పరిషత్ సమాచారం
సాక్షి, బెంగళూరు : పరిషత్‌లో కాంగ్రెస్ నాయకుల మధ్యే సోమవారం మాటల యుద్ధం జరిగింది. ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ మోటమ్మ మాట్లాడుతూ... ‘బెంగళూరు ఎంజీ రోడ్డులో ఉన్న పీజీ, పీహెచ్‌డీ వసతి గృహాల్లో కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఈ విషయాన్ని నేను మూడుసార్లు పరిషత్‌లో ప్రస్తావించినా ప్రయోజనం లేకపోయింది. ఒకే అంశాన్ని మూడుసార్లు అడగడం వల్ల నాకైనా మర్యాద లేకుండా ఉండాలి... లేదా అన్నిసార్లు ప్రశ్న అడిగించుకున్నందుకు సంబంధిత మంత్రి, అధికారులకైనా మర్యాద లేకుండా ఉండాలి..’ అని ఘాటు వాఖ్యలు చేశారు. దీనిపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి హెచ్ ఆంజనేయ స్పందిస్తూ ‘క్షణాల్లో పనులు కావు. కొంత సంయమనం పాటించాలి.
సభా మర్యాదలు పాటిస్తే మంచిది.’ అన్నారు. దీంతో మోటమ్మ తాను ఎవరితోనూ చెప్పించుకునే స్థితిలో లేనని ఎదురు సమాధానమిచ్చారు. విపక్ష సభ్యులు కూడా మోటమ్మకు మద్దతుగా మాట్లాడారు. దీంతో సభలో ఏం జరుగుతోందో తెలియని గందరగోళరం ఏర్పడింది. చివరకు సభాపతి శంకరమూర్తి కల్పించుకోవడంతో పరిస్థితి సద్దుమునిగింది. తానే స్వయంగా వసతి గృహానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించి సమస్యను పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.
మంత్రి పదవికి గ్యారెంటీ లేదు..
మూడు నెలల పాటు తాను మంత్రి పదవిలో కొనసాగడంపై గ్యారెంటీ ఇవ్వలేనని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి యూటీ ఖాదర్ పేర్కొనడం పరిషత్‌లో గుసగుసలకు దారి తీసింది. ‘బైక్-అంబులెన్స్’ విషయమై ఎమ్మెల్సీ సిద్ధరాజు మాట్లాడుతూ.. మూడు నెలల్లోపు ఆ పథకాన్ని ప్రారంభిస్తారా? లేదా? చెప్పాలంటూ డిమాండ్ చేశారు. దీంతో మంత్రి సమాధానమిస్తూ.. ‘ నేను మూడు నెలలు మంత్రి స్థానంలో కొనసాగుతానని చెప్పలేను.
ఒకవేళ అదే జరిగితే తప్పక బీబీఎంపీ పరిధిలో ఈ పథకాన్ని ప్రారంభిస్తాను.’ అని అన్నారు. మంత్రి ఇలా పేర్కొనగానే విపక్ష ఎమ్మెల్సీలతో పాటు పాలక పక్ష కాంగ్రెస్ ఎమ్మెల్సీలూ ఒకరితో ఒకరు గుసగుసలాడుకోవడం కనిపించింది. ఎమ్మెల్సీ భారతీ శెట్టి అడిగిన మరో ప్రశ్నకు మంత్రి యూటీ ఖాదర్ సమాధానమిస్తూ ప్రతి జిల్లా కేంద్రంలో బ్లండ్ బ్యాంక్, ప్రతి తాలూకా కేంద్రంలో రక్త సంగ్రహణ కేంద్రాన్ని ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వం వద్ద ఉందని వెల్లడించారు.
‘2006 చట్టం’తో అక్రమాలకు చెక్..
ఇంజనీరింగ్, వైద్య తదితర వృత్తి విద్యా కోర్సుల ప్రవేశాల్లో చోటు చేసుకుంటున్న అక్రమాలను అరికట్టడానికి 2006లోనే రూపొందించిన చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్లు రాష్ట్ర వైద్య విద్యాశాఖ మంత్రి శరణ్ ప్రకాశ్‌పాటిల్ పరిషత్‌కు తెలిపారు. అదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భాషా, ధార్మిక అల్పసంఖ్యాక విద్యా సంస్థలకు సంబంధించి వెంకట రామయ్య కమిటీ నివేదిక అందిన వెంటనే ప్రభుత్వం ఓ స్పష్టమైన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
..
ఆ బోర్లకు యజమానులే బాధ్యులు
నిరుపయోగంగా ఉన్న బోరుబావులు పూర్చకపోవడం సంబంధిత యజమానుల బాధ్యతా రాహిత్యానికి నిదర్శనమని పరిషత్ నాయకుడు ఎస్‌ఆర్ పాటిల్ తెలిపారు. ఇకపై ఆ బావుల్లో పడి చిన్నారులు గాయపడటం కాని, మృత్యువాత పడటం కాని జరిగితే బోరుబావి యజమానితోపాటు బావిని తవ్విన సంస్థ యజమానిపై క్రిమినల్ కేసులు వేస్తామని జీరో అవర్‌లో వీరణ్ణ మత్తికట్టి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.
పాలక పక్ష సభ్యుల వాగ్వాదం
Published Tue, Jul 1 2014 3:08 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM
Advertisement
Advertisement