రుణమాఫీ చేయాల్సిందే | Loan waiver must | Sakshi
Sakshi News home page

రుణమాఫీ చేయాల్సిందే

Published Sat, Jul 18 2015 4:22 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

రుణమాఫీ చేయాల్సిందే - Sakshi

రుణమాఫీ చేయాల్సిందే

 ముంబై: రుణమాఫీపై ప్రతిపక్షాలు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. రుణమాఫీతోనే రైతులు వ్యవసాయ సంక్షోభం నుంచి బయటపడతారని, ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం మాఫీ చే సి తీరాలని,  శుక్రవారం అసెంబ్లీలో కాంగ్రెస్-ఎన్సీపీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. రైతు సమస్యలపై అసెంబ్లీలో రెండో రోజూ చర్చ కొనసాగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ సభ్యుడు పృథ్విరాజ్ చవాన్ మాట్లాడుతూ.. అకాల వర్షాలు, కరువు, వడగళ్ల వాన వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతుల సమస్యలు రుణమాఫీతోనే తీరుతాయన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస కూల్చే ప్రయత్నం చేయొద్దని, ఆ వ్యవస్థను పటిష్టం చేసి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

చెరకుకు సరైన మద్దతు ధర ప్రకటించకపోవడంపై చవాన్ తీవ్రంగా మండిపడ్డారు. ఇందుకు సంబంధించి కేంద్రంతో చర్చించాలన్నారు. 2008లో తాము రైతులకు రూ. 72,000 కోట్ల ప్యాకేజీ ఇచ్చామని, ప్రస్తుత ప్యాకేజీ కనీసం రూ. 1.5 లక్షల కోట్లు ఉండాలన్నారు. రైతు సమస్యలకు మాఫీ తప్ప మరో పరిష్కారం లేదని ఎన్సీపీ నేత జయంత్ పాటిల్ అన్నారు. సహజ విపత్తుల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతిపై ఆధారపడి వ్యవసాయం చేయలేరన్నారు. వాగ్దానాల అమలుపై ప్రభుత్వం నివేదిక ఇవ్వాలని డిమాండ్ చేశారు. చర్చలోని ప్రశ్నలకు సీఎం ఫడ్నవీస్ సోమవారం సమాధానం చెప్పనున్నారు.  

 చుక్క నీరు పోనివ్వం: సీఎం
 దామన్‌గంగ ప్రాజెక్టు నుంచి చుక్క నీరు కూడా గుజరాత్‌కు ఇవ్వబోమని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తేల్చి చెప్పారు. శుక్రవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. రాష్ట్ర వాటా నుంచి నీటిని ఇతర రాష్ట్రాలకు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వమని వెల్లడించారు. దామన్ గంగ-పింజల్ ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వాలు చేసిన తప్పును తాము సరిచేశామని చెప్పారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య సమాచారానికి సంబంధించి ఎన్పీపీ నేత ఛగన్ భుజబల్ ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు అడిగారు. ముప్పై ఏళ్లుగా గత ప్రభుత్వాలు నీటి సామర్థ్యాన్ని 132 టీఎంసీలకు మించి పెంచలేకపోయాయన్నారు.

ప్రస్తుత ప్రభుత్వం దీనిపై ఏవిధమైన చర్యలు తీసుకున్నాయని ప్రశ్నించారు. దీనిపై నీటి వనరుల సహాయ మంత్రి విజయ్ శివ్‌తారే మాట్లాడుతూ.. నదుల అనుసంధాన ప్రక్రియలో ప్రాజెక్టును చేర్చాలని కేంద్రాన్ని కోరినట్లు ఆయన వెల్లడించారు. 30 టీఎంసీల నీటిని పొందే విధంగా ప్రాజెక్టు వాటర్ టన్నెల్ నిర్మాణాలను కూడా మార్పు చేశామన్నారు. ప్రాజెక్టు గురించి మంత్రి పూర్తిగా వివరించినప్పటికీ నీరు గుజరాత్‌కు తరలిపోతోందని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని దుయ్యబట్టాయి. దీంతో సీఎం మాట్లాడుతూ.. సమస్యను రాజకీయం చేయకుండా కొత్త ప్రభుత్వానికి సహకరించాలని ప్రతిపక్షాలను కోరారు. రాష్ట్ర వాటాలోని నీటిని ఎవ్వరికీ ఇవ్వబోమని చెప్పారు.

 హర్సిల్ అల్లర్లపై దద్దరిల్లిన అసెంబ్లీ
 నాసిక్‌లోని హర్సిల్ పట్టణంలో జరిగిన హింసపై శుక్రవారం అసెంబ్లీ దద్దరిల్లింది. సమస్యాత్మక ప్రాంతంలో పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు దుయ్యబట్టాయి. సీపీఎం నేత జీవ పండు గావిత్ అసెంబ్లీలో ఈ ప్రశ్నను లేవనెత్తారు. ఇంతకుముందు రెండు సార్లు గావిత్ ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని  అసెంబ్లీ తిరస్కరించింది. సమస్యపై చర్చిండానికి ఇచ్చిన నోటీసులను తిరస్కరించినప్పట్టికీ, క్షేత్రస్థాయిలో సమస్య తీవ్రత గురించి తె లియజేయడానికి తనకు అవకాశం ఇవ్వలేదని వాపోయారు. సమస్యల గురించి ప్రతిపక్షాలు ప్రశ్నించకుండా చైర్ అడ్డుకుంటోందని ఎన్సీపీ నేత జయంత్ విమర్శించారు.

హర్సిల్ పట్టణంలో హింసను అదుపుచేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. దీనిపై మంత్రి గిరీశ్ మహాజన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం హర్సిల్‌లో పరిస్థితి సాధారణంగా ఉందని, పట్టణంలో తాను రెండు సార్లు పర్యటించానని, ప్రస్తుతం అక్కడ శాంతి వాతావరణం ఉందని చెప్పారు. అసెంబ్లీ వ్యవహారాల మంత్రి ప్రకాశ్ మెహతా మాట్లాడుతూ.. హింసకు సంబంధించి సోమవారం సభలో ప్రకటన విడుదల చేస్తామన్నారు. మంగళవారం హర్సిల్ పట్టణంలో జరిగిన ర్యాలీ హింసాత్మకంగా మారింది.

పోలీసులు కాల్పులు జరపడంతో ఓ వ్యక్తి (రాందాస్ బుధడ్) మృతి చెందాడు.  ర్యాలీలో అల్లరిమూకలన నియంత్రించే క్రమంలో 12 మందికి పైగా పోలీసులు కూడా గాయపడ్డారు. రాళ్లు రువ్వడం వల్ల 49 షాపులు, 14 ఇళ్లు ధ్వంసమయ్యాయని పోలీసులు తెలిపారు. జూలై 7న హర్సిల్‌కు సమీపంలోని బరిపడ లోని బావిలో భగీరత్ చౌదరి అనే యువకుడి మృతదేహం లభించింది. భగీరత్ మృతికి నిరసనగా హర్సిల్‌లో ర్యాలీ జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement