మీరేం చేశారు?
షోలాపూర్ ఎన్నికల ప్రచారసభలోకాంగ్రెస్‌ను నిలదీసిన వెంకయ్యనాయుడు
షోలాపూర్, న్యూస్‌లైన్: ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం అవలంభించిన తప్పుడు విధానాలు, తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లే మహారాష్ట్ర పరిస్థితి దిగజారిందని కేంద్ర పట్టణాభిృద్ధిశాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. షోలాపూర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న వెంకయ్య గతపాలకులపై ధ్వజమెత్తారు. షోలాపూర్ నార్త్ సిటీ బీజేపీ అభ్యర్థి విజయ్ దేశ్‌ముఖ్‌కు మద్దతుగా శుక్రవారం మధ్యాహ్నం గొంగడి బస్తీలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా నాయుడు మాట్లాడుతూ... స్వతంత్రం వచ్చిన నాటి నుంచి దేశాన్ని దోచుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఆరు నెలలైన పూర్తిచేసుకోలేనే మోడీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తోందన్నారు.
60 సంవత్సరాల పాలనలో మేరేం చేశారో చెప్పండంటూ కాంగ్రెస్‌ను నిలదీశారు. ఆరు దశాబ్దాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేనిది కేవలం ఆరు నెలల్లో మోడీ ఎలా చేస్తారని ప్రశ్నించారు. పెళ్లయిన కొత్త జంటకు ఎంతో ఉత్సాహం ఉన్నప్పటికీ పిల్లల్ని కనడానికి కూడా కనీసం తొమ్మిది నెలలు ఆగాల్సిందేనని చమత్కరించారు. ఈ మాత్రం కూడా వారికి తెలియదా..? అని నిలదీశారు. టూ-జీ స్కాం, బొగ్గు, భూమి ఇలా అనేక కుంభకోణాల్లో, అవినీతిలో కాంగ్రెస్ కూరుకుపోయిందని, ఇక ఆ పార్టీ నాయకుల మాటలు వినేవారెవరూ లేరని ఎద్దేవా చేశారు. మహారాష్ట్ర, హర్యానాలో బీజేపీ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది గెలిస్తే రాజ్యసభలో కూడా మా మెజార్టీ పెరుగుతుందని, తదనంతరం మెనిఫెస్టోలో పొందుపర్చిన హామీలన్ని కచ్చితంగా నెరవేర్చేందుకు సాధ్యమవుతుందని నాయుడు అన్నారు.
హైదరాబాద్‌కు చెందిన ఎంఐఎం పార్టీ మహారాష్ట్రలో పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్త్తోందని, వారి ఆటలు సాగనివ్వకుండా చేయాలని పిలుపునిచ్చారు. మనమంతా కలిసికట్టుగా ఉంటే ఏ మత శక్తులు మనల్ని వేరు చేయలేవన్నారు. శివసేనను తాము వీడలేదని, శివసేనే బీజేపీని దూరం చేసుకుందన్నారు. ఈ బహిరంగసభలో మారుతి ప్రకాశ్, ఇందిరా కుడిక్యాల్, మోహిని పత్కి, సురేశ్ పాటిల్, ఎన్.అశోక్ తదితర స్థానిక నాయకులు పాల్గొన్నారు.