పేట్రేగిన ప్రేమోన్మాదం! | lover burned alive girl friends in tamilnadu | Sakshi
Sakshi News home page

పేట్రేగిన ప్రేమోన్మాదం!

Published Sun, Apr 23 2017 2:21 AM | Last Updated on Tue, Sep 5 2017 9:26 AM

పేట్రేగిన ప్రేమోన్మాదం!

పేట్రేగిన ప్రేమోన్మాదం!

ప్రియురాలి సజీవదహనం
ప్రియుడి ఆత్మాహుతి
అంబత్తూరు సమీపంలో ఘటన
రెండు కుటుంబాల్లో విషాదం


సాక్షి, చెన్నై: ప్రేమోన్మాదం కోరలు చాచింది. తనకు దక్కనిది మరొకరికి దక్కకూడదన్న ఆగ్రహంతో ఓ ప్రియురాల్ని కిరాతక ప్రియుడు సజీవ దహనం చేశాడు. తానూ నిప్పు అంటించుకుని ఆత్మాహుతి చేసుకున్నాడు. అంబత్తూరు సమీపంలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.  పోలీసుల కథనం మేరకు..

ప్రేమోన్మాదం: చెన్నై అంబత్తూరు సమీపంలోని పుదురు కరుణానిధి నగర్‌కు చెందిన పార్తిబన్‌(21),  లెనిన్‌ నగర్‌కు చెందిన మైథిలి(20) రెండున్నరేళ్ల క్రితం అన్నానగర్‌లోని ఓ వస్త్ర దుకాణంలో పనిచేసే వారు.

ఇక్కడ వీరిద్దరి మధ్య ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. రెండేళ్లు చెట్టా పట్టలు వేసుకుని తిరిగారు. ఆరు నెలల క్రితం వీరి ప్రేమ వ్యవహారం పెద్దల చెవిన పడింది. మైథిలి తల్లిదండ్రులు తీవ్రంగానే మందలించారు. తల్లిదండ్రుల మందలింపుతో పార్తిబన్‌కు మైథిలి దూరం కావడం మొదలెట్టింది. ఈ సమయంలో ఓ రోజు పార్తిబన్‌కు ప్రమాదం జరగడంతో ఆసుపత్రికి వచ్చి పరామర్శించిన మైథిలి తదుపరి పూర్తిగా దూరమైంది.

తనకు మైథిలి దూరం కావడంతో పార్తిబన్‌ తీవ్ర మనో వేదనకు గురయ్యాడు. ఈ పరిస్థితుల్లో పది రోజుల క్రితం మైథిలి పార్తిబన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పార్తిబన్‌తో తాను కలిసి ఉన్నట్టుగా ఫొటోలు, వాట్సాప్‌లలో మెసేజ్‌లు ఉన్నాయని, వాటన్నింటిని తొలగించకుండా ప్రేమ పేరుతో వేధిస్తున్నట్టు అందులో వివరించింది. ఈ ఫిర్యాదు పార్తిబన్‌ను ఉన్మాదిగా మార్చినట్టుంది.

సజీవ దహనం : పార్తిబన్‌ను స్టేషన్‌కు పిలిపించి పోలీసులు మందలించారు. అతడి వద్ద ఉన్న మైథిలి ఫొటోలను, మెసేజ్‌లను తొలగించారు. దీంతో పార్తిబన్‌ బెడద తీరడంతో యథా ప్రకారం  తన పనుల్లో మైథిలి మునిగింది. అయితే, తనకు తెలియకుండా పార్తిబన్‌ వెంటాడుతుండడాన్ని ఆమె పసిగట్ట లేక పోయింది. తనకు మై«థిలి పూర్తిగా దూరం కావడంతో ఉన్మాదిగా మారిన పార్తిబన్‌ ఆమె రాకపోకల్ని ఆరా తీసి, పథకం ప్రకారం హతమార్చే యత్నం చేశాడు. శుక్రవారం రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో తిరుముల్‌లైవాయిల్‌ బస్టాండ్‌లో బస్సు దిగిన మైథిలి వివేకానందనగర్‌ మీదుగా ఇంటికి నడక మొదలెట్టింది. ఆమెను రహస్యంగా అనుసరించిన పార్తిబన్‌ నిర్మానుష్యంగా ఉన్న రోజా వీధిలో అడ్డగించాడు.

తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చే యత్నం చేశాడు. ఈ ఇద్దరి మధ్య వాగ్వివాదం, తోపులాట చోటు చేసుకుంది. నిర్మానుష్యంగా ఉన్న ఆ రోడ్డులో ఎవ్వరూ లేకపోవడంతో తన ఉన్మాదాన్ని పార్తీబన్‌ బయటకు తీశాడు. వెన్నంటి తెచ్చుకున్న పెట్రోల్‌ను ప్రియురాలి మీద పోసి నిప్పు అంటించాడు. తాను పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. మంటల్లో కాలుతూ ఈ ఇద్దరు పెడుతున్న కేకలకు  సమీపంలోని ఇళ్లల్లో ఉన్న వాళ్లు పరుగులు తీశారు. మంటల్ని ఆర్పేయత్నం చేశారు. అంబులెన్స్‌కు, తిరుముల్‌లై వాయిల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 వారు అక్కడికి చేరుకుని తీవ్ర గాయాలతో పడి ఉన్న ఆ ఇద్దర్ని కీల్పాకం ఆసుపత్రికి తరలించారు. శనివారం తెల్లవారుజాము రెండు గంటల సమయంలో పార్తిబన్‌ చికిత్స పొందుతూ మృతిచెందాడు. శనివారం ఉదయం ఐదు గంటల సమయంలో మైథిలి సైతం తుది శ్వాస విడిచింది. ప్రేమోన్మాదానికి ఈ ఇద్దరు బలి కావడంతో ఆ రెండు కుటుంబాలు శోక సంద్రంలో మునిగాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తిరుముల్‌లైవాయిల్‌ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాల్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబీకులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement