ముంబై: నగరంతో పాటు రాష్ట్రంలోని ప్రజలకు భద్రత విషయంలో అపొహలు వద్దని రాష్ట్ర హోంశాఖ మంత్రి ఆర్.ఆర్.పాటిల్ అన్నారు. 26/11 లాంటి ఉగ్రవాద దాడులకు సమర్థంగా ఎదుర్కొనేందుకు పోలీసు శాఖ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. నగరంలో ముష్కరుల దాడి జరిగి మంగళవారానికి ఐదేళ్లు పూర్తి కానుండటంతో పాటిల్ సోమవారం మీడియాతో మాట్లాడారు.
అసాంఘిక శక్తుల అరాచకాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసు శాఖను ఆధునీకరించామన్నారు. భారీ ఉగ్రవాద దాడులను ఎదుర్కొనేందుకు వివిధ ఫోర్స్‌లను ఏర్పాటుచేశామని వివరించారు. నగరవాసులు ముమ్మాటికీ సురక్షితంగానే ఉన్నారని, అందుకు తాను హామీని ఇస్తున్నానని తెలిపారు. 26/11 దాడులు జరిగిన సమయంలో హోంశాఖ మంత్రిగా ఉన్న పాటిల్ వివిధ వర్గాల నుంచి విమర్శలు రావడంతో ఆ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తు రాజీనామా చేశారు. 2009 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మళ్లీ గెలిచి హోంశాఖ మంత్రిగా విధులు చేపట్టారు. అప్పటి నుంచి భద్రత విషయంలో కేంద్రంతో కలిసి అన్ని చర్యలు తీసుకోవడంపైనే ప్రధాన దృష్టి కేంద్రీకరించానని పాటిల్ తెలిపారు. భవిష్యత్‌లో ముష్కరుల దాడులు జరగకుండా ఉండేందుకు సంయుక్తంగా పనిచేస్తున్నామని చెప్పారు. ఆరేబియా సముద్ర మార్గంపై నిఘా వేసి ఉంచామని వివరించారు. 26/11 దాడుల్లో పట్టుబడ్డ ఏకైక ఉగ్రవాది కసబ్‌ను ఉరి తీసి ఇతరుకు కూడా హెచ్చరికలు పంపామన్నారు. ఎవరైనా అసాంఘిక దుశ్చర్యలకు పాల్పడితే ఇలాంటి కఠిన చర్యలు ఉంటాయన్న సంకేతాలు వెళ్లేలా చేశామని వివరించారు.
ఎన్‌ఎస్‌జీ సేవలు భేష్
26/11 ఘటన సమయంలో ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు రంగంలోకి దిగిన జాతీయ భద్రత దళం(ఎన్‌ఎస్‌జీ) సేవలపై పాటిల్ ప్రశంసలు కురిపించారు. ముష్కరుల దాడుల జరిగాయన్న సంఘటన స్థలికి కేవలం 15 నిమిషాల్లోనే చేరుకొని, తదుపరి నష్టం జరగకుండా చొరవ తీసుకుంటుందన్నారు. గత ఐదేళ్లలో భద్రత కోసం సర్కార్ అన్ని చర్యలు తీసుకుంటుందని వివరించారు. వివిధ బహిరంగ ప్రాంతాల్లో, ట్రాఫిక్ జంక్షన్‌లు, రైల్వే స్టేషన్, భారీ ప్రభుత్వ, పైవేట్ కార్యాలయాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు అమర్చామని వివరించారు.
ముమ్మాటికీ సురక్షితమే: ఆర్.ఆర్.పాటిల్
Published Mon, Nov 25 2013 11:34 PM | Last Updated on Sat, Sep 2 2017 12:58 AM
Advertisement
Advertisement