సాక్షి, చెన్నై:చెన్నై మీనంబాక్కం విమానాశ్రయంలో భద్రత ఎప్పుడూ కట్టుదిట్టంగానే ఉంటుంది. కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో రెండు రోజులుగా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. విమానాశ్రయంలోకి వెళ్లే ప్రతి వాహనాన్నీ తనిఖీలు చేసిమరీ లోనికి అనుమతిస్తున్నారు. టెర్మినల్ పరిసరాల్లో కేంద్ర బలగాలు, బయట ప్రాంతం, రన్ వే ప్రహరీకి వెలుపల నగర పోలీసులు భద్రతా విధుల్లో నిమగ్నమై ఉన్నారు. భద్రతను కట్టుదిట్టం చేసి, తనిఖీలు ముమ్మరంగా చేస్తున్న వేళ స్వదేశీ టెర్మినల్‌లో నాలుగు సంచులు వృథాగా పడి ఉండడం పెను కలకలాన్ని సృష్టించాయి.
బాబోయ్ బాంబులు: మీనంబాక్కం స్వదేశీ టెర్మినల్ లోపలి భాగంలో నాలుగు ప్రవేశ మార్గాలు ఉంటాయి. ఇందులో ఓ మార్గంలో జెట్ ఎయిర్ వేస్ ప్రయాణికులు ఏడు గంటల సమయంలో ఢిల్లీ, ముంబైలకు బయలు దేరడానికి సిద్ధమయ్యారు. తనిఖీల అనంతరం విమానంలోకి ఎక్కేందుకు బయలు దేరిన కొందరు ప్రయాణికుల దృష్టి అక్కడి నాలుగు సంచుల మీద పడింది. వీటి గురించి భద్రతా సిబ్బంది తెలియజేశారు. భద్రతా సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ సంచులు ఎవరివని వాకబు చేసినా ఫలితం లేకపోయింది. ఆ సంచుల్లో బాంబులు ఉన్నట్టుగా ప్రచారం ఊపందు కోవడంతో కొందరు ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది.
కొందరు అయితే బయటకు పరుగులు తీశారు. దీంతో కాసేపు గందరగోళం నెలకొంది. అక్కడే విధుల్లో ఉన్న డాగ్, బాంబ్ స్క్వాడ్‌ల ద్వారా తనిఖీలు చేయించారు. ఆ మార్గాన్ని మూసివేసి, రెండో మార్గం ద్వారా జెట్ ఎయిర్ వేస్ ప్రయాణికుల్నిలోనికి పంపించారు. తనిఖీల్లో నిమగ్నమైన సిబ్బందికి ఓ మహిళ రూపంలో వ్యతిరేకత వ్యక్తమైంది.. నలభై ఏళ్లు పైబడ్డ ఓ మహిళ పరుగున వచ్చి ఆ సంచులు తనవేనని, వాటిని తనిఖీలు చేయొద్దంటూ వారించడంతో అనుమానాలు నెలకొన్నాయి. అత్యవసరంగా బాత్రూంకు వెళ్లాల్సి రావడంతోనే వాటిని అక్కడ వదలి వెళ్లాల్సి వచ్చిందని, తన వెంట ఎవ్వరూ లేనందున ఇబ్బంది పడాల్సి వచ్చిందంటూ ఆమె వేడుకుంది. అయినా భద్రతా సిబ్బంది మాత్రం వదలి పెట్టలేదు.
పచ్చళ్లు...పొడులు :
గంటన్నర ఉత్కంఠతో చివరకు అందులో పచ్చళ్లు, పొడులు, కొత్త బట్టలు ఉండడంతో బాంబ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. వాటిని ఆమె ఢిల్లీకి తీసుకెళ్తున్నట్టు గుర్తించారు. తాను బాత్రూంలో ఉన్న సమయంలో మైక్‌లో ప్రకటన వచ్చిందని, అయితే తనకు ఆంగ్లం రాక పోవడంతో దాన్ని పట్టించుకోలేదని ఆమె విన్నవించుకున్నారు. అరుుతే అధికారులు మాత్రం తగ్గలేదు. తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, ఆమెకు జరిమానా విధించే యత్నం చేశారు. తనకు హిందీ తప్ప వేరే భాష రాదంట్టూ ఆ మహిళ కన్నీళ్లు పెట్టుకోవడంతో చివరకు క్షమించి, ఆమెను ఢిల్లీకి పంపించారు.
బాంబు బూచి!
Published Wed, Jun 11 2014 12:07 AM | Last Updated on Mon, Sep 17 2018 6:18 PM
Advertisement