రాష్ట్రంలో జిల్లాల వారీగా పార్టీ పరిస్థితి, అక్కడి నేతల వ్యవహార శైలి గురించి డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ రహస్య సర్వే నిర్వహించి ఉన్నారు. బలహీనంగా ఉన్నచోట్ల బలోపేతం లక్ష్యంగా, గ్రూపు తగాదాలు ఉన్న చోట్ల ప్రత్యామ్నాయం అడుగులకు సిద్ధం అయ్యారు. గ్రూపు రాజకీయాలు సాగిస్తున్న జిల్లాల నేతల్ని పిలిపించి చీవాట్లు పెట్టడంతోపాటుగా తీవ్ర హెచ్చరికలు చేసి పంపుతున్నారు. ఉన్న జిల్లాల సంఖ్యను 65కు చేర్చారు. నాయకుల్లో ఉన్న అసంతృప్తి జ్వాలను చల్లార్చే రీతిలో వ్యవహరించి పదవుల్ని కేటాయించారు. అనేక జిల్లాల్లో కీలక పదవుల్ని కొత్త వాళ్లకు, యువతకు అప్పగించారు. ఇంత వరకు అంత బాగానే ఉన్నా, జిల్లాల్లో సీనియర్లు, జూనియర్లు అన్న బేధాలు లేకుండా అందరూ సమిష్టిగా పనిచేయాలన్న విషయాన్ని సేనలకు ఉపదేశించడంలో మరిచారు. దీంతో కొత్తగా ఎంపికైన వాళ్లకు సీనియర్లను చిక్కులు, సమస్యలు తప్పలేదు. ఇది కాస్త గ్రూపులకు ఆజ్యం పోసి ఉన్నది.
స్టాలిన్ సర్వే : అధినేత కరుణానిధి వారసుడిగా, ప్రతినిధిగా నిత్యం పార్టీ వర్గాలకు అందుబాటులో ఉన్నది డిఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ అన్న విషయం తెలిసిందే. పార్టీ సంస్థాగత సమరం, పదవుల పందేరాలు ముగియడంతో ప్రస్తుతం జిల్లాల్లో పార్టీ పరిస్థితి, నేతల తీరు తెన్నులు , వ్యవహార శైలిపై స్టాలిన్ రహస్య సర్వే చేపట్టి ఉన్నారు. రాష్ర్టంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాల వారీగా సమాచారాన్ని సేకరించి ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలం పేరిగి ఉన్నట్టు ఆ సర్వేలో తేలి ఉన్నది. అలాగే, గతంలో మరీ బలహీనంగా ఉన్న కొన్ని జిల్లాల్లో పార్టీ బల పడ్డా, కొందరు నాయకుల గ్రూపు రాజకీయాల రూపంలో ఎన్నికల వేళ చిక్కులు తప్పవన్న విషయం ఆ సర్వేలో తేలింది. ఈ సమాచారంతో మేల్కొన్న స్టాలిన్ గ్రూపు రాజకీయాలకు కల్లెం వేసే పనిలో పడ్డారు. రోజుకు ఒక జిల్లా చొప్పున అక్కడున్న నాయకులందరిని పిలిపించి క్లాస్ పీకే పనిలో పడ్డట్టు అన్నా అరివాలయం వర్గాలు పేర్కొంటున్నారు.
హెచ్చరికలు : అన్ని జిల్లాల నాయకులతో స్టాలిన్ మంతనాలు జరుపుతూ, సూచనలు సలహాలు, మందలిస్తున్నా, ప్రధానంగా పదిహేను జిల్లా నాయకుల్ని మాత్రం టార్గెట్ చేసి తీవ్రంగా హెచ్చరించే పనిలో పడ్డట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా బుధవారం తిరునల్వేలి జిల్లాలోని నాయకులతో సాగిన భేటీ వాడి వేడిగా జరిగినట్టు పేర్కొంటున్నారు. ఈ సమావేశానికి తిరునల్వేలి పరిధిలోని మూడు జిల్లాల కార్యదర్శులు ఆవుడయప్పన్, అబ్దుల్ వాహాబ్, దురై రాజ్‌లతో పాటుగా మాజీ మంత్రు లు పూంగోదై, మొహిద్దీన్ ఖాన్, యూనియన్, నగర విభాగాల నాయకుల్ని, మాజీ ఎమ్మెల్యేలను పిలిపించి ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు కరుప్పుస్వామి పాండియన్ మాత్రం డుమ్మా కొట్టారు.
ఈ భేటీలో ప్రధానంగా గ్రూపు రాజకీయాలకు కల్లెం వేయడం లక్ష్యంగా స్టాలిన్ తీవ్రంగా స్పందించినట్టు ఆ జిల్లా నాయకులు ఒకరు పేర్కొన్నారు. రెండు గంటల పాటుగా సాగిన ఈ భేటీలో రాష్ట్రంలో పరిస్థితులు డీఎంకేకు అనుకూలంగానేఉన్నాయని, ఐక్యతతో ముందుకు సాగని పక్షంలో ఫలితాలు తారుమారయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించి ఉన్నారు. ఎవరికి వారు గ్రూపులతో, విబేధాలతో సాగిన పక్షంలో పార్టీని ఒడ్డుకు చేర్చడం కష్టం అని మందలించి ఉన్నారు. వాళ్లతో కలిసి పనిచేయం, వీళ్లతో కలసి పనిచేయం అని వాళ్లు మర్యాదగా పార్టీ నుంచి బయటకు వెళ్ల వచ్చని, అసవరం అయితే, జిల్లా కమిటీల్ని రద్దు చేస్తానని తీవ్రంగా హెచ్చరించినట్టుగా అన్నా అరివాలయంలో చర్చ సాగుతున్నది. స్టాలిన్ తీవ్రంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తుండడంతో గ్రూపుల్ని కట్టిబెట్టి ఐక్యతను చాటుకునే విధంగా స్టాలిన్ ఎదుట ప్రత్యక్షం అయ్యేందుకు ఆయా జిల్లాల నాయకులు సిద్ధం అవుతున్నారటా..!
స్టాలిన్ సర్వే
Published Fri, May 8 2015 3:15 AM | Last Updated on Sun, Sep 3 2017 1:36 AM
Advertisement
Advertisement