escalators
-
ఈ మాత్రం దానికి ఎస్కలేటర్ ఎందుకో? గిన్నిస్ రికార్డు మళ్లీ..
ఈ ఫొటోలో కనిపిస్తున్నది ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్. ఎత్తయిన అరుగులు ఉన్న ఇళ్లకు ఉండే మెట్ల కంటే తక్కువ మెట్లతో ఈ ఎస్కలేటర్‌ను ఏర్పాటు చేశారు. ఇది ప్రపంచంలోనే అత్యంత చిన్నదైన ఎస్కలేటర్‌గా గిన్నిస్‌బుక్‌లో చోటు పొందింది. జపాన్‌లోని కవాసాకి నగరంలో ఉందిది. కవాసాకి రైల్వే స్టేషన్ దక్షిణం వైపు ద్వారం నుంచి బయటకు వస్తే, ఎదురుగా కనిపించే ‘మోర్’’ డిపార్ట్మెంట్ స్టోర్‌లో ఉంది ఈ బుల్లి ఎస్కలేటర్. దీనికి ఉన్నవి కేవలం ఐదు మెట్లు మాత్రమే! చిన్నపిల్లలు కూడా ఆమాత్రం మెట్లు ఎక్కగలిగినప్పుడు ఈ ఎస్కలేటర్‌ను ఎందుకు ఏర్పాటు చేశారో ఎవరికీ అర్థంకాదు. అయినా, వింతగా ఉండటంతో దీనిని చూడటానికి జనాలు ఇక్కడకు వస్తుంటారు. -
ఎస్కలేటర్ల మధ్య పడిపోయిన చిన్నారి
ఎస్కలేటర్ల మధ్య పడిపోయిన చిన్నారి రైల్వే పోలీసుల అప్రమత్తతో సురక్షితంగా బయటపడ్డ వైనం సికింద్రాబాద్: నడుస్తున్న రెండు ఎస్కలేటర్ల మధ్య పడిపోయిన ఓ చిన్నారి రైల్వేపోలీసుల అప్రమత్తతో సురక్షితంగా బయటపడింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో బుధవారం ఈ ఘటన జరిగింది. వివరాలు... ఉప్పుగూడకు చెందిన నాగేందర్, నాగమ్మ దంపతులు కుమార్తె మహాలక్ష్మిని మల్కాజిగిరికి చెందిన ఆంజనేయులుకు ఇచ్చి రెండేళ్ల క్రితం పెళ్లి జరిపించారు. వీరికి మహేశ్వరి అనే పది నెలల పాపం ఉంది. కొద్దిరోజుల క్రితం మహాలక్ష్మి కూతురు మహేశ్వరిని తీసుకొని మల్కాజిగిరి నుంచి తల్లిగారి ఇంటికి వెళ్లింది. బుధవారం ఉప్పుగూడ నుంచి మల్కాజిగిరికి వెళ్లేందుకు బయలుదేరిన మహేశ్వరి వెంట ఆమె తల్లిదండ్రులు నాగేందర్, నాగమ్మ సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. 6వ నెంబర్ ప్లాట్‌ఫామ్‌పై దిగిన వీరంతా రైల్వేస్టేషన్ నుంచి బయటకు వచ్చేందుకు ఎస్కలేటర్ ఎక్కారు. తాత నాగేందర్ మనవరాలు మహేశ్వరిని చంకన ఎత్తుకుని, మరో చేతిలో బ్యాగును పట్టుకుని ఎస్కలేటర్ ఎక్కేందుకు యత్నించాడు. అయితే, ఆయనకు ఎస్కలేటర్ గురించి అవగాహన లేకపోవడంతో కాలుజారింది. తనను తాను రక్షించుకునే యత్నంలో ఆయన తన చంకన ఉన్న మనవరాలు మహేశ్వరిని వదిలేశాడు. దీంతో ఆ చిన్నారి రెండు ఎస్కలేటర్ల మధ్య అడుగు వెడల్పు కలిగిన ఖాళీ స్థలంలోంచి కింద పడిపోయింది. గది గమనించిన తల్లి కేకలు వేయడంతో అక్కడే ఉన్న ఆపరేటర్ ఎస్కలేటర్లను నిలిపివేశాడు. రెండు ఎస్కలేటర్ల మధ్యలోంచి తొంగి చూసినప్పటికీ మొదట పాప కనిపించలేదు. దీంతో పది మీటర్ల ఎత్తు నుంచి ఎస్కలేటర్ల మధ్య పడిన ఆ చిన్నారికి ఏమైందోనని అందరూ భయపడ్డారు. వెంటనే అక్కడికి చేరుకున్న రైల్వే పోలీసులు సాంకేతిక నిపుణుల సహాయంతో ప్లాట్‌ఫామ్‌ను ఆనుకుని ఉన్న ఎస్కలేటర్ విడిభాగాలను విప్పి చూడగా మహేశ్వరి సురక్షితంగా బయటపడింది. తలకు చిన్నపాటిగాయంతో చిన్నారి బయట పడటంతో కుటుంబసభ్యులతో పాటు అక్కడ ఉన్న ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. -
రైల్వే స్టేషన్లలో మరిన్ని సౌకర్యాలు
సాక్షి, ముంబై: ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ముంబై రైల్వే వికాస్ కార్పొరేషన్ (ఎమ్మార్వీసీ) నగరవ్యాప్తంగా ముఖ్య రైల్వేస్టేషన్లలో 68 ఎస్కలేటర్లు, 30 లిఫ్టులను అమర్చేందుకు యోచిస్తోంది. మరో రెండేళ్లలో ప్రయాణికులకు ఇవి అందుబాటులోకి రానున్నట్లు ఎమ్మార్వీసీ అధికారులు చెప్పారు. ప్రస్తుతం నగరవ్యాప్తంగా ఏడు ఎస్కలేటర్లు ఉన్నాయి. నగర శివారు ప్రాంతాల్లో మరో రెండేళ్లలో అదనంగా 38 ఎస్కలేటర్లను ఏర్పాటుచేయడానికి ఎమ్మార్వీసీ పూనుకుంది. ఇదిలా వుండగా వెస్టర్న్ రైల్వేలో 21 ఎస్కలేటర్లు, అదేవిధంగా ఎనిమిది లిఫ్టుల ఏర్పాటుకు యోచించగా, సెంట్రల్ రైల్వే తొమ్మిది ఎస్కలేటర్లు, 18 లిఫ్టులను ఏర్పాటుచేసేందుకు ప్రతిపాదించింది. చాలా మంది ప్రయాణికులు హడావుడిగా రైలు పట్టాలు దాటుతూ తమ ప్రాణాలు పోగొట్టుకుంటుండడంతో వీటిని అరికట్టే ఉద్దేశంతోనే ముఖ్య రైల్వేస్టేషన్లలో లిఫ్టులు, ఎస్కలేటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మార్వీసీ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ రాకేష్ సక్సేనా తెలిపారు. రైల్వే ఆవరణలోని ఫుట్ ఓవర్ బ్రిడ్జి మెట్లు ఎక్కేందుకు ముఖ్యంగా వయోధికులు, వికలాంగులు చాలా ఇబ్బందులకు లోనవుతుంటారు. దాంతో వారిలో చాలామంది తమ ప్రయాణాన్ని కూడా వాయిదా వేసుకోవాల్సి వస్తోంది. కాగా ఈ ఎస్కలేటర్లను ప్రాధాన్యత ప్రతిపాదికన నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్గించడంలో ఖర్చుకు వెనుకాడబోమని ప్రయాణికుల సంఘటన సభ్యుడు అశోక్ దాతర్ తెలిపారు. కాగా ఎమ్మార్వీసీ ‘ట్రెస్ పాస్ కంట్రోల్’ ప్లాన్‌లో భాగంగా ఏప్రిల్ చివరివరకు 26 ఎస్కలేటర్లు, ఎనిమిది లిఫ్టులను నిర్మించనుంది. అంతేకాకుండా అంధేరీ, గోరేగావ్ స్టేషన్లలో ఒక్కోచోట ఆరేసి ఎస్కలేటర్లు, రెండు లిఫ్టులను నిర్మించనుందని సక్సేనా వివరించారు. సెంట్రల్ రైల్వే, వెస్టర్న్ రైల్వే సంయుక్తంగా ఈ ప్రాజెక్టు కోసం రైల్వే బోర్డును అదనంగా నిధులు అందించాల్సిందిగా కోరాయి. ఏప్రిల్ చివరి వరకు రద్దీ స్టేషన్లలో ఎస్కలేటర్లు ఏర్పాటు చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ‘ట్రెస్ పాస్ కంట్రోల్ ప్లాన్’ ప్రాజెక్టు కింద ఏడాది వరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తని ఎస్కలేటర్లను అమర్చనున్నట్లు సక్సేనా తెలిపారు. ప్రాజెక్టులో భాగంగా స్కైవాక్‌లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, 12 స్టేషన్లలో ర్యాంపులు కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వివరించారు. కాగా, వెస్టర్న్ రైల్వేలోని ముంబై సెంట్రల్లో 5 ఎస్కలేటర్లను ఏర్పాటుచేయగా దాదర్‌లో రెండు ఎస్కలేటర్లు, అదేవిధంగా రెండు లిఫ్టులు, బాంద్రాలో నాలుగు ఎస్కలేటర్లు, అంధేరీలో ఏడు ఎస్కలేటర్లు, రెండు లిఫ్టులు, బోరివలిలో ఎనిమిది ఎస్కలేటర్లు, నాలుగు లిఫ్టులు, భయందర్‌లో నాలుగు ఎస్కలేటర్లు, రెండు లిఫ్టులు ఏర్పాటుచేయనున్నామన్నారు. కాగా సెంట్రల్ రైల్వేలోని దాదర్‌లో మూడు ఎస్కలేటర్లు, ఆరు లిఫ్టులు, కుర్లాలో నాలుగు ఎస్కలేటర్లు, ఘాట్కోపర్లో రెండు ఎస్కలేటర్లు, రెండు లిఫ్టులు, విక్రోలీలో ఒక్క ఎస్కలేటర్, ఠాణేలో నాలుగు ఎస్కలేటర్లు, మూడు లిఫ్టులు, కల్యాణ్‌లో నాలుగు ఎస్కలేటర్లను మరో రెండేళ్లలో సిద్ధం చేయనున్నట్లు సక్సేనా తెలిపారు.