ఛనాఖా-కొరట కు ఓకే | Maharashtra Govt Approves Minister Harish Rao Proposals Over Chanakha-Korata Barrage | Sakshi
Sakshi News home page

ఛనాఖా-కొరట కు ఓకే

Published Sun, May 22 2016 5:07 AM | Last Updated on Mon, Oct 8 2018 6:22 PM

ఛనాఖా-కొరట కు ఓకే - Sakshi

ఛనాఖా-కొరట కు ఓకే

- అటవీ, వన్యప్రాణి, మైనింగ్ ఎన్‌వోసీలు ఇచ్చిన మహారాష్ట్ర
- మంత్రి హరీశ్‌రావు హర్షం.. 2018 జూలైకల్లా ప్రాజెక్టు పూర్తిచేస్తామని వెల్లడి
- మేడిగడ్డ డిజైన్లపై నాసిక్‌లో కొనసాగుతున్న చర్చలు


సాక్షి, హైదరాబాద్

గోదావరి ఉపనది అయిన పెన్‌గంగపై రాష్ట్ర ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ఛనాఖా-కొరట బ్యారేజీకి అవసరమైన కీలక అనుమతులను మహారాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఇరు రాష్ట్రాల సమన్వయ కమిటీలో తీసుకున్న నిర్ణయాల మేరకు అన్ని అంశాల పరిశీలన అనంతరం అటవీ, మైనింగ్, వన్యప్రాణి సంరక్షణలకు సంబంధించిన ఎన్‌వోసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్)లను జారీ చేసింది. ఈ పత్రాలను శనివారం రాష్ట్ర అధికారులకు పంపింది. పెన్‌గంగ నీటిని వినియోగంలోకి తెచ్చేందుకు ఛనాఖా-కొరట మధ్య 1.5 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీ నిర్మించాలని గతంలోనే ప్రభుత్వం నిర్ణయించింది.

ఇది అంతర్రాష్ట్ర ప్రాజెక్టు కావడంతో మహారాష్ట్ర, తెలంగాణ మంత్రులు, అధికారుల స్థాయిలో పలు దఫాలు చర్చ లు జరిగాయి. బ్యారేజీ నిర్మాణానికయ్యే వ్యయంతోపాటు మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూముల పునరావాసం, భూసేకరణ వ్యయాన్ని తెలంగాణ ప్రభుత్వమే భరించాలని... తెలంగాణ, మహారాష్ట్ర 80:20 నిష్పత్తిలో నీటి వాటా తీసుకోవాలని సూత్రప్రాయంగా అవగాహనకు వచ్చాయి. అయితే బ్యారేజీ నిర్మాణంతో మహారాష్ట్రలో సున్నపురాయి నిక్షేపాలున్న ప్రాంతం, తిప్పేశ్వరం వన్యప్రాణి కేంద్రానికి జరిగే నష్టంపై పరిశీలన చేసి ఎన్‌వోసీ జారీ చేస్తామని, ఆ తర్వాతే పనులు ప్రారంభించాలని మహారాష్ట్ర సూచించింది.

ఈ మేరకు ఆ ప్రాంతాల్లో సర్వే చేసిన మహారాష్ట్ర అధికారులు సున్నపురాయి నిక్షేపాలకు, వన్యప్రాణి కేంద్రానికి నష్టమేమీ వాటిల్లే అవకాశం లేదని నిర్ధారించి... తాజాగా ఎన్‌వోసీలు జారీ చేశారు. మరోవైపు మేడిగడ్డ బ్యారేజీ డిజైన్లపై మహారాష్ట్రలోని నాసిక్‌లో రాష్ట్ర అధికారులు మహారాష్ట్ర అధికారులతో చర్చలు జరుపుతున్నారు. బ్యారేజీని 101 మీటర్ల ఎత్తులోను, 102 మీటర్ల ఎత్తులోను నిర్మిస్తే... నీటి నిల్వ సామర్థ్యం, పంపుహౌజ్‌లు, మోటార్లు తదితర ఏర్పాట్లు ఎలా ఉంటాయనే దానిపై వివరణలు ఇచ్చారు.

2018 జూలైకల్లా పూర్తి..
ఛనాఖా-కొరట ప్రాజెక్టుకు మహారాష్ట్ర అనుమతులివ్వడంపై మంత్రి టి.హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. వ న్యప్రాణి కేంద్రానికి సంబంధించిన అనుమతులు సంపాదించేందుకు ఆదిలాబాద్ జిల్లా అటవీ అధికారులు చేసిన కృషిని అభినందించారు. ఆదిలాబాద్‌లో సాగునీటి పారుదల రంగానికి సానుకూల పరిస్థితులు ఉన్నాయని... భూసేకరణ సహా వివిధ అంశాలపై ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సమన్వయం చేసుకొని పనిచేయాలని సూచించారు. ఛనాఖా-కొరట బ్యారేజీ పనుల నిమిత్తం 770 ఎకరాల భూమి అవసరం కాగా, ఇంకా 290 ఎకరాలు సేకరించాల్సి ఉందని... తహసీల్దార్లు భూసేకరణను వేగవంతం చేయాలని కోరారు. 2018 జూలై కల్లా బ్యారేజీ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement