ్లు మూసుకుంటున్నారు.
⇒ విచ్చలవిడిగా అక్రమ లేఅవుట్లు
⇒ ప్రభుత్వ ఆదాయానికి రూ.కోట్లలో గండి
⇒ మోసపోతున్న కొనుగోలుదారులు
⇒ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ లభించని సమాచారం
⇒ పట్టించుకోని అధికారులు
సంగారెడ్డి క్రైం: పచ్చని పంట పొలాలు కనుమరుగవుతున్నాయి. పట్టణాలు, మండల కేంద్రాలను ఆనుకొని ఉన్న గ్రామాల చుట్టూ అక్రమ లేఅవుట్లు వెలుస్తున్నాయి. జిల్లాలోని సిద్దిపేట, సంగారెడ్డి, జోగిపేట, పటాన్‌చెరు, రామచంద్రాపురం, గజ్వేల్, మెదక్, జహీరాబాద్, తూప్రాన్ తదితర ప్రాంతాల్లో అక్రమ లేఅవుట్లు వందల సంఖ్యలో ఉన్నాయి. అనుమతులు ఉన్న వెన్ని?.. లేనివెన్నో అధికారులకే తెలియని పరిస్థితి. ఇవేవీ తెలి యని అమాయక జనం వాటిని కొనుగోలు చేసి మోసపోతున్నారు. లేఅవుట్ వేయాలంటే వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చాలి.
ఇందుకు మార్కెట్ విలువలో పది శాతం డబ్బులను ప్రభుత్వానికి చెల్లించాల్సి. కానీ జిల్లా లో వందల ఎకరాలను వ్యవసాయేతర భూమిగా మార్చకుండానే లేఅవుట్లు వేయడంతో ప్రభుత్వం రూ.కోట్లలో ఆదాయాన్ని కోల్పోతుంది. అనుమతి పొందిన లేఅవుట్లో పది శాతం భూమిని సామాజిక అభివృద్ధి కోసం వదలాలి. అంటే పది ఎకరాల్లో లేఅవుట్ చేస్తే ఎకరాను వదిలేయాలి. ఇందుకు ససేమిరా అంటున్న రియల్ వ్యాపారులు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. లే అవుట్లలో మౌలిక వసతులు కల్పించే అంశాన్ని విస్మరిస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల ఉదాసీనత, మామూళ్ల మత్తు కారణంగానే అక్రమ లే అవుట్లు విచ్చలవిడిగా వెలుస్తున్నాయి.
పంచాయతీలు, మున్సిపాలిటీలకు ఇది ఆదాయ వనరుగా మారాయన్న విమర్శలున్నాయి. అగ్రికల్చర్ ల్యాండ్‌ను వ్యవసాయేతర భూమిగా మార్చకుండా లేఅవుట్ చేస్తే రెవెన్యూ అధికారులు అడ్డుకోవాలి. కానీ వారు అవినీతిపరులకే వత్తాసు పలుకుతున్నారు. పంచాయతీ, మున్సిపాలిటీల తీర్మానం తర్వాత విస్తీర్ణం అనుసరించి జిల్లా టౌన్ ప్లానింగ్, రీజినల్ డెరైక్టరేట్ ఆఫ్ టౌన్ ప్లానింగ్‌కు పంపాలి. అన్నీ పకడ్బందీగా ఉంటేనే వారు అనుమతిస్తారు.
కానీ ప్రతి దశలోనూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నా పట్టించుకునే వారే లేకుండా పోయారు. మామూళ్లు తగ్గినప్పుడే రెవెన్యూ అధికారులు అక్కడక్కడా దాడులు చేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఏయే సర్వే నంబర్లలో ఎంత విస్తీర్ణంలో లేఅవుట్ వేశారన్న అధికారిక సమాచారాన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రభుత్వం అందుబాటులో ఉంచాలి. అనుమతి ఉన్న లే అవుట్లలోనే ప్లాట్లు చేయాలన్న నిబంధన గట్టిగా విధించాలి. ఇలా చేస్తేనే అక్రమాలను అరికట్టేందుకు అవకాశం ఉంటుంది.