వేర్వేరు ప్రాంతాల్లో పిడుగుపాటుకు ముగ్గురు మహిళల మృతి
నాగర్‌కర్నూల్ (బిజినేపల్లి)/వనపర్తి రూరల్/ న్యాల్‌కల్ (జహీరాబాద్): రాష్ట్రంలో పిడుగుల ధాటికి ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని మమ్మాయిపల్లి గ్రామానికి చెందిన పాడి రైతు నక్క నీలమ్మ (40) తన అక్క నాగేంద్రమ్మతో కలిసి గేదెలను మేత కోసం తీసుకెళ్లారు. మధ్యాహ్నం వర్షం పడుతుండటంతో నీలమ్మ చెట్టు కిందికి వెళ్లగా.. పిడుగుపడింది. దీంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. నీలమ్మ అక్క నాగేంద్రమ్మ పిడుగుపాటుకు స్పృహ కోల్పోయింది.
మరో ఘటనలో వనపర్తి మండలం చిమనగుంటపల్లికి చెందిన పద్మమ్మ (40) ఆదివారం ఉదయం గొర్లను మేతకు తీసుకొని నల్లగుట్టకు వెళ్లింది. సాయంత్రం పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందింది. కాగా, సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ మండలం న్యామతాబాద్ గ్రామానికి చెందిన ఏసప్ప భార్య బూచినెల్లి నాగమ్మ (42) శనివారం పొలానికి వెళ్లింది. సాయంత్రం గాలి వాన రావడంతో ఇంటికి బయలుదేరగా, గ్రామ సమీపంలో పెద్ద శబ్ధంతో పిడుగుపడింది. దీంతో నాగమ్మ స్పృహ తప్పి కింద పడిపోయింది. గమనించిన కుటుంబ సభ్యులు బీదర్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
Comments
Please login to add a commentAdd a comment