లా విద్యార్థుల రగడ
సాక్షి, చెన్నై : బ్రాడ్ వేలోని అంబేద్కర్ లా కళాశాల పురాతనమైనది. మెట్రో రైలు పనులకు ఈ భవనం ఆటంకం కల్పిస్తోంది. దీంతో అక్కడి లా కళాశాలను మరో చోటకు మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు తగ్గ ఏర్పాట్లను న్యాయశాఖ అధికారులు వేగవంతం చేశారు. శ్రీ పెరంబదూరుకు ఈ కళాశాలను తరలించే విధంగా కార్యాచరణను సిద్ధం చేశారన్న సమాచారంతో విద్యార్థుల్లో ఆగ్రహం రేగింది. రెండు మూడు రోజులుగా విద్యార్థులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
కళాశాల తరలింపు ఖాయం చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో బుధవారం విద్యార్థుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నగరంలో ఉన్న కళాశాలను మరో చోటకు మార్చడంతో ద్వారా శ్రమతో పాటుగా తీవ్ర కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ విద్యార్థులు మధ్యాహ్నం రోడ్డెక్కారు.
ట్రాఫిక్ పద్మవ్యూహం: కళాశాలను తొలగించేందుకు వీలు లేదని, అందుకు తగ్గ పనుల్ని నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది లా విద్యార్థులు బ్రాడ్‌వే మార్గంలో బైఠాయించారు. ఈ హఠాత్పరిణామంతో ఆ పరిసరాల్లో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగాయి. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి విద్యార్థులను బుజ్జగించేందుకు తీవ్రంగానే ప్రయత్నించారు. ఈ క్రమంలో పలుమార్లు విద్యార్థులు, పోలీసుల మధ్య తోపులాట, వాగ్యుద్ధం చోటు చేసుకుంది.
విద్యార్థులు 4 గంటల పాటుగా బైఠాయించడంతో ఉత్తర చెన్నై పరిసరాల్లో పాటుగా, మెరీనా తీరం, మౌంట్ రోడ్డు పరిసరాలు ట్రాఫిక్ పద్మ వ్యూహంలో చిక్కాయి. పలు మారా్గాల్లో వాహనాల్ని టేక్ డైవర్షన్లు తీసుకునే రీతిలో ఏర్పాట్లు చేసినా, చిన్న చిన్న సందుల్లో సైతం వాహనాలు ఆగాయి. ఎక్కడికక్కడ వాహనాలు పలు ప్రాంతాల్లో ఆగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురి కాక తప్పలేదు. ఓ దశలో విద్యార్థుల్ని బుజ్జగించే ప్రయత్నంలో కొందరు పోలీసు సిబ్బంది దురుసుగా వ్యవహరించారన్న ఆరోపణ బయలు దేరింది. అదే సమయంలో కొందరు విద్యార్థులు పోలీసులపై తిరగబడ్డట్టు, దాడికి దిగినట్టు సమాచారం.
దీంతో విద్యార్థులపై లాఠీలు ఝుళిపించి చెదరగొట్టారు. ఈ క్రమంలో ఆ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొందరు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో విద్యార్థుల్లో ఆగ్రహం బయలు దేరింది. ఆ పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గట్టి భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. 4 గంటల ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని ఛేదించేందుకు వాహన చోదకులు తంటాలు పడగా, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు చెమటోడ్చాల్సి వచ్చింది.
లాఠీచార్జ్‌పై ఆగ్రహం: లా విద్యార్థులపై లాఠీ చార్జిని న్యాయవాద సంఘాలు, విద్యార్థి సం ఘాలు ఖండిస్తున్నాయి. కనిపించిన వారిని ఇష్టానుసారంగా పోలీసులు చితగ్గొట్టడాన్ని తీవ్రంగా పరిగణించాయి. అరెస్టు చేసిన క్రమంలో, వ్యాను లో ఎక్కుతున్న విద్యార్థులపై సైతం పోలీసులు లాఠీ ఝుళిపించడాన్ని వ్యతిరేకిస్తూ, విద్యార్థి సంఘాలన్నీ ఏకమవుతున్నాయి.