ముంబయి: ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు కోరుతూ మరాఠాలు నిర్వహించిన మౌన ప్రదర్శనతో ముంబయి మహానగరంలో జనజీవనం స్తంభించింది. రెండు లక్షల మందికి పైగా నిరసనకారులు ప్రదర్శనలో పాల్గొనడంతో సిటీలో ట్రాఫిక్ నిలిచిపోయింది.
కాషాయ జెండాలు చేతబూనిన యువత, సీనియర్ సిటిజన్లు పెద్దసంఖ్యలో శాంతియుత నిరసనలో పాల్గొన్నారని పోలీసులు చెప్పారు. ప్రదర్శన నేపథ్యంలో పదివేల మందికి పైగా పోలీసులు మోహరించారు. మరాఠా సంఘాలు గత ఏడాది నుంచి మహారాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన 57 ప్రదర్శనలకు ముగింపుగా ముంబయిలో భారీ ర్యాలీ చేపట్టారు.
ఉద్యోగులకు, విద్యార్థులకు నిత్యం లంచ్ బాక్స్‌లు అందించే డబ్బావాలాలు సైతం విధులకు గైర్హాజరు కావడంతో ఉద్యోగులు, పాఠశాల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో కోటాతో పాటు, రైతుల రుణమాఫీ, వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలను డిమాండ్ చేస్తూ మరాఠాలు నిరసనబాట పట్టారు.