ముంబై:
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్-ఎన్సీపీ మధ్య విభేదాలు ముసురుకుంటున్నాయి. ఎన్సీపీ అధిపతి శరద్ పవార్ గురువారం ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలే ఇందుకు ఉదాహరణ. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌పై నేరుగా దాడి చేయకుండా.. రాష్ట్రంలో పాలన నత్తనడకనసాగుతోందని విమర్శించారు. ‘పాలనా వ్యవహారాలు చూస్తున్న వారు సమర్థంగా వ్యవహరించక పోవడం వల్ల ఫైళ్లకు అనుమతులు మంజూరు కావడం లేదు. దీంతో పాలన స్తంభిస్తోంది. నెలలు గడుస్తున్నా ముఖ్యమైన పత్రాలపైనా సంతకాలు కావడం లేదు. ఏవైనా పనులు అనవసరం అనుకుంటే వాటిని వెంటనే తిరస్కరించాలి. నిర్ణయాలు త్వరగా తీసుకోవాలి’ అని వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్‌పై రచించిన ఈ పుస్తకాన్ని పవార్ ఆవిష్కరించాక మాట్లాడుతూ పైవిధంగా అన్నారు. దేశ్‌ముఖ్ సమర్థ ముఖ్యమంత్రని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను బట్టిచూస్తే చవాన్‌పై పవార్ అసంతృప్తితో ఉన్నారనే అభిప్రాయాలు వినిపించాయి. చవాన్ పాలన మందకొడిగా సాగుతోందని, కొత్త ప్రాజెక్టులు మంజూరు చేయడం లేదని ఎన్సీపీతోపాటు కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే.
సీట్ల లొల్లే కారణమా ?
రాబోయే ఎన్నికల్లోనూ ఈ రెండు పార్టీలూ ఉమ్మడిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి తమకు లోక్‌సభ సీట్ల సంఖ్య పెంచాలని కాంగ్రెస్ డిమాండ్ చేయడం ఎన్సీపీకి నచ్చడం లేదని తెలుస్తోంది. ‘మారుతున్న రాజకీయ పరిస్థితులను పరిశీలించాలకే సీట్లను పెంచాలనే డిమాండ్‌ను లేవనెత్తాలని నిర్ణయించుకున్నాం’ అని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఒకరు అన్నారు. కాంగ్రెస్‌కు ప్రస్తుతం రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలు ఉన్నాయి.
ఎన్సీపీకి ఎనిమిది మంది సభ్యులు ఉన్నారు. 2009లో ఇది 26 స్థానాల్లో పోటీ చేసింది. ‘2004లో మా పనితీరు ఆధారంగా 2009లో కాంగ్రెస్‌కు సీట్లు కేటాయించారు. ఇప్పుడు మా సామర్థ్యం మెరుగుపడింది కాబట్టి ఎంపీ స్థానాల సంఖ్య కూడా పెరగాలి. 2006లో మాకు 69 అసెంబ్లీ స్థానాలుంటే 2009లో అవి 82కు పెరిగాయి. ఎన్సీపీ స్థానాలు 71 నుంచి 62కు పడిపోయాయి’ అని సదరు నాయకుడు వివరించారు. హింగోలీ, కొల్హాపూర్, పర్భణి, అమరావతి, జల్గావ్‌లోని రెండు ఎంపీ సీట్లలో ఒకటిని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. జల్గావ్‌లో ఒక ఎన్సీపీకి ఒక ఎంపీ ఉన్నాడు. ఇక ఎన్సీపీ యావత్మల్, జాల్నా, రాయిగఢ్, పాల్ఘర్ స్థానాలపై కన్నేసింది. ప్రస్తుతం కాంగ్రెస్ ఖాతాలో ఉన్న పుణే ఎంపీ స్థానం కూడా మాకే కావాలని ఎన్సీపీ కోరుతోంది. అయితే ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే యావత్మల్‌కు చెందిన వారు కాగా, మాజీ సీఎం అబ్దుల్ రెహమాన్ రాయిగఢ్ సొంతస్థానం కావడ ం గమనార్హం. ఇక కాంగ్రెస్ డిమాండ్‌పై ఎన్సీపీ మండిపడుతోంది.
‘కాంగ్రెస్ మాతో పొత్తును రద్దు చేసుకొని మొత్తం 48 స్థానాల్లో పోటీ చేయొచ్చు! కొన్ని సీట్ల మార్పిడికి మాత్రం మేం సిద్ధం. మా అధిష్టానమే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటుంది’ అని చెప్పారు. ఈసారి కేంద్రంలో అదృష్టం కలిసివస్తే పవార్‌ను ప్రధాని అభ్యర్థిగా రంగంలోకి దింపాలని ఎన్సీపీ కోరుకుంటోంది. అందుకే ఎంపీ స్థానాలపై పట్టువీడడం లేదు. దీనికితోడు ప్రతిపక్షాల ఎంపీలు కొందరు తమ పార్టీలో చేరే అవకాశం ఉండడంతో సీట్లను వదులుకోవడానికి ఎంతమాత్రమూ అంగీకరించడం లేదు. ఎన్సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే నవాబ్ మాలిక్ ఈ విషయంపై స్పందిస్తూ ఢిల్లీలో జరిగిన ఒప్పందం ప్రకారం 26:22 నిష్పత్తిలో సీట్ల కేటాయింపు ఒప్పందానికి కాంగ్రెస్ కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టీకరించారు.
ఈ విషయమై త్వరలోనే కాంగ్రెస్‌తో చర్చిస్తామని వెల్లడించారు. ఇక చవాన్‌పై పవార్ చేసిన విమర్శలపై స్పందిస్తూ తమ అధినేత ఇంగ్లిష్ చేసిన వ్యాఖ్యలను మరాఠీలో తప్పుగా తర్జుమా చేయడం వల్ల ఇలా జరిగిందని, రెండు పార్టీల మధ్య విభేదాలేవీ లేవన్నారు.
కాంగ్రెస్ ఎన్సీపీ మధ్య ముదురుతున్నవిభేదాలు
Published Sat, Sep 14 2013 12:12 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement