నేతల ‘కొత్త’ నోట్ల దందా!
• స్టింగ్ ఆపరేషన్‌తో వెలుగులోకి..
• 30 నుంచి 40 శాతం కమీషన్‌కు నల్లధనం మార్పిడి
న్యూఢిల్లీ: అవినీతిని నిర్మూలిస్తుందంటూ ప్రధాని మోదీ ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు .. అక్రమార్కుల పాలిట మరో ఆదాయ మార్గంగా మారింది. 30% నుంచి 40% కమీషన్ తీసుకుని నల్లడబ్బును సక్రమం చేసే కొత్త వ్యాపారంపై నవంబర్ 8 తరువాత పలు వార్తలు రావడం తెలిసిందే. రాజకీయ పార్టీల నేతలు ఈ మార్గాన్ని సైతం తమ అక్రమ సంపాదనకు వాడుతున్న విషయం ‘ఇండియాటుడే టీవీ’ స్టింగ్ ఆపరేషన్‌లో తేలింది. ఆపరేషన్‌లో బీఎస్పీ, ఎస్పీ, కాంగ్రెస్, ఎన్సీపీ, జేడీయూల నేతలు కమిషన్ కోసం బేరాలాడుతూ కెమెరాకు అడ్డంగా దొరికిపోయారు. ఈ కొత్త దందాకు కేంద్రాలుగా వారు తమ పార్టీ ఆఫీసులనే వాడుకోవడం కొసమెరుపు.
కాంగ్రెస్..
ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ నేత తారిఖ్ సిద్దిఖీని కలిసిన ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌లు రూ. కోటి నల్లధనాన్ని మార్చడానికి వీలవుతుందా అని ప్రశ్నించారు. దానికి సిద్దిఖీ.. అందుకు తనకు తెలిసిన ఎన్జీఓను పరిచయం చేస్తానని హామీ ఇచ్చాడు. తనకు తెలిసిన వేరే మార్గాలూ ఉన్నా కానీ అవి అంత నమ్మకమైనవి కావని, ఈ ఎన్జీవోను నమ్మొచ్చని అన్నాడు.
బీఎస్పీ..
యూపీలోని ఘజియాబాద్ జిల్లా బీఎస్పీ అధ్యక్షుడు వీరేంద్ర జాటవ్‌తో.. 10 కోట్ల నల్లధనాన్ని మార్చాలంటూ బేరం ప్రారంభించగా.. 40 శాతానికి తగ్గకుండా కమీషన్ ఇస్తే కొత్త నోట్లు ఇస్తానని జాటవ్ హామీ ఇచ్చాడు. ‘హ్యాండ్ టు హ్యాండ్.. మొత్తం కొత్త నోట్లే ఇస్తా’నని స్పష్టం చేశాడు.
ఎస్పీ, ఎన్సీపీ, జేడీయూ..
సమాజ్‌వాదీ పార్టీ నోయిడా మహానగర్ శాఖ సభ్యుడు టిటు యాదవ్ కూడా అదే(40%) కమీషన్‌కు ఎంత మొత్తమైనా మార్చేస్తామని స్పష్టం చేశాడు. ఎన్సీపీ ఢిల్లీ శాఖ ప్రధాన కార్యదర్శి రవి కుమార్‌ను కలిసి కోటి రూపాయల బ్లాక్ మనీని మార్చాలంటూ అడగగా.. 30 శాతం కమీషన్‌కు మార్చేస్తానన్నాడు. ‘ఇప్పుడే తీసుకురండి..70% అమౌంట్ తిరిగిచ్చే హామీ నాది. అదీ చెక్ రూపంలో’ అని పేర్కొన్నాడు. నల్లడబ్బును ఎలా మారుస్తారు? చెక్ రూపంలో ఇచ్చినప్పుడు ఎలా వివరణ ఇస్తారు? అని ప్రశ్నించగా.. ‘ఒక నకిలీ పీఆర్ కంపెనీని సృష్టిస్తాం.. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ఆ కంపెనీ సేవలు ఉపయోగించుకున్నామని చెబుతాం’ అన్నారు. జేడీయూ ఢిల్లీ ఉపాధ్యక్షుడు సతీశ్ సైనీని పార్టీ ఆఫీస్‌లో సంప్రదించగా.. 40% కమీషన్ నడుస్తోంది కానీ.. నేను 30 శాతానికి పని చేసి పెడ్తాను’ అన్నాడు.