లంక జెండాల దహనం
చెన్నై, సాక్షి ప్రతినిధి: తమిళజాలర్ల సమస్యల పరిష్కారం కోసం ప్రధాని నరేంద్రమోడీకి ముఖ్యమంత్రి జయలలిత రాసిన ఉత్తరాలను కించపరుస్తూ శ్రీలంక ఆర్మీ వెబ్‌సైట్‌లో కార్టూన్ వేసిన సంగతి పాఠకులకు విదితమే. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అయ్యాయి. పార్లమెంట్ ఉభయసభలు ఈఅంశంపై అట్టుడికి పోయాయి. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రం మొత్తం ఏకమై శ్రీలంక వైఖరిని ఎండగ ట్టింది. చెన్నై నుంగంబాక్కంలోని శ్రీలంక సహాయ రాయబార కార్యాలయాన్ని రాష్ట్రం నుంచి తొలగించాలని, లేకుంటే దానిపై దాడులకు దిగుతామని సోమవారం నాటి ధర్నాలో కోలీవుడ్ హెచ్చరించింది.
కొందరు ఆందోళనకారులు మంగళవారం రాయబార కార్యాలయం వైపు ర్యాలీగా బయలుదేరారు. పోలీసులు వారిని మధ్యలోనే అడ్డుకునే ప్రయత్నం చేయడంతో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు అడ్డుకుంటున్నా లెక్కచేయక కొందరు ఆందోళనకారులు అకస్మాత్తుగా శ్రీలంక జాతీయ పతాకాలను బయటకు తీసి దహనం చేశారు. వాటిని ఆర్పేందుకు పోలీసులు విఫలయత్నం చేశారు. శ్రీలంక వైఖరికి నిరసనగా అల్లర్లు కొనసాగడంతో నగరంలో ఆ దేశానికి సంబంధించిన అన్ని కార్యాలయాలు, సంస్థలకు బందోబస్తును ఏర్పాటు చేశారు.