ప్రభుత్వం (ఆవిన్), ప్రయివేటు సంస్థలు పోటీ పడి పాల ధరను పెంచేస్తున్నాయి. ప్రయివేటు పాల కంపెనీలు లీటరుపై రూ.2 నుంచి రూ.4వరకు ధర ను పెంచాయి. పెరిగిన ధరలను సోమవారం నుంచి అమల్లోకి తెస్తున్నాయి.
చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్రంలో ప్రభుత్వం తరపున ఆవిన్ పాల అమ్మకాలు సాగుతున్నాయి. ఇది కాక తిరుమల, హెరిటేజ్, టోడ్లా, జెర్సీ వంటి ప్రయివేటు కంపెనీలు సైతం ప్యాకెట్ పాలను, పాల ఉత్పత్తులను సరఫరా చేస్తున్నాయి. ఆవిన్ పాలధరను లీటరుకు రూ.24 నుంచి రూ.34కు ఇటీవలే ప్రభుత్వం పెంచింది. పాల సేకరణ ధరను పెంచడం వల్ల అమ్మకం రేట్లను పెంచక తప్పలేదని ప్రభుత్వం సర్ది చెప్పుకుంది. ప్రజలు, ప్రజా సంఘాల నుంచి తీవ్ర నిరసనలు వెల్లువెత్తినా లెక్కచేయక ఈ నెల 1వ తేదీ నుంచి పెంచిన ధరలను అమల్లోకి తెచ్చింది. దీంతో ప్రయివేటు సంస్థలు రూ.4 వరకు పెంచడానికి సిద్ధమయ్యాయి. తిరుమల, హెరిటేజ్ సంస్థలు ఫుల్‌క్రీం పాల ధర రూ.48 నుంచి రూ.52కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారుు.
మరో రకం పాలపై ప్రభుత్వంతో పాటూ పెంచిన ప్రయివేటు కంపెనీలవారు తాజాగా మరోసారి పెంచారు. ఈ నెల మొదటి వారంలో పాలు లీటరుపై రూ.36 నుంచి రూ.40కు పెంచి నేడు మళ్లీ రూ.40 నుంచి రూ.44 పెంచారు. టోడ్లా, జెర్సీ సంస్థలు లీటరుపై రూ.2 మాత్రమే పెంచాయి. ఆరోగ్యపాల సంస్థ ఈనెల 6న రూ.4 పెంచింది. ప్రయివేటు పాల ధర పెంపు ప్రభావం పెరుగుపై కూడా పడింది. 100, 120 ఎమ్‌ఎల్ పెరుగు కప్ ధర రూ.10 నుంచి రూ.12, రూ.12 నుంచి రూ.14గా పెరిగింది. 200, 400ఎమ్‌ఎల్ పెరుగు కప్పుల ధర రూ.15 నుంచి రూ.18, రూ.32 నుంచి రూ.35గా పెరిగింది. అంటే కప్పు పెరుగుపై రూ.3 భారం పడింది. ప్రయివేటు పాల ఉత్పత్తి దారులు ఈ ఏడాది ఐదు సార్లు పాలధరను పెంచడం పట్ల నిరసన వ్యక్తం అవుతోంది. ప్రయివేటు కంపెనీలు లీటరుపై రూ.12 పెంచేశాయి.
పాల మోత
Published Mon, Nov 10 2014 2:47 AM | Last Updated on Sat, Sep 2 2017 4:09 PM
Advertisement