
వలస కార్మికులు తెలంగాణకు వచ్చేయాలె!
* భివండీలోని చేనేత కార్మికులతో కడియం శ్రీహరి
భివండీ, న్యూస్‌లైన్ : భివండీలో స్థిరపడ్డ తెలంగాణకు చెందని వలస ప్రజలందరూ తమ సొంత రాష్ట్రంలోనే స్థిరపడాలనితెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కోరుతున్నారని వరంగల్ పార్లమెంట్ సభ్యుడు కడియం శ్రీహరి చెప్పారు. తెలంగాణలో వస్త్ర పరిశ్రమలకు కావాల్సిన అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని చెప్పారు.
చేనేత కార్మికుల కోసం ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. అందువల్ల వలసప్రజలందరు మళ్లీ తెలంగాణకు రావాలని పిలుపునిచ్చారు.
టెక్స్‌టైల్ పార్కుల అధ్యయనం కోసం బయలుదేరిన తెలంగాణ ప్రతినిధుల బృందం భివండీ చేరుకుంది. వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి నేతృత్వంలో వర్ధన్నపేట శాసనసభ్యులు ఆరూర రమేష్, పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి, ప్రభుత్వ సలహాదారులు బి.వి.పాపారావు, పరిశ్రమల విభాగం కమిషనర్ జయేష్ రంజన్ తదితరులతో కూడిన బృందం రెండు రోజుల పాటు సూరత్‌లో పర్యటించి, మూడవ రోజు భివండీ చేరుకున్నారు.
ఇక్కడి అత్యాధునిక హంగులతో కూడిన టెక్స్‌టైల్స్ పరిశ్రమలతోపాటు చిన్నతరహా పరిశ్రమలు, పవర్‌లూమ్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా భివండీ పద్మశాలి సమాజ్ హాల్‌లో అఖిల పద్మశాలి సమాజం, పవార్‌లూమ్ విభాగం, ఆల్ ఇండియా పద్మశాలి సంఘం, హైదరాబాద్ ఆధ్వర్యంలో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రతినిధి బృందం సభ్యులు పద్మశాలి సమాజ పెద్దలు, పవార్ లూమ్ యజమానులు, వ్యాపారులతో చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా అనేక మంది తెలంగాణలో తామెదుర్కొన్న సమస్యలను ప్రభుత్వ ప్రతినిధుల ముందు ఏకరువు పెట్టారు. గాజెంగి రాజు, ఎస్ మల్లెశం, వేముల నర్సయ్య, వంగ పురుషోత్తం, సిరిపురం తిరుపతి తదితరులు మాట్లాడుతూ 15 ఏళ్ల కిందట అనాటి ప్రభుత్వ హామీల మేరకు అనేక మంది భివండీకి చెందిన తెలంగాణ ప్రజలు సిరిసిల్ల పట్టణంలో కోట్లాది రూపాయలతో ఫ్యాక్టరీలను ఏర్పాటు చేశారని చెప్పారు.
అయితే ఇప్పటివరకు ప్రభుత్వం ప్రకటించిన సబ్సీడీలేవీ లభించకపోగా తెలంగాణలో కరెంటు కష్టాలు కూడా తీవ్రంగా ఉన్నాయన్నారు. మరోసారి మీరు రావడం ఆనందకరమైనప్పటికీ హామీలన్నీ నెరవేర్చాలని కోరారు. అనంతరం ప్రతినిధి బృందానికి విన్నతిపత్రాలను అందచేశారు. ఈ కార్యక్రమంలో అఖిల పద్మశాలి సమాజ్ అధ్యక్షులు కముటం శంకర్, కొంక మల్లేశం, బొల్లి రమేష్, కుందన్ పురుషోత్తం, మంచికట్ల విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.