గవర్నర్ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు
గవర్నర్ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు
Published Thu, May 18 2017 7:38 PM | Last Updated on Sat, Apr 6 2019 9:11 PM
చెన్నై: అనేక వర్సిటీల వైస్ చాన్స్‌లర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని వెంటనే భర్తీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై తమిళనాడు హైకోర్టు స్పందించింది. గవర్నర్ వ్యక్తిగత కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మాట్రం ఇందియా సంస్థ డైరెక్టర్ పాడం నారాయణన్ వేసిన పిటిషన్‌కు సంబంధించిన వివరాలివీ.. రాష్ట్రంలోని చెన్నై వర్సిటీ, అన్నా వర్సిటీ, కామరాజర్ వర్సిటీ, లా వర్సిటీ వంటి అనేక వర్సిటీలలో వైస్ చాన్స్‌లర్ పదవులు అనేక నెలలుగా ఖాళీగా ఉన్నాయి. అదే విధంగా భారతీదాసన్ వర్సిటీ, పెరియార్ వర్సిటీలలో వైస్ చాన్స్‌లర్ల పదవీ కాలం త్వరలో ముగియనుంది. సాధారణంగా వైస్ చాన్స్‌లర్ పదవి ఖాళీ కావడానికి మూడు నెలల ముందుగానే కొత్త వీసీని ఎంపిక చేసేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
అయితే, అనేక వర్సిటీలలో వీసీని ఎన్నుకునేందుకు కమిటీలను ఇంకా ఏర్పాటు చేయలేదు. వైస్ చాన్స్‌లర్లు లేని వర్సిటీలలో పలు కార్యక్రమాలు స్తంభించిపోయాయి. స్నాతకోత్సవాలు కూడా నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే.. వీసీ పోస్టులను సత్వరమే భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్ వ్యక్తిగత కార్యదర్శికి ఉత్తర్వులివ్వాలని పాడం నారాయణన్ తన పిటిషన్‌లో కోరారు. అంతేకాకుండా ఆయన దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌లో వైస్ చాన్స్‌లర్ లేకుండానే అన్నా వర్సిటీలో శుక్రవారం స్నాతకోత్సవం నిర్వహించేందుకు సంకల్పించారని, దీనికి స్టే విధించాలని కోరారు. ఈ కేసుపై న్యాయమూర్తులు మహాదేవన్, గోవిందరాజ్ విచారణ జరిపి రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి, ఉన్నత విద్యా కార్యదర్శి, రాష్ట్ర గవర్నర్ వ్యక్తిగత కార్యదర్శికి నోటీసులు పంపాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
Advertisement
Advertisement