
ఆర్కే క్షేమం
► విరసం నేత వరవరరావు వెల్లడి
► పది రోజుల ఉత్కంఠకు తెర
► మావోయిస్టు పార్టీ ఏఓబీ అధికార ప్రతినిధి జగబంధు
ఫోన్ ద్వారా తెలిపారని వివరణ
► ఏఓబీలో కూంబింగ్ నిలిపివేయాలని డిమాండ్
► నేడు ‘హెబియస్ కార్పస్ రిట్’ వెనక్కి...
సాక్షి, హైదరాబాద్ : మావోయిస్టు పార్టీ నేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ (ఆర్కే) క్షేమంగా ఉన్నట్లు విరసం నేత వరవరరావు తెలిపారు. మావోయిస్టు పార్టీ ఏఓబీ అధికార ప్రతినిధి జగబంధు ఫోన్ ద్వారా ఆర్కే క్షేమ సమాచారాన్ని అందజేసినట్లు వివరించారు. హైదరాబాద్‌లో గురువారం రాత్రి వరవరరావు మీడియాతో మాట్లాడారు. జగబంధు ఇప్పటికే విడుదల చేసిన 14 నిమిషాల ఆడియోలో తాము క్షేమంగా ఉన్నట్లు పేర్కొన్నా... వారిలో ఆర్కే ఉన్నాడా లేదా అన్నదానిపై ఇప్పటివరకూ ఆందోళన నెలకొందన్నారు. జగబంధు తనకు ఫోన్ చేసి ఆర్కే కూడా క్షేమంగా ఉన్నారని తెలిపినట్లు వెల్లడించారు.
ఏఓబీలో పోలీసు బలగాల గాలింపు వెంటనే నిలిపివేయాలని జగబంధు డిమాండ్ చేసినట్లు చెప్పారు. ఈ నెల 5, 6 తేదీల్లో విశ్వవిద్యాలయాల విద్యార్థులు, ప్రజా సంఘాలు, హక్కుల సంఘాల ప్రతినిధులు ఎన్‌కౌంటర్‌పై నిజనిర్ధారణ కోసం మల్కన్ గిరికి రానున్నందున కూంబింగ్‌ను ఉపసంహరించుకోవాలని కోరారన్నారు. పోలీసులు 31 మంది మావోయిస్టులను దారుణంగా హతమార్చారని, అందులో నిరాయుధులైన 9 మంది ఆదివాసీలున్నారని జగబంధు తనకు వివరించినట్లు వరవరరావు తెలిపారు. కాగా ఆర్కే ఆచూకీ కోసం తాము హైకోర్టులో వేసిన హెబియస్ కార్పస్ రిట్‌ను శుక్రవారం ఉపసంహరించుకోనున్నట్లు చెప్పారు.
సోదరుల హర్షం
ఆర్కే క్షేమంగా ఉన్నట్లు తెలియడంతో దేశ వ్యాప్తంగా మావోయిస్టు సానుభూతిపరులు, వామపక్షాల అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. ఇన్ని రోజులుగా ఆర్కే విషయంగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఆర్కే క్షేమంగా ఉండడంపై రాజేంద్రనగర్‌లో నివసిస్తున్న ఆయన సోదరులు సంతోషం వ్యక్తం చేశారు.