అదో పంట కాల్వ.. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎమ్మార్పీ) పరిధిలోని డి-10,11 డిస్ట్రిబ్యూటరీ అని ఆ కాల్వను పిలుస్తారు. పెద వూర మండలంలో ఉన్న ఆ కాల్వ ద్వారా నీళ్లు వస్తే రైతులు పంటలు పండించుకుని దర్జాగా బతకొచ్చు. కానీ రియల్టర్ల కళ్లు పడ్డాయి. దర్జాగా ఆక్రమించేసి వ్యాపారం చేసుకుంటున్నారు. కాల్వను చదును చేసి మరీ ప్లాట్లు చేసేస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఇదో.. రైతులను నట్టేటా ముంచే రియల్‌దందా.. ఇప్పటికే నీళ్లు రాక అల్లాడుతున్న రైతాంగం వెతలను పట్టించుకోకుండా ఆ కాల్వలను రియల్ వ్యాపారులు దర్జాగా కబ్జా చేసి తమ భూముల విలువ పెంచుకుంటున్నారు. డిస్ట్రిబ్యూటరీ కాల్వలో ప్రైవేటు గూనలు వేసి తాత్కాలికంగా మూసివేశారు. యంత్రాల సాయంతో చదును చేసి మరీ యథేచ్ఛగా వ్యాపారం చేసుకునేందుకు ముమ్మరంగా పనులు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా సాగునీటి శాఖ అధికారులకు ఏమీ పట్టడం లేదు. ప్రభుత్వ సొమ్ములు పెట్టి రైతుల నుంచి సేకరించిన భూమిని పంటకాల్వ సరిహద్దుగా, తనిఖీలకు దారిగా ఉపయోగించుకునే వీలు లేకుండా పది రోజుల నుంచి ఏకంగా కాల్వను 200 మీటర్లకు పైగా మూసివేస్తున్నా అటువైపు కన్నెత్తి చూడడం లేదు. పెదవూర గ్రామశివారులో జరుగుతున్న ఈ భూదందా విషయంలో సాగునీటి శాఖ అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రైతులకు నీళ్లు రాకున్నా వ్యాపారులకు కాసుల పంట పండాలంట..!
వాస్తవానికి ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు ద్వారా పెదవూర మండల కేంద్రం వరకు సజావుగా నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. మండలంలోని సంగారం సమీపంలో తవ్విన కాల్వల వద్దే ఎత్తుపల్లాలు ఉండడంతో మండల కేంద్రం శివారు వరకు వచ్చి నీ ళ్లు ఆగిపోయే పరిస్థితి. అక్కడి వరకు ఉన్న కాల్వల ద్వారా కేవలం వందల సంఖ్యలోనే ఎకరాల్లో పంటలు పండించుకుంటున్నారు రైతులు. అయితే, హైదరాబాద్ రోడ్డులో ఉన్న పెట్రోలు బంక్ ఎదురుగా ఉన్న భూమిని రియల్ వ్యాపారం ద్వారా అమ్మి సొమ్ము చేసుకోవాలనే ఆలోచనతో కొందరు వ్యాపారులు ఆ కొంచెం కూడా రైతులకు దక్కకుండా చేస్తున్నారు. అక్కడ ఉన్న డిస్ట్రిబ్యూటరీ కాల్వను గూనల ద్వారా మూసివేసి ఆ భూమిని రోడ్డు మీదకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. 20 రోజుల నుంచి ఈ భూమిలో రియల్ పనులు జరుగుతుండగా, 10 రోజుల క్రితం ఈ కాల్వను పూడ్చివేసి అటూ ఇటూ చిన్న సైజు గూనలు వేసినట్టు సమాచారం. దీంతో ఆ భూమి రోడ్డు ఫేసింగ్‌కు వచ్చి రేటు పలుకుతుందనేది వ్యా పారుల ఆలోచన. అయితే, ఈ కాల్వను పూడ్చివేయడం ద్వారా తమకు నష్టం జరుగుతుందని సమీప రైతులు వాపోతున్నా అటు రియల్ వ్యాపారులు కానీ, ఇటు సాగునీటి శాఖ అధికారులు కానీ పట్టించుకోకపోవడం గమనార్హం.
సాగునీటితో పాటు తాగునీటికి కష్టాలే
డిస్ట్రిబ్యూటరీ కాల్వను పూడ్చివేసి కేవలం గూనల ద్వారా నీళ్లు వెళ్లేలా ప్రైవేటు వ్యాపారులు చేస్తున్న ఈ ప్రయత్నాలు భవిష్యత్తులో అక్కడి రైతాంగానికి నష్టం కలిగిస్తుందని స్థానికులంటున్నారు. కాల్వ పక్కనే ఉన్న ప్రైవేటు భూమిలోనికి వెళ్లే దారి కోసం ఎక్కడో ఒక చోట మార్గం ఏర్పాటు చేసుకోవచ్చు కానీ ఏకంగా 200 మీటర్ల మేర కాల్వను పూడ్చివేయడం ఎంతవరకు సమంజసమనేది వారి ప్రశ్న. అయితే, ఈ కాల్వ మీదనే ఇప్పుడు రియల్‌ఎస్టేట్ వ్యాపారానికి సిద్ధమవుతున్న భూమికి సమీపంలోనే ఓ స్పిన్నింగ్‌మిల్ ఉంది. ఈ మిల్లుకు వెళ్లేందుకు గాను వాహనాల రాకపోకల కోసం కాల్వను కొంత పూడ్చివేసి గూనలు ఏర్పాటు చేశారు. అంతవరకు బాగానే ఉంది కానీ ఏకంగా ఫర్లాంగుల మేర కాల్వను పూడ్చడం తమకు నష్టం కలిగిస్తుందని రైతులంటున్నారు. ఇదే భూమికి ఎదురుగా మరో కాల్వ కూడా ఉంది. ఆ కాల్వకు, డిస్ట్రిబ్యూటరీకి ఉన్న లింకు కూడా ఈ గూనల ఏర్పాటుతో తొలగిపోయింది.
దీంతో భవిష్యత్తులో కాల్వల మరమ్మతులు చేయాలన్నా, కాల్వలకు సీసీలైనింగ్ ఏర్పాటు చేయాలన్నా కష్టమవుతుందనేది రైతుల వాదన. అంతేకాకుండా చిన్న చిన్న గూనల ఏర్పాటు చేస్తే ఎక్కడయినా నీరు ఆగిపోతే ఎలా సవరిస్తారు.. నీటిని సక్రమంగా వెళ్లే ఏర్పాట్లు ఎలా చేస్తారనేది అంతుపట్టడం లేదని రైతులంటున్నారు. దీనిపై ఎన్నోసార్లు ఏఎమ్మార్పీ ఇంజినీర్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, తమ పరిధిలోనికి రాదంటే తమ పరిధిలోనికి రాదని దాటవేస్తున్నారని వారంటున్నారు. వాస్తవానికి ఈ భూమి స్థానిక రాజకీయ నాయకుడిదే అయినా, హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి దాన్ని కొని రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వినియోగించుకుంటున్నాడని, స్థానికంగా కొందరిని, అధికారులను ప్రలోభపెట్టి యథేచ్ఛగా కాల్వను మూసివేశారని రైతులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో సాగునీటి శాఖ అధికారులు ఇప్పటికయినా దృష్టి సారించి రైతాంగానికి నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
మరోవైపు ఈ కాల్వను సజావుగా పెదవూర మండల కేంద్రంలోనికి తీసుకెళ్తే పెదవూర చెరువుకు నీటిని సరఫరా చేయవచ్చని, అక్కడి నుంచి ఇప్పటికే మూడు గ్రామాలకు తాగునీరు వెళ్లే స్కీం ఒకటి పనిచేస్తోందని స్థానికులంటున్నారు. భవిష్యత్తులో ఈ స్కీంను మరింత విస్తరించి ఆరేడు గ్రామాలకు నీటిని సరఫరా చేయాలన్న ఆలోచన ఉందని, ఇప్పుడు ఈ ప్రైవేటు గూనలతో ఆ ప్రతిపాదన అటకెక్కినట్టేనని వారంటున్నారు. ఇదిలా ఉంటే, గూనలు వేసి తమ భూమిని రోడ్డు ఫేసింగ్‌కు తెచ్చుకున్న రియల్ వ్యాపారులు ఇప్పుడు అక్కడ షట్టర్లు వేసి ఒక్కో షట్టర్‌ను 3-4లక్షల రూపాయలకు విక్రయించేందుకు కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సాగునీటి శాఖ అధికారులు ఈ గూనలతో చేస్తున్న రియల్ వ్యాపారంపై దృష్టి సారించి రైతులకు నష్టం కలగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాల్సిందే.
దర్జాగా కబ్జా..!
Published Wed, Mar 11 2015 12:42 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement