సినిమాలివ్వకుంటే సంగతి తేలుస్తాం! | multiplex theatres not agree to give share to film distributors in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

సినిమాలివ్వకుంటే సంగతి తేలుస్తాం!

Published Thu, Nov 3 2016 9:11 AM | Last Updated on Mon, Sep 17 2018 5:10 PM

సినిమాలివ్వకుంటే సంగతి తేలుస్తాం! - Sakshi

సినిమాలివ్వకుంటే సంగతి తేలుస్తాం!

∙మా వాళ్లని తెలిసి కూడా ఇలా చేస్తారా?
∙మీకు ఇతర వ్యాపారాలున్నాయని గుర్తుంచుకోండి..
∙డిస్ట్రిబ్యూటర్లకు కృష్ణా జిల్లా టీడీపీ కీలక నేత హెచ్చరిక
∙మల్టీప్లెక్స్‌లకు సినిమాల నిలిపివేతపై ఆగ్రహం
∙కలెక్షన్ల వాటాల వివాదంలో చినబాబు జోక్యం
∙రాజకీయ దౌర్జన్యంపై డిస్ట్రిబ్యూటర్ల ఆందోళన


సాక్షి, అమరావతి బ్యూరో: ‘మా వాళ్లని తెలిసి కూడా మల్టీప్లెక్స్‌లకు సినిమాలు ఇవ్వరా?.. కలెక్షన్లలో వాటాల వివాదం తరువాత చూసుకుందాం. ముందు సినిమాలు ఇవ్వండి. మీకు ఇతర వ్యాపారాలు ఉన్నాయని గుర్తుంచుకోండి. వాటి సంగతి తేలుస్తాం’ ఇదీ కృష్ణాజిల్లాకు చెందిన ఓ కీలక నేత డిస్ట్రిబ్యూటర్లకు చేసిన హెచ్చరిక.

కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో సినీ డిస్ట్రిబ్యూటర్లపై టీడీపీ పెద్దల వేధింపుల పరంపర కొనసాగుతోంది. మల్టీప్లెక్స్‌ల సినిమా కలెక్షన్లలో న్యాయమైన వాటా కోసం డిమాండు చేయడమే ఇందుకు కారణం. తెలంగాణలో మాదిరిగా కలెక్షన్లలో 55 శాతం వాటా ఇవ్వాలని డిస్ట్రిబ్యూటర్లు కోరుతున్నారు. కనీసం విశాఖపట్నంలో తాజాగా అంగీకరించిన విధంగా 53 శాతమైనా ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అయితే చినబాబు అండదండలు పుష్కలంగా ఉన్న మల్టీప్లెక్స్‌ల యాజమాన్యాలు డిస్ట్రిబ్యూటర్ల డిమాండును తిరస్కరిస్తున్నాయి. ఈ పరిణామాలతో మల్టీప్లెక్స్‌లలో సినిమాల ప్రదర్శనను డిస్ట్రిబ్యూటర్లు కొన్నిరోజులుగా నిలిపివేసిన విషయం చర్చనీయాంశంగా మారింది.

ఏం చేసైనా సరే డిస్ట్రిబ్యూటర్ల మెడలు వంచు..
మల్టీప్లెక్స్‌లలో తెలుగు సినిమాల ప్రదర్శనను డిస్ట్రిబ్యూటర్లు నిలిపివేయడం చినబాబు దృష్టికి వెళ్లింది. ఇప్పటికే నందమూరి కల్యాణ్‌రామ్‌ నటించిన ‘ఇజం’, కార్తీ నటించిన ‘కాషో్మరా’ తదితర సినిమాలు మల్టీప్లెక్స్‌లలో ప్రదర్శించడం లేదు. సుమంత్‌ నటించిన ‘నరుడా... డోనరుడా’తోపాటు కొన్ని సినిమాలు శుక్రవారం విడుదల కానున్నాయి. నాగచైతన్య నటించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’, అల్లరి నరేష్‌ నటించిన ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’ తదితర సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా యువత మల్టీప్లెక్స్‌ థియేటర్లలో చూసేందుకు ఇష్టపడే సినిమాలే కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ సినిమాలు ప్రదర్శించలేకపోతే తాము నష్టపోవాల్సి వస్తుందని మల్టీప్లెక్స్‌ యాజమాన్యాలు చినబాబు వద్ద ఆందోళన చేసినట్లు తెలిసింది. దీంతో ఆయన కృష్ణా జిల్లాలో కీలక ప్రజాప్రతినిధితో మాట్లాడారు. ఏంచేసైనా సరే డిస్ట్రిబ్యూటర్ల మెడలు వంచాలని హుకుం జారీ చేశారు.

ఈ నేపథ్యంలో ఆ కీలక ప్రజాప్రతినిధి రంగంలోకి దిగారు. ఫిలిం చాంబర్, డిస్ట్రిబ్యూషన్‌ అసోషియేషన్లకు చెందిన ముగ్గురు ప్రతినిధులను పిలిపించారు. ‘ఏం మల్టీప్లెక్స్‌లకు సినిమాలు ఇవ్వరా!.. కలెక్షన్లలో వాటాల పంపకం సంగతి తరువాత మాట్లాడదాం. ఈ శుక్రవారం విడుదలయ్యే సినిమాలు మల్టీప్లెక్స్‌లలో రిలీజ్‌ కావాల్సిందే. మీకు ఇతర వ్యాపారాలు ఉన్నాయన్న విషయం గుర్తుంచుకోండి’అని హెచ్చరించారు. చాంబర్‌ ప్రతినిధులు తమ వాదన వినిపించేందుకు కూడా అవకాశం ఇవ్వలేదు.

ప్రభుత్వ పెద్దల పెత్తనం ఏమిటి?
సినిమా రంగానికి సంబంధించిన వివాదంలో అధికార పార్టీ పెద్దల జోక్యంపై డిస్ట్రిబ్యూటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించుకునేందుకు ఏపీ ఫిలిం చాంబర్, దక్షిణ భారత ఫిలిం చాంబర్, ఫిలిం ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌ఎఫ్‌ఐ) తదితర వేదికలు ఉన్నాయని చెబుతున్నారు. అందుకు విరుద్ధంగా ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకుని డిస్ట్రిబ్యూషన్‌ రంగాన్ని నియంత్రించాలని భావించడం సమంజసం కాదని స్పష్టం చేస్తున్నారు. సమస్య పరిష్కారానికి సామరస్యంగా ప్రయత్నించకుండా దౌర్జన్యపూరితంగా వ్యవహరించడం సినీ పరిశ్రమకు హాని చేస్తుందని డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement