సాక్షి, ముంబై: ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ముంబై రైల్వే వికాస్ కార్పొరేషన్ (ఎమ్మార్వీసీ) నగరవ్యాప్తంగా ముఖ్య రైల్వేస్టేషన్లలో 68 ఎస్కలేటర్లు, 30 లిఫ్టులను అమర్చేందుకు యోచిస్తోంది. మరో రెండేళ్లలో ప్రయాణికులకు ఇవి అందుబాటులోకి రానున్నట్లు ఎమ్మార్వీసీ అధికారులు చెప్పారు. ప్రస్తుతం నగరవ్యాప్తంగా ఏడు ఎస్కలేటర్లు ఉన్నాయి. నగర శివారు ప్రాంతాల్లో మరో రెండేళ్లలో అదనంగా 38 ఎస్కలేటర్లను ఏర్పాటుచేయడానికి ఎమ్మార్వీసీ పూనుకుంది.
ఇదిలా వుండగా వెస్టర్న్ రైల్వేలో 21 ఎస్కలేటర్లు, అదేవిధంగా ఎనిమిది లిఫ్టుల ఏర్పాటుకు యోచించగా, సెంట్రల్ రైల్వే తొమ్మిది ఎస్కలేటర్లు, 18 లిఫ్టులను ఏర్పాటుచేసేందుకు ప్రతిపాదించింది. చాలా మంది ప్రయాణికులు హడావుడిగా రైలు పట్టాలు దాటుతూ తమ ప్రాణాలు పోగొట్టుకుంటుండడంతో వీటిని అరికట్టే ఉద్దేశంతోనే ముఖ్య రైల్వేస్టేషన్లలో లిఫ్టులు, ఎస్కలేటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మార్వీసీ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ రాకేష్ సక్సేనా తెలిపారు. రైల్వే ఆవరణలోని ఫుట్ ఓవర్ బ్రిడ్జి మెట్లు ఎక్కేందుకు ముఖ్యంగా వయోధికులు, వికలాంగులు చాలా ఇబ్బందులకు లోనవుతుంటారు. దాంతో వారిలో చాలామంది తమ ప్రయాణాన్ని కూడా వాయిదా వేసుకోవాల్సి వస్తోంది. కాగా ఈ ఎస్కలేటర్లను ప్రాధాన్యత ప్రతిపాదికన నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్గించడంలో ఖర్చుకు వెనుకాడబోమని ప్రయాణికుల సంఘటన సభ్యుడు అశోక్ దాతర్ తెలిపారు.
కాగా ఎమ్మార్వీసీ ‘ట్రెస్ పాస్ కంట్రోల్’ ప్లాన్‌లో భాగంగా ఏప్రిల్ చివరివరకు 26 ఎస్కలేటర్లు, ఎనిమిది లిఫ్టులను నిర్మించనుంది. అంతేకాకుండా అంధేరీ, గోరేగావ్ స్టేషన్లలో ఒక్కోచోట ఆరేసి ఎస్కలేటర్లు, రెండు లిఫ్టులను నిర్మించనుందని సక్సేనా వివరించారు. సెంట్రల్ రైల్వే, వెస్టర్న్ రైల్వే సంయుక్తంగా ఈ ప్రాజెక్టు కోసం రైల్వే బోర్డును అదనంగా నిధులు అందించాల్సిందిగా కోరాయి. ఏప్రిల్ చివరి వరకు రద్దీ స్టేషన్లలో ఎస్కలేటర్లు ఏర్పాటు చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ‘ట్రెస్ పాస్ కంట్రోల్ ప్లాన్’ ప్రాజెక్టు కింద ఏడాది వరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తని ఎస్కలేటర్లను అమర్చనున్నట్లు సక్సేనా తెలిపారు.
ప్రాజెక్టులో భాగంగా స్కైవాక్‌లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, 12 స్టేషన్లలో ర్యాంపులు కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వివరించారు. కాగా, వెస్టర్న్ రైల్వేలోని ముంబై సెంట్రల్‌లో 5 ఎస్కలేటర్లను ఏర్పాటుచేయగా దాదర్‌లో రెండు ఎస్కలేటర్లు, అదేవిధంగా రెండు లిఫ్టులు, బాంద్రాలో నాలుగు ఎస్కలేటర్లు, అంధేరీలో ఏడు ఎస్కలేటర్లు, రెండు లిఫ్టులు, బోరివలిలో ఎనిమిది ఎస్కలేటర్లు, నాలుగు లిఫ్టులు, భయందర్‌లో నాలుగు ఎస్కలేటర్లు, రెండు లిఫ్టులు ఏర్పాటుచేయనున్నామన్నారు.
కాగా సెంట్రల్ రైల్వేలోని దాదర్‌లో మూడు ఎస్కలేటర్లు, ఆరు లిఫ్టులు, కుర్లాలో నాలుగు ఎస్కలేటర్లు, ఘాట్కోపర్‌లో రెండు ఎస్కలేటర్లు, రెండు లిఫ్టులు, విక్రోలీలో ఒక్క ఎస్కలేటర్, ఠాణేలో నాలుగు ఎస్కలేటర్లు, మూడు లిఫ్టులు, కల్యాణ్‌లో నాలుగు ఎస్కలేటర్లను మరో రెండేళ్లలో సిద్ధం చేయనున్నట్లు సక్సేనా తెలిపారు.
రైల్వే స్టేషన్లలో మరిన్ని సౌకర్యాలు
Published Wed, Mar 12 2014 10:50 PM | Last Updated on Sat, Sep 2 2017 4:38 AM
Advertisement