ఎస్కలేటర్ల మధ్య పడిపోయిన చిన్నారి
- ఎస్కలేటర్ల మధ్య పడిపోయిన చిన్నారి
- రైల్వే పోలీసుల అప్రమత్తతో సురక్షితంగా బయటపడ్డ వైనం
సికింద్రాబాద్: నడుస్తున్న రెండు ఎస్కలేటర్ల మధ్య పడిపోయిన ఓ చిన్నారి రైల్వేపోలీసుల అప్రమత్తతో సురక్షితంగా బయటపడింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో బుధవారం ఈ ఘటన జరిగింది. వివరాలు... ఉప్పుగూడకు చెందిన నాగేందర్, నాగమ్మ దంపతులు కుమార్తె మహాలక్ష్మిని మల్కాజిగిరికి చెందిన ఆంజనేయులుకు ఇచ్చి రెండేళ్ల క్రితం పెళ్లి జరిపించారు. వీరికి మహేశ్వరి అనే పది నెలల పాపం ఉంది. కొద్దిరోజుల క్రితం మహాలక్ష్మి కూతురు మహేశ్వరిని తీసుకొని మల్కాజిగిరి నుంచి తల్లిగారి ఇంటికి వెళ్లింది.
బుధవారం ఉప్పుగూడ నుంచి మల్కాజిగిరికి వెళ్లేందుకు బయలుదేరిన మహేశ్వరి వెంట ఆమె తల్లిదండ్రులు నాగేందర్, నాగమ్మ సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. 6వ నెంబర్ ప్లాట్‌ఫామ్‌పై దిగిన వీరంతా రైల్వేస్టేషన్ నుంచి బయటకు వచ్చేందుకు ఎస్కలేటర్ ఎక్కారు. తాత నాగేందర్ మనవరాలు మహేశ్వరిని చంకన ఎత్తుకుని, మరో చేతిలో బ్యాగును పట్టుకుని ఎస్కలేటర్ ఎక్కేందుకు యత్నించాడు.
అయితే, ఆయనకు ఎస్కలేటర్ గురించి అవగాహన లేకపోవడంతో కాలుజారింది. తనను తాను రక్షించుకునే యత్నంలో ఆయన తన చంకన ఉన్న మనవరాలు మహేశ్వరిని వదిలేశాడు. దీంతో ఆ చిన్నారి రెండు ఎస్కలేటర్ల మధ్య అడుగు వెడల్పు కలిగిన ఖాళీ స్థలంలోంచి కింద పడిపోయింది. గది గమనించిన తల్లి కేకలు వేయడంతో అక్కడే ఉన్న ఆపరేటర్ ఎస్కలేటర్లను నిలిపివేశాడు. రెండు ఎస్కలేటర్ల మధ్యలోంచి తొంగి చూసినప్పటికీ మొదట పాప కనిపించలేదు.
దీంతో పది మీటర్ల ఎత్తు నుంచి ఎస్కలేటర్ల మధ్య పడిన ఆ చిన్నారికి ఏమైందోనని అందరూ భయపడ్డారు. వెంటనే అక్కడికి చేరుకున్న రైల్వే పోలీసులు సాంకేతిక నిపుణుల సహాయంతో ప్లాట్‌ఫామ్‌ను ఆనుకుని ఉన్న ఎస్కలేటర్ విడిభాగాలను విప్పి చూడగా మహేశ్వరి సురక్షితంగా బయటపడింది. తలకు చిన్నపాటిగాయంతో చిన్నారి బయట పడటంతో కుటుంబసభ్యులతో పాటు అక్కడ ఉన్న ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.