మెరుపుదాడుల వ్యూహకర్త | Lightning strikes Planner | Sakshi
Sakshi News home page

మెరుపుదాడుల వ్యూహకర్త

Published Tue, Oct 25 2016 3:43 AM | Last Updated on Mon, Sep 4 2017 6:11 PM

మెరుపుదాడుల వ్యూహకర్త

మెరుపుదాడుల వ్యూహకర్త

ముగిసిన కిష్టయ్య ఉద్యమ ప్రస్థానం
  రెండు దశాబ్దాలకు పైగా పోరుబాటలోనే..
  మిలిటెంట్ నుంచి అంచలంచెలుగా అగ్రనేతగా..
  సాంబశివుడు, నయీమ్‌కు ఇతడే గురువు
26 ఏళ్లుగా ఇంటిముఖమే చూడని వైనం

సాక్షి, యాదాద్రి/వలిగొండ: మిలిటెంట్‌గా చేరి అంచలంచెలుగా మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగిన శ్యామల కిష్టయ్య అలియాస్ దయూ 26 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం ముగిసింది. యాదాద్రి జిల్లా వలిగొండ మండలం దాసిరెడ్డిగూడేనికి చెందిన చంద్రమ్మ, రామయ్య దంపతుల ఆరో సంతానం కిష్టయ్య. విద్యార్థి దశలోనే పీపుల్స్‌వార్ ఉద్యమంలోకి వెళ్లాడు. భువనగిరి ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్ కాలేజీలో బీకాం చదువుతూ 1990లో ఆర్‌ఎస్‌యూ వైపు ఆకర్షితుడయ్యాడు. ఆలేరు, కృష్ణపట్టె దళాల్లో మిలిటెంట్ గా పనిచేస్తూ వలిగొండ, భువనగిరి, ఆలేరుతోపాటు జిల్లాలోని పలువురిని ఉద్యమ బాట పట్టించాడు.

హైదరాబాద్‌లో పీపుల్స్‌వార్ ప్రచార దళాల్లో పని చేస్తూ ఉద్యమంలో పూర్తిస్థాయిలో నిమగ్నమయ్యాడు. కిష్టయ్యకు మెరుపుదాడుల వ్యూహకర్తగా పేరుంది. సాయుధ గెరిల్లా నక్సల్స్ శిక్షకుడిగా, సాంకేతిక విభాగం సభ్యుడిగా, మిలటరీ ప్లటూన్ నాయకుడిగా పనిచేశాడు. పోలీసులు పలుమార్లు వచ్చి ‘మీ కుమారుడిని ఉద్యమంలోంచి బయటకు రమ్మని చెప్పండి’ అంటూ కిష్టయ్య తల్లిదండ్రులకు చెప్పారు. అప్పటి నల్లగొండ జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్, ఓఎస్డీ వెంకటేశ్వర్లు 2015లో కిష్టయ్య ఇంటికి వెళ్లి ఆయన తల్లి, సోదరులను కలిశారు. కిష్టయ్య లొంగి పోతే ఆయనపై ఉన్న రూ.20 ల క్షల రివార్డు ఇప్పిస్తామని, బతుకుదెరువుకు సహకరిస్తామని చెప్పారు. అయినా కిష్టయ్య ఏనాడు ఇంటివైపు చూడలేదు. ఆ యనకు ముగ్గురు అక్కలు, ఇద్దరు అన్నలు ఉన్నారు.

నయీమ్‌ను చేర్పించాడు
పీపుల్స్‌వార్ ఉద్యమంలో రాష్ట్ర కార్యదర్శి స్థాయికి ఎదిగిన సాంబశివుడు, గ్యాంగ్‌స్టర్‌గా మారిన నయీమ్‌తో పాటుమరెందరినో కిష్టయ్య పీపుల్స్‌వార్‌లో చేర్పించాడు. వలిగొండలోనే పదో తరగతి వరకు డిగ్రీ భువనగిరిలో చదివాడు. ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్ కళాశాలలో చదువుతుండగా అదే కాలేజీలో విద్యనభ్యసిస్తున్న నయీమ్‌ను చేర్పించాడు. అలాగే అతడి స్వగ్రామమైన దాసిరెడ్డిగూడెంలో సాంబశివుడు, అతడి సోదరుడు కొనపురి రాములు, రాపోలు స్వామిని ఉద్యమ బాట పట్టించాడు. వలిగొండలో పీపుల్స్‌వార్‌కు ఎందరో ముఖ్య కార్యకర్తలను, నాయకులను, సానుభూతిపరులను తయారు చేసిన నాయకుడని కిష్టయ్య గురించి తెలిసినవారు చెబుతారు. సహచర ఉద్యమకారిణి సుభద్ర అలియాస్ స్వర్ణ అలియాస్ లతను కిష్టయ్య వివాహమాడాడు. ఆమె వరడలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందింది.

26 ఏళ్లుగా ఇంటి ముఖం చూడకుండా..
పీపుల్స్‌వార్‌లోకి వెళ్లిన కిష్టయ్య తన 26 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో ఒక్కరోజు కూడా ఇంటిముఖం చూడలేదు. నిరుపేదలైన  తల్లిదండ్రులు అవస్థలు పడుతున్నా పట్టించుకోలేదు. కనీసం ఫోన్ కూడా చేయలేదు. ఇప్పుడు తన కొడుకు ఎలా ఉంటాడోనని తల్లి చంద్రమ్మ అప్పుడప్పుడు ఆవేదన చెందుతుండేది. గ్రామస్తులకు కూడా ఆయన పేరు తప్ప ఆయన ఉనికి తెలియదు.

బుల్లెట్ గాయూలతో తప్పించుకుని
కిష్టయ్యకు గన్‌మన్‌గా దాసిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన రాపోలు స్వామి ఉండేవాడు. ఉత్తరాంధ్ర(ఇప్పుడు ఏఓబీ)లో పనిచేస్తుండగా 2008లో పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో స్వామి మృతి చెందాడు. అప్పుడు కిష్టయ్య బుల్లెట్ గాయాలతో తప్పించుకున్నాడు. ఉద్యమం కోసం జీవితాంతం తపించిన కిష్టయ్య తాజాగా ఏవోబీ ఎన్‌కౌంటర్‌లో మరణించడంతో అతడి సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానానికి తెరపడింది. తన కుమారుడి ఆఖరిచూపైనా చూడలేకపోయానని తల్లి చంద్రమ్మ విలపిస్తోంది.
 
అంతా అక్కడినుంచే..
దాసిరెడ్డిగూడెం ఉద్యమకారులకు పుట్టినిల్లుగా మారింది. కొనపురి అయిలయ్య అలియాస్ సాంబశివుడు, కొనపురి రాములు, రాపోలు స్వామి వీరంతా ఈ గ్రామానికి చెందిన వారే. వీరిలో రాపోలు స్వామి 2009లో ఎన్‌కౌంటర్‌లో మృతి చెందా డు. కొనపురి సోదరులు ఉద్యమం నుంచి బయటకు వచ్చాక (సాంబశివుడు 2011లో, రాములు 2014లో) హత్యకు గురయ్యారు. కిష్టయ్య మృతి తో దాసిరెడ్డిగూడెంలో మావోయిస్టుల చరిత్ర ముగిసినట్టయింది.
 
గణేశ్‌తో ఉద్యమ బంధం
గణేశ్ సహచరుడు కిష్టస్వామి
సాక్షి, భూపాలపల్లి: ఎన్‌కౌంటర్‌లో మరణించిన గాజర్ల రవి అలియాస్ గణేశ్‌తో తనది తీరని బం ధమని బండి కిష్ట స్వామి పేర్కొన్నారు. వీరిద్దరిదీ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశా ల గ్రామం. గణేశ్, తాను చిన్నప్పటి నుంచి ఒకే ఊరిలో పెరిగామని, కలసి చదువుకున్నామని కిష్టస్వామి గుర్తుచేసుకున్నారు. 1992లో ఒకేసారి అజ్ఞాతంలోకి వెళ్లి, ఉత్తర తెలంగాణ ఫారెస్ట్ డివిజన్ కమిటీల్లో 1992-1999లో పనిచేసినట్లు చెప్పారు. తాను మహదేవాపూర్ దళంలో, గణేశ్ ఏటూరునాగారం దళంలో చేరామన్నారు.

8 నెలలకే ఏటూరునాగారం దళ కమాండర్‌గా గణేశ్ ఎదిగాడని, మహదేవపూర్ లెంకలగడ్డ దాడిలో ఇద్దరం పాల్గొన్నట్లు తెలిపా రు. 1997 మేలో ఖమ్మం జిల్లా వెంకటాపురం,  చత్తీస్‌గఢ్ సరిహద్దులో నుంచి 11 మంది చొప్పున 2 బృందాలతో వస్తుండగా పోలీసులు కాల్పులు జరిపారని, కాల్పుల్లో తన భార్య జ్యో తి మరణించగా, మృతదేహాన్ని అక్కడే వదిలి వెళ్లామన్నారు. ప్రతిగా పాల్వంచ ఇంటెలిజెన్స్ ఎస్‌ఐని పీపుల్స్‌వార్ చంపినట్లు తెలిపారు.
 
త్యాగాలు తప్పవు
గణేశ్ సోదరులు సమ్మయ్య, అశోక్
సాక్షి, భూపాలపల్లి/ చిట్యాల: ఉద్యమంలోకి వెళ్లిన వారు, వారి కుటుం బాలకు త్యాగాలు తప్పవని మావోయిస్టు గణేశ్ సోదరులు అశోక్ అలి యాస్ ఐతు, సమ్మయ్య పేర్కొన్నారు. ‘ప్రజలను భూస్వాములు పీడించారు. పోలీసులు అమాయకులను ఇబ్బందులు పెట్టారు. దానికి అన్న సారన్న అలియాస్ ఆజాద్ తొలుత ఎదురు తిరిగాడు. తర్వాత మేమూ ఆ బాటలో నడిచాం. అనారోగ్య కారణాలతో నేను మధ్యలో లొంగిపోయా. గణేశ్ కొనసాగాడు’ అని అశోక్ చెప్పారు. 2009లో ఎన్‌కౌంటర్‌లో గణేశ్, అశోక్ చనిపోయినట్లు పోలీసులు ప్రకటించారని, వెళ్లి చూస్తే అదేమీ లేదని సమ్మయ్య చెప్పారు. ఇప్పుడు మృతుల్లో గణేశ్ ఉన్నట్లు చెబుతున్నారని, స్వయంగా చూస్తే కానీ నమ్మలేమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement