పింప్రి, న్యూస్‌లైన్: పుణే క్యాంప్‌లోని ఫ్యాషన్‌స్ట్రీట్‌లో ఆదివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపు 15 దుకాణాలు మంటల్లో చిక్కుకొని బూడిదయ్యాయి. స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. సుమారు 500 దుకాణాల సముదాయంతో ఉన్న ఈ ఫ్యాషన్ స్ట్రీట్‌లో అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం సంభవించడంతో నష్టం భారీగానే జరిగింది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న అగ్ని మాపకశాఖ అధికారులు ఆరు వాహనాలతో వెంట నే ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఎంత ప్రయత్నించినా 15 దుకాణాల వరకు మంటల్లో కాలి బూడిదయ్యాయి. నంబరు 107 నుంచి 121 వరకు ఉన్న రెడీమేడ్ దుస్తులు, లెదర్ బ్యాగులు, బూట్లు, అల్పాహార దుకాణాలు ఈ దుర్ఘటనలో తీవ్రంగా దెబ్బతిన్నాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదంలో జరిగిందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడయింది.