సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో గెలుపు అంచనాలపై ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు నిమగ్నమయ్యాయి. 1957 తర్వాత భారీగా పోలింగ్ నమోదు కావడంతో... ఇది దేనికి సంకేతమో అర్థం కాక పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. కేంద్రంలోని యూపీఏ సర్కారుకు వ్యతిరేంగా ఓటర్లు స్పందించారని బీజేపీ చెబుతుంటే, సిట్టింగ్ ఎంపీలకు వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయని కాంగ్రెస్ అంచనా వేస్తోంది.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, రాష్ర్టం నుంచి 20 సీట్లు తప్పక గెలిపించి ఇస్తానని అధిష్టానానికి భరోసా ఇచ్చినట్లు చెబుతున్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకు పోవడం ఖాయమని తేలిన నేపథ్యంలో, ఆ నష్టాన్ని కర్ణాటక నుంచి భర్తీ చేయాలని అధిష్టానం సిద్ధరామయ్యకు సూచించినట్లు సమాచారం. అధికారంలో ఉండడం, ఇంకా ఏడాది పూర్తి కాకపోవడం...లాంటి కారణాల వల్ల కాంగ్రెస్‌పై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడే అవకాశాల్లేవని పార్టీ భావిస్తోంది.
కేంద్రంలో అధికారం వైపు దూసుకు పోవడానికి ప్రయత్నిస్తున్న బీజేపీకి కళ్లెం వేయాలంటే, కర్ణాటకలో ఎక్కువ సంఖ్యలో సీట్లు గెలుచుకోవాలన్నది కాంగ్రెస్ వ్యూహం. తాను అధికారంలోకి వచ్చే అవకాశం లేకపోయినా, బీజేపీకి ఆ ఛాన్సు ఇవ్వకూడదనే దిశగా కాంగ్రెస్ ఆలోచనలు సాగుతున్నాయి. అవసరమైతే తృతీయ ఫ్రంట్‌కు వెలుపలి నుంచి మద్దతునిచ్చి, బీజేపీని నిలువరించాలని కాంగ్రెస్ నిశ్చితాభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది.
కనుక బీజేపీకి ఎక్కువ విజయావకాశాలున్న కర్ణాటకలో, ఆ పార్టీని దెబ్బ కొట్టాలని అధిష్టానం ఇదివరకే సీఎంకు సూచించినట్లు తెలిసింది. మరో వైపు ఇరవైకి పైగా స్థానాల్లో గెలుపొందుతామని కాంగ్రెస్ నాయకులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. హీన పక్షం 17 స్థానాల్లో గెలుపు ఖాయమని ధీమాతో ఉన్నారు. బీజేపీకి పెట్టని కోటల్లా ఉన్న పలు నియోజక వర్గాల్లో కూడా ఈసారి గెలుపును సొంతం చేసుకుంటామని వారు ఆత్మ విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నారు. మరో వైపు బీజేపీ కూడా మెజారిటీ స్థానాల్లో గెలుపు ఖాయమనే విశ్వాసంతో ఉంది. మోడీ ప్రభంజనం కారణంగానే భారీ పోలింగ్ నమోదైనట్లు ఆ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.
ఊహల్లో నేతలు
Published Sat, Apr 19 2014 3:24 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement