పిల్లలతో ప్రేమ...
ఆకలి తీర్చేందుకు రెక్కల కష్టం పడే తల్లులు ఎందరో. ఆ కోవలో ఇక్కడ ఓ తల్లి రెక్కల కష్టం పడ్డా, బతుకు భారమై ఆత్మహత్యాయత్నం చేసినా, చివరకు తన బిడ్డల ఆకల్నితీర్చేందుకు తన శిరోజాల్ని అమ్ముకుంది.
సాక్షి, చెన్నై : ‘ అమ్మ అన్న పదం అద్భుతం. అమ్మకి అద్భుతం పిల్లల జీవితం. ఇక, బిడ్డ ఆకలి అమ్మకే తెలుసంటారు. ఆ ఆకలి తీర్చేందుకు పస్తులుండే తల్లులు ఎందరో. పేదరికంలో కొట్టుమిట్టాడే కుటుంబాల్లో తమ పిల్లల ఆకలి తీర్చేందుకు రెక్కల కష్టం పడే తల్లులు ఎందరో. ఆ కోవలో ఇక్కడ ఓ తల్లి రెక్కల కష్టం పడ్డా, బతకు భారమైన ఆత్మహత్యాయత్నం చేసినా, చివరకు తన బిడ్డల ఆకల్ని తీర్చేందుకు తన శిరోజాల్ని అమ్ముకుంది. ఈ సమాచారం అందుకున్న ముగ్గురు యువకులు ఆ తల్లికి చేయూత నిచ్చేందుకు సిద్ధమయ్యారు. ఫేస్ బుక్ ద్వారా రూ. లక్ష సేకరించి ఉండడం సేలంలో అమ్మాపేటలో వెలుగులోకి వచ్చింది.
సేలం జిల్లా అమ్మాపేట సమీపంలోని వీమనూరుకు చెందిన సెల్వం(37), ప్రేమ(31) దంపతులకు ముగ్గురు మగ పిల్లలు. వీరి వయస్సు నాలుగేళ్ల లోపే. గతంలో సెల్వం, ప్రేమ దంపతులు ఇటుకల తయారీ బట్టీల్లో పనిచేసే వారు. అయితే, ఐదేళ్ల క్రితం ఓ మిత్రుడు ఇచ్చిన సలహాతో సొంతంగా ఇటుక బట్టిని ఏర్పాటు చేసుకున్నారు. వ్యాపారం అంతంత మాత్రంగానే ఉండడంతో ఇటుక బట్టిని నడిపేందుకు అప్పులు చేయక తప్పలేదు. క్రమంగా అప్పుల భారం పెరగడంతో ఇటుకల బట్టీని వదులుకోవాల్సి వచ్చింది. కంతు వడ్డి వేధింపులు పెరగడంతో బతుకు భారమైంది. అప్పులు ఇచ్చిన వాళ్లు తనను చుట్టుముట్టడంతో ఏడాదిన్నర క్రితం సెల్వం ఆత్మాహుతి చేసుకున్నాడు. తనను పిల్లల్ని వదలి భర్త ఆత్మాహుతి చేసుకోవడంతో ప్రేమ తీవ్ర మనో వేదనలో మునిగింది. ఆప్తులు, బంధువులు మోసం చేసినా, తనను దరిచేర్చుకునే వాళ్లు ఎవరూ లేకున్నా, మనో ధైర్యంతో చేతిలో ఉన్న చంటి బిడ్డతో పాటు మరో ఇద్దరు పిల్లల పెంపు భారాన్ని తన భుజాన వేసుకుంది.
విసిగి వేసారి.....
వీమనూరు సమీపంలోని ఓ ఇసుక బట్టీలో చేరి రెక్కల కష్టంతో పిల్లల కడుపుల్ని నింపుతూ వచ్చిన ఈ తల్లికి కాలక్రమేనా బతుకు జీవనం భారంగా మారింది. ఇందుకు కారణం భర్త సెల్వంకు గతంలో అప్పులు ఇచ్చిన వారి నుంచి వేధింపులు పెరగడమే. తన పిల్లల కడుపు నింపేందుకు తాను పడుతున్న కష్టాన్ని వారికి చెప్పుకున్నా ప్రయోజనం శూన్యం. ఈ వేధింపులు క్రమంగా పెరగడంతో విసిగి వేసారిన ప్రేమ గత నెల ఆత్మహత్యాయత్నం చేసింది. పిల్లల మీదున్న మమకారం, వారి ఆకలి కేకలు ఆమెకు పునర్జన్మనిచ్చాయి. తాను క్రిమి సంహారక మందు సేవించినట్టుగా ఇరుగు పొరుగు వారికి చెప్పడంతో ఆమెను తీసుకెళ్లి ఆస్పత్రిలో పడేసి రక్షించారు. ఆ తదుపరి ఆమెకు కష్టాలు మరింతగా పెరిగాయి. ఆస్పత్రి నుంచి డిశ్చార్జయినా, పని అన్నది దొరక్క పోవడంతో ప్రేమ తీవ్ర మనో వేదనలో మునిగింది. తన పిల్లలు ఆకలితో అలమటిస్తుండడంతో తల్లడిల్లింది. చివరకు రెండు రోజుల క్రితం ఆమె ఓ సెలూన్ షాపు అతన్ని సంప్రదించి, తన శిరోజాల్ని అమ్ముకుంటానని, తనకు ఎంతో కొంత ఇస్తే పిల్లల కడుపు నింపుకుంటానంటూ వేడుకుంది. కనీస జాలి కూడా చూపించని ఆ షాపు యజమాని గుండు గీసి మరీ ఆమెకు ఉన్న పొడవాటి శిరోజాల్ని తీసుకున్నాడు. ఎంతో కొంత అతగాడు ముట్టచెప్పడంతో ఆనందంతో తన పిల్లల కడుపుల్ని ఆమె నింపింది. తన పిల్లల ఆకలి తీరడంతో ఆమె ఆనందానికి అవుధులు లేవు.
యువకుల చేయూత...
తన పిల్లల ఆకలి తీర్చేందుకు ఓ తల్లి శిరోజాల్ని అమ్ముకున్నట్టుగా తనకు లభించిన సమాచారంతో ఓ యువకుడు చలించిపోయాడు. అమ్మా పేటకు చెందిన బాల(32) తన ఇద్దరు మిత్రులతో కలిసి ప్రేమను సంప్రదించాడు. ఆమెకు ఇటుక బట్టిలో మళ్లీ పని కల్పించే ఏర్పాట్లు చేయడమే కాదు, పిల్లల ఆకలి తీర్చేందుకు తన వంతుగా చేయూత నిచ్చారు. శిరోజాల్ని ఎక్కడ అమ్మిందో ఆరా తీయడానికి ప్రయత్నిస్తే, తన పిల్లల ఆకలి తీర్చేందుకు సాయం చేసిన ఆ సెలూన్ గురించి తాను చెప్పబోనంటూ ఆ మాతృమూర్తి పేర్కొనడం విశేషం. అంతటితో ఆగకుండా ఆమెకు సాయం అందించే విధంగా బాలు అండ్ మిత్ర బృందం ముందుకు కదిలింది. ఫేస్ బుక్ ద్వారా రూ. లక్ష సేకరించి ప్రేమను వేధిస్తున్న వడ్డీ వ్యాపారుల్ని సంప్రదించేందుకు సిద్ధం అయ్యారు. ఆమెను ఇక వేదించవద్దు అని, ఇంతటితో సరి పెట్టుకోవాలని అప్పులు ఇచ్చిన వారిని అభ్యర్థించేందుకు నిర్ణయించామని బాల పేర్కొన్నాడు. అయితే, ఈ సమాచారం కాస్త పోలీసుల చెవిన పడడంతో ఆ కంతు వడ్డీ దారుల్ని గుర్తించి, భరతం పట్టేందుకు ప్రత్యేక బృందం రంగంలో దిగడం కొసమెరుపు.
Comments
Please login to add a commentAdd a comment