
యమ ధర్మపురి
చెన్నై, సాక్షి ప్రతినిధి : ఏడాది పొడవునా కొనసాగుతున్న పురిటి బిడ్డల మరణాలపై అటు ప్రభుత్వం, ఇటు ధర్మపురి జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రి సైతం భగవ ద్గీత బాటపట్టాయి. ఇవన్నీ సహజమరణాలేనని తేల్చేశాయి. ఆరోగ్యంపై అవగాహనా లేమే కారణమంటూ ప్రజలపై నెట్టేశాయి. ఈ ఏడాది నవంబరు వరకు 321 మంది చిన్నారులు మృత్యువాత పడడం ఆస్పత్రి యంత్రాంగం బాధ్యతారాహిత్యానికి అద్దం పడుతోంది.
పెరుగుతున్న శిశుమరణాలు
సంఖ్యాపరంగా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్న రాష్ట్రంలోని ఆస్పత్రులు శిశుమరణాలను అరికట్టలేకపోతున్నాయి. నాలుగేళ్ల వివరాలను పరిశీలిస్తే ఇది తేటతెల్లం అవుతోంది. 2011లో 2,350 శిశువులు జన్మించగా 270 మంది (11.4శాతం) మృత్యువాత పడ్డారు. 2012లో 3,623కు గానూ 374 మంది (10.3శాతం), 2013లో 4,155కు గానూ 445 మంది (11శాతం) కన్నుమూశారు. ఇక ఏడాది నవంబరు వరకు 4,143 పిల్లలు జన్మించగా 445 మంది (10.74 శాతం) ప్రాణాలు విడిచారు. శిశువుల పాలిట నరకంప్రస్తుతం వార్తల్లోకి ఎక్కిన ధర్మపురి ప్రభుత్వ ఆస్పత్రిలో 2011 ఫిబ్రవరి 23న చిన్నపిల్లల అత్యవసర విభాగాన్ని ప్రారంభించారు. ఆక్సిజన్, వెంటిలేటర్, ఇంక్యుబులేటర్ తదితర అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులో ఉంచారు. ధర్మపురి జిల్లాతోపాటూ హోసూరు, కృష్ణగిరి, వేలూరు తదితర జిల్లాల నుంచి రోజుకు సగటున 2500 మంది ఔట్‌పేషెంట్లుగా, 900 మంది ఇన్‌పేషెంట్లుగా వైద్యసేవలు పొందుతుంటారు.
అయినా ఆ ఆస్పత్రిలో శిశుమరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో 539 మంది జన్మించగా 34 మంది ప్రాణాలు విడిచారు. మేలో 514కు 39 మంది, జూన్‌లో 444 మందికి 48 మంది, జూలైలో 518కి 41, ఆగస్టులో 485కి 35, సెప్టెంబరులో 504కు 41, అక్టోబరులో 579 మందికి 48మంది, నవంబరులో ఇప్పటి వరకు 35 మంది చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అంటే ఈ ఒక్క ఏడాదిలోనే ధర్మపురి ఆస్పతిలో 321 మంది మృత్యువాత పడ్డారు. గత ఐదు రోజుల్లో 12 మంది చిన్నారులు విగతజీవులుగా మారి తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారు. మరో 16 మంది చిన్నారులు మృత్యువుతో పోరాడుతున్నారు.
అవగాహనే లోపమట
ఈ శిశుమరణాలకు ప్రజల్లో అవగాహనలేమే కారణమంటూ ప్రభుత్వం వాదిస్తోంది. రాష్ట్రంలో అటవీ సమీప గ్రామాల సంఖ్య గణనీయంగానే ఉంది. అక్కడి ప్రజలకు ఇప్పటికీ సరైన విద్యా, వైద్య సౌకర్యాలు లేవు. కుటుంబ నియంత్రణ, ఆరోగ్యం, అక్షరాస్యత, బాల్యవివాహాల వల్ల ఒనగూరే నష్టాలపై అవగాహన వారు అక్కడ లేరు. కడుపేదరికం వారిపాలిట మరోశాపంగా ఉంది. దీంతో అక్కడి గృహిణులు బిడ్డ బిడ్డకు పాటించాల్సిన వ్యవధిని అవలంభించరు. దీంతో తల్లీ బిడ్డకు పౌష్టికాహారం కరువైపోతుంది. ఈ పరిణామాలు కాన్పు సమయంలో బిడ్డను రోగగ్రస్తం చేస్తున్నాయి. నెలలు నిండకుండానే జన్మించడం, కనీస బరువులేకుండానే పుట్టడం మృతికి దారితీస్తున్నారుు. ఇది కొంతవరకు నిజమైనా ఈ లోటును సరిదిద్దేందుకు ఇన్నాళ్లూ ప్రభుత్వాలు ఏమి చేస్తున్నాయనేది ప్రశ్నగా మిగిలింది. తమిళనాడు వైద్యవిద్య సంచాలకులు డాక్టర్ గీతాలక్ష్మి సైతం ఇవే విషయాలను ధృవీకరించారు. చనిపోతున్న చిన్నారులు 1.25 కిలోల నుంచి 2 కిలోల బరువుంటున్నారని, వారి శరీరం చికిత్సకు సైతం సహకరించడం లేదని చెప్పారు. భారత దేశంలో సగటున వెయ్యిమందికి 21 మంది చిన్నారులు, రాష్ట్రంలో వెయ్యిమందికి 15 మంది చిన్నారులు పుట్టిన నాలుగువారాల్లోనే మరణిస్తున్నట్లు ఆమె చెప్పారు. ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సైతం ప్రభుత్వ తప్పిదం ఏమీ లేదని సమర్థించుకున్నారు. మరి కొనసాగుతున్న శిశుమరణాలను అరికట్టేవారెవరో?
చిన్నారుల మృతిపై గగ్గోలు
ధర్మపురి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వరుస శిశు మరణాలతో ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి. ధర్మపురి ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యవసర చిన్నపిల్లల విభాగంలో గత కొంతకాలంగా చికిత్స పొందుతున్న పురిటిబిడ్డలు వరుసకట్టి ప్రాణాలు విడుస్తున్నారు. ఈ నెల 14న ఐదుగంటల వ్యవధిలో వరుసగా ఐదుగురు, 15వ తేదీ మరో చిన్నారి, 16,17 తేదీల్లో ముగ్గురు మగ, ఇద్దరు ఆడ శిశువులు మృతి చెందారు. అంటే కేవలం నాలుగురోజుల్లో మొత్తం 11 మంది చిన్నారులు కన్నుమూశారు. ఈనెల 17వ తేదీ నాటికి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 70 చిన్నారుల్లో ఆరుగురి పరిస్థితి విషమంగా మారడంతో సేలం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అక్కడ మరో బిడ్డ కన్నుమూసింది. గత వారం పది రోజుల్లో అక్కడ 10 మంది చిన్నారులు మృత్యువాతపడ్డారు. ధర్మపురి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రస్తుతం 73 మంది చిన్నారులుండగా వారిలో 14 మందికి అత్యవసర చికిత్స చేస్తున్నారు. మరో నలుగురి పరిస్థితి సీరియస్‌గా ఉంది. ఆరోగ్యమంత్రి డాక్టర్ విజయభాస్కర్ బుధవారం ఆస్పత్రిని సందర్శించారు.
వైద్య మంత్రి రాజీనామా చేయాలి : బీజేపీ
వరుస శిశుమరణాలకు నైతికబాధ్యత వహించి వైద్య ఆరోగ్యశాఖా మంత్రి డాక్టర్ విజయభాస్కర్ పదవికి రాజీనామా చేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం డిమాండ్ చేశారు. ఒక వైద్యురాలిగా చెబుతున్నా, అక్కడ కనీస వసతులు లేవు, తగిన సిబ్బంది లేరని ఆమె తప్పుపట్టారు. ప్రభుత్వాసుపత్రుల్లో వాస్తవ స్తితిపై శ్వేతపత్రం ప్రకటించాలని ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. చిన్నారుల చావుకు కారణమైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డీఎంకే అధినేత కరుణానిధి డిమాండ్ చేశారు.