బెంబేలెత్తించిన లోకల్‌రైలు | local train Platform Derailment accident | Sakshi
Sakshi News home page

బెంబేలెత్తించిన లోకల్‌రైలు

Published Thu, Feb 19 2015 1:27 AM | Last Updated on Sat, Sep 2 2017 9:32 PM

local train Platform Derailment accident

 ప్రయాణికులతో నిత్యం రద్దీగా తిరిగే లోకల్‌రైలు ప్రమాదానికి గురై ప్రయాణికులను భయపెట్టింది. ప్లాట్‌ఫామ్‌ను ఢీ కొట్టడంతో, ప్రయాణికులు పరుగులు తీసిన సంఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది.టీనగర్: నగరంలో 50 శాతానికి పైగా ప్రజలు, విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లేవారు లోకల్‌రైలు పైనే ఆధారపడతారు. టిక్కెట్ ధర స్వల్పం కావడంతో ఎల్లవేళలా రద్దీగానే ఉంటుంది. బీచ్‌స్టేషన్-తాంబరం, బీచ్‌స్టేష న్-చెంగల్పట్టు మార్గాల్లో తెల్లవారుజాము 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు లోకల్‌రైళ్లు సేవలందిస్తుంటాయి. ఎప్పటిలాగానే ఉదయం 10.20 గంటలకు వేలాచ్చేరి స్టేషన్ నుంచి బీచ్‌స్టేషన్ వైపు బయలుదేరిన లోకల్‌రైలు సెంట్రల్ స్టేషన్ ఎదురుగా ఉన్న పార్క్‌స్టేషన్‌కు చేరుకుంటున్న తరుణంలో పెద్ద శబ్దం చేస్తూ పట్టాలు తప్పింది.
 
 బోగీలు ప్లాట్‌ఫామ్ పైకి దూసుకురావడంతో రైలు కోసం వేచి ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రైలు పెట్టెలు రాసుకోవడంతో ప్లాట్‌ఫామ్ సిమెంటు పెచ్చులు ఊడి కిందపడ్డాయి. దీంతో రైలు బోగీలోని ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. వెంటనే రైలును డ్రైవర్ నిలిపివేశారు. రైలు దిగే హడావుడిలో తోపులాటలో కొందరు గాయపడ్డారు. రైలు పట్టాలు దిగడంతో దీనిని మళ్లీ నడిపేందుకు వీలుకాలేదు. దీంతో అటువైపుగా వస్తున్న రైళ్లను వెంటనే నిలిపివేశారు. సమాచారం అందుకున్న వెంటనే బేసిన్ బ్రిడ్జి నుంచి రైల్వే సిబ్బంది సంఘటనా ప్రాంతం చేరుకున్నారు. మళ్లీ రైలును పట్టాలపై నిలబెట్టారు. దీంతో బుధవారం మధ్యాహ్నం వరకు పార్కు స్టేషన్‌లో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. వేలచ్చేరి నుంచి వచ్చిన రైళ్లను మైలపూరు వరకు నడిపి తిప్పిపంపారు. మరమ్మతు పూర్తి చేసేవరకు కొన్ని రైళ్లను నిలిపివేశారు. ప్రమాదంపై రైల్వే అధికారులు విచారణ జరుపుతున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement