సాక్షి, ముంబై:మహాకూటమిలో సీట్ల కోసం పోట్లాట జోరెక్కుతోంది. నిన్నమొన్నటిదాకా కూటమిలోని భాగస్వామ్య పక్షాల మధ్య దాదర్, కల్యాణ్ లోక్‌సభ నియోజకవర్గాల విషయంలోనే భేదాభిప్రాయాలున్నాయని భావించారు. అయితే ఇవి మాత్రమే కాకుండా మరికొన్ని స్థానాల కోసం రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్పీఐ) పట్టుబడుతోందని తెలిసింది. తమ పార్టీకి ఆరు లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ నేతలు గట్టిగానే డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ప్రతిపాదనలను కూడా శివసేన ముందుంచినట్లు తెలిసింది. అయితే శివసేన మాత్రం తామొక్కరమే నిర్ణయం తీసుకోలేమని, మహాకూటమి సమన్వయ సమితి సమావేశంలోనే సీట్ల పంపకాలపై తుది నిర్ణయం తీసుకుందామని చెప్పినట్లు సమాచారం.
అయితే బీజేపీ మాత్రం ఆర్పీఐ ప్రతిపాదనకు అంగీకరించే అవకాశం లేదని ఆ పార్టీ నేత ఒకరు చెప్పారు. శివసేన ప్రాతినిథ్యం వహిస్తున్న సాతారా, బీజేపీ ప్రాతినిథ్యం వహిస్తున్న లాతూర్ నియోజకవర్గాలను ఆర్పీఐకి కేటాయించే అవకాశముందన్నారు. కాగా ఆర్పీఐ మాత్రం కల్యాణ్, దక్షిణ మధ్య ముంబై, పుణే, రామ్‌టేక్‌లు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తోందన్నారు. ఇదిలాఉండగా... ఆర్పీఐ-శివసేనల మధ్య దూరం పెరుగుతోందంటూ మీడియాలో రకరకాల కథనాలు ప్రసారం కావడం ఈ మధ్యకాలంలో మరింత పెరగడంతో ఇరు పార్టీల నేతలు రాందాస్ ఆఠవలె నివాసమైన ‘సంవిధాన్’ బంగ్లాలో మంగళవారం సాయంత్రం సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో శివసేన తరఫున చెందిన గజానన్ కీర్తికర్, సుభాష్ దేశాయ్, లీలాధర్ డాకే, మిలింద్ నార్వేకర్‌లు పాల్గొనగా ఆర్పీఐ తరఫున అవినాశ్ మాత్రేకర్, అర్జున్ డాంగ్లే తదితరులు పాల్గొన్నారు. రాజ్యసభ స్థానంపై రాందాస్ అథవాలే పేరు ఖరారు చేసే విషయంపై పునరాలోలించాలని ఆర్పీఐ నాయకులు శివసేనకు సూచించగా ఈ అంశంపై బీజేపీ నాయకులతో చర్చించాలని శివసేన నాయకులు వారికి సలహా ఇచ్చినట్లు తెలిసింది. అవసరమైతే ఢిల్లీలోని బీజేపీ శ్రేణులతో కూడా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు శివసేన స్పష్టం చేసినట్లు సమాచారం.
విభేదాల పరిష్కారానికి సమన్వయ సమితి
దాదాపు ఇరవై సంవత్సరాలుగా కాషాయ కూటమి పేరుతో బీజేపీ, శివసేన కలిసే పోటీ చేస్తున్నాయి. వీరితో ఆర్పీఐ కూడా జతకూడడంతో కాషాయకూటమి కాస్తా మహాకూటమిగా మారిన విషయం తెలిసిందే. మూడో పార్టీ చేరికతో సీట్ల పంపకాలు తదితర విషయాల్లో అనేక సమస్యలు పుట్టుకొస్తున్నాయి. దీంతో మూడు పార్టీల మధ్య విభేదాలను పరిష్కరించేందుకు సమన్వయ సమితిని ఏర్పాటు చేయాలని ‘సంవిధాన్’లో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ఈ సమితిలో సభ్యులుగా శివసేన తరఫున గజానన్ కీర్తికర్, సుభాష్ దేశాయ్, లీలాధర్ డాకేలు సభ్యులుగా ఉంటారని, బీజేపీ తరఫున దేవేంద్ర ఫడ్నవీస్, వినోద్ తావ్డేలు, ఆర్పీఐ పార్టీ తరఫున ముగ్గురు సభ్యులు(ఇంకా పేర్లు ఖరారు చేయలేదు)గా ఉంటారని శివసేన సీనియర్ నేత ఒకరు తెలిపారు.
‘ఆరు’ కోసం ఆర్పీఐ పోరు!
Published Thu, Sep 5 2013 3:12 AM | Last Updated on Fri, Sep 1 2017 10:26 PM
Advertisement
Advertisement