‘108’ మానవీయత
ఆర్థిక స్థోమత లేకపోవడంతో వైద్యానికి దూరమైన బాలింత
108 సిబ్బంది మానవీయతతో ప్రాణాలతో బయట పడిన బాధితురాలు
108 అంబులెన్స్ సిబ్బంది మానవీయత ప్రదర్శించడంతో నిండు బాలింత ప్రాణాపాయం నుంచి బయట పడింది. ఆమెకు ఆర్థిక సాయం చేయడానికి 108 సిబ్బం ది ఆ గ్రామంలో చందా వసూలు చేసింది. ఆమెకు సకాలంలో వైద్య ం అందేలా చేసింది. వారు సేకరించిన డబ్బుతో వైద్యం సేవలు పొందిన ఆమె.. కోలుకొని శుక్రవా రం సాయంత్రం సొంత గ్రామానికి చేరుకుంది. - కోలారు
కోలార్ తాలూకాలోని యలవార గ్రామానికి చెందిన జ్యోతి ఐదు రోజుల క్రితం ప్రసవమై బిడ్డ మరణించింది. ప్రసవం అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స తీసుకుంది. అయితే రక్తం ఎక్కువగా పోవడం వల్ల ఎస్‌ఎన్‌ఆర్ ఆస్పత్రికి వెళ్లాల్సిందిగా వైద్యులు సూచించారు. ఎస్‌ఎన్‌ఆర్ ఆస్పత్రిలో చికిత్స అందించినా మెరుగైన చికిత్స కోసం జ్యోతిని ఆర్‌ఎల్ జాలప్ప ఆస్పత్రికి తీసుకు వెళ్లాల్సిందిగా వైద్యులు సలహా ఇచ్చారు. ఆర్‌ఎల్ జాలప్ప ఆస్పత్రిలో రెండు రోజులు చికిత్స చేసినా మెరుగైన వైద్యం కోసం జ్యోతి ని బెంగుళూరు విక్టోరియా ఆస్పత్రికి వెళ్లాల్సిందిగా వైద్యులు సలహా ఇచ్చారు. అయితే కూలి పని చేసుకుని జీవనం సాగించే జ్యోతి కుటుంబానికి అప్పటికే చేతిలో డబ్బులు ఖాళీ కావడంతో నేరుగా ఇంటికి వచ్చింది. కానీ రక్తం 2 హెచ్.బి.కి పడిపోవడంతో జ్యోతి ఆచేతనావస్థలోకి వెళ్లింది. జ్యోతి పరిస్థితిని గుర్తించిన ఆశా కార్యకర్త శారదమ్మ, ఏఎన్‌ఎం వరలక్ష్మిలు 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. 108 సిబ్బంది శ్రీనివాసమూర్తి తదితరులు గ్రామానికి చేరుకున్నారు. అయితే తీవ్ర అస్వస్థతతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న జ్యోతి తన చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో చికిత్సకు ససేమిరా అంది.
అంతటితో ఊరుకోని 108 సిబ్బంది మానవీయతను ప్రదర్శించారు. గ్రామంలోకి వెళ్లి గ్రామస్తులతో చందా వసూలు చేశారు. ఆశా కార్యకర్త శారదమ్మ రెండు వేల రూపాయల సహాయం చేసింది. ఇలా మొత్తం రూ. 15 వేలు జమ కావడంతో 108 సిబ్బంది జ్యోతిని ఆర్‌ఎల్ జాలప్ప ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో జ్యోతికి ఎనిమిది బాటిళ్ల రక్తం ఎక్కించడంతో కోలుకుంది. జ్యోతి ఆర్థిక స్థితిని గుర్తించిన 108 సిబ్బంది శ్రీనివాసమూర్తి ఆర్‌ఎల్ జాలప్ప ఆస్పత్రి సూపరింటెండ్ డాక్టర్ శ్రీరాములుకు పరిస్థితిని వివరించగా.. జ్యోతికి ఉచిత చికిత్స చేయడానికి ఒప్పుకున్నారు. రెండు రోజులు ఆస్పత్రిలో చికిత్స దొరకడంతో జ్యోతి పూర్తిగా కోలుకుంది. అదే 108 అంబులెన్స్‌లో జ్యోతిని సిబ్బంది గ్రామంలో శుక్రవారం సాయంత్రం దిగబెట్టారు. 108 సిబ్బంది మాన వీయతను ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు.