వ్యాపారవేత్త హత్య కేసులో యువకుడి అరెస్ట్ | Man arrested for the murder of businessman | Sakshi
Sakshi News home page

వ్యాపారవేత్త హత్య కేసులో యువకుడి అరెస్ట్

Published Mon, Sep 1 2014 3:08 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

Man arrested for the murder of businessman

  • హత్యకు దారితీసిన మహిళ వ్యవహారం
  •  ప్రియురాలిని దక్కించుకునేందుకు ఘాతుకం
  •  పరారీలో యువతి
  •  హతుడు విజయవాడ వాసి
  •  ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వైనం
  • బెంగళూరు : వివాహేతర సంబంధం కారణంగా వ్యాపారవేత్తను తుపాకితో కాల్చి చంపిన సంఘటన ఇక్కడి మహదేవపుర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన వెంకటరామ (51) హత్యకు గురయ్యాడు. నిందితుడు తెలంగాణలోని హైదరాబాద్‌లో మార్బల్స్ వ్యాపారి సుభాష్‌ను అరెస్ట్ చేసినట్లు ఇక్కడి మహదేవపుర పోలీసులు చెప్పారు. ఇతని ప్రియురాలు నిరంజని (29) పరారీలో ఉందని చెప్పారు. ఆలస్యంగా వెలుగు చూసిన సంఘటన  వివరాలు... విజయవాడకు చెందిన  వెంకటరామ ఇక్కడి వైట్‌ఫీల్డ్ సమీపంలోని బీఎంటీసీ కమర్షియల్ కాంప్లెక్స్ మూడో అంతస్తును లీజ్‌కు తీసుకుని అద్దెకు ఇస్తున్నాడు.

    వ్యాపారాలను చూసుకోడానికి తమిళనాడు చెన్నైకు చెందిన నిరంజని అనే యువతిని పీఏగా నియమించుకున్నాడు. విజయవాడలో భార్య, పిల్లలతో నివాసం ఉంటున్న వెంకటరామ వారంలో ఒక్కరోజు బెంగళూరు వచ్చి వ్యాపార లావాదేవీలు చూసుకుని వెళ్లేవాడు. ఇదిలా ఉంటే రెండు నెలల క్రితం వెంకటరామకు హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త సుభాష్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య సన్నిహితం పెరిగి సుభాష్ బెంగళూరు వచ్చిన ప్పుడల్లా వెంకటరామ గదిలోనే బస చేసేవాడు.

    ఇదే సమయంలో అతనికి వెంకటరామ పీఏ నిరంజనితో సాన్నిహిత్యం పెరిగిం ది. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం నెలకొంది. అంతకు ముందే నిరంజని, వెంకటరామ మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు సమాచారం. ఇది తెలియని సుభాష్, నిరంజనిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో వెంకటరామ,  నిరంజని  వ్యవహారం బయటపడింది. దీంతో ఎలాగైనా నిరంజనిని సొంతం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆగస్టు 24న వెంకటరామ విజయవాడ నుంచి బెంగళూరు చేరుకున్నాడు.

    మరుసటి రోజు సుభాష్ కూడా బెంగళూరు వ చ్చాడు. వీరిద్దరిని అనుమానించిన వెంకటరామ తాను విజయవాడ వెళ్తున్నట్లు చెప్పి గదిలోనే ఉండిపోయాడు. అర్ధరాత్రి సమయంలో సుభాష్ గదిలోకి అడుగుపెట్టాడు. అప్పటికే గదిలో నిరంజని ఉంది. ఒక్కసారిగా వెంకటరామ గదిలో కనిపించడంతో ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. సుభాష్ సహనం కోల్పోయి రివాల్వర్ తీసుకుని వెంకటరామపై కాల్పులు జరిపాడు.

    అనంతరం సుభాష్, నిరంజని అక్కడి నుంచి ఉడాయించారు. అర్ధరాత్రి కాల్పులు వినిపించడంతో కారు డ్రైవర్ స్థానికుల సాయంతో వెంకటరామను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ 27న వెంకటరామ మృతి చెందాడని పోలీసులు చెప్పారు. కేసు దర్యాప్తు చేసిన మహదేవపుర పోలీసులు పూర్తి వివరాలు సేకరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో తలదాచుకున్న సుభాష్‌ను శనివారం అరెస్టు చేసి బెంగళూరు తీసుకు వచ్చామని ఆదివారం పోలీసులు చెప్పారు. నిరంజని పరారీలో ఉందని పోలీసులు తెలిపారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement