మిడ్ మానేరుకు గండి
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో నిర్మాణ దశలో ఉన్న మిడ్ మానేరు ప్రాజెక్ట్ కట్టకు గండిపడింది. ఎగువ మానేరు నుంచి భారీగా వస్తున్న వరదతో మిడ్ మానేరు మట్టికట్ట కొట్టుకుపోయింది. దీంతో అప్రమత్తమైన అధికారులను దిగువ ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. భారీ వర్షాలతో పొటెత్తిన వరదల కారణంగా భారీ మొత్తంలో ప్రవాహం వచ్చి డ్యాంలో చేరడంతో అనూహ్యంగా డ్యాం మట్టికట్టకు గండి పడింది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తమయ్యారు.
గండి పడిన ప్రాంతాన్ని మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్రావు, జిల్లా కలెక్టర్ నీతుకుమారి ప్రసాద్ ఆదివారం పరిశీలించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రజలు ఆందోళన చెందొద్దని మంత్రులు భరోసానిచ్చారు. మానేరు డ్యామ్కు 5 లక్షల క్యూసెక్కుల నీటి సామర్థ్యం ఉందన్నారు. నాలుగు గ్రామాల్లో పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. త్వరలోనే గ్రామస్తులకు నష్టపరిహారం చెల్లించి గ్రామాలను ఖాళీ చేయిస్తామని చెప్పారు.
కొదురుపాక, మన్వాడ, రుద్రవరం గ్రామాలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. గండిపడిన కారణంగా సిరిసిల్ల-కరీంనగర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వరదతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. 50 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు ఇప్పటికే అధికారులు తరలించారు. సహాయక చర్యలను ప్రారంభించారు. మరోపక్క, మిడ్ మానేరు వద్దకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి.