R.R. Patil
-
అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం
ముంబై: పట్టణ ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాల నిరోధానికి ప్రత్యేక చట్టాన్ని తయారు చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. చట్టం రూపకల్పన కోసం బీఎంసీ కమిషనర్ నేతృత్వంలో 14 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసినట్టు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ శాసనసభకు గురువారం తెలిపారు. ఉల్హాస్నగర్ భవనాల క్రమబద్ధీకరణ విధానాన్ని ఇతర నగరాలకూ వర్తింపజేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఒక్కో ప్రాంతానికి ఒక్కో తరహా సమస్య ఉంటుంది కాబట్టి ప్రత్యేక విధానాలు అవసరమవుతాయన్నారు. పింప్రి-చించ్వాడ్లో అక్రమ నిర్మాణాలపై చర్చలో పాల్గొంటూ ఆయన పైవిషయం తెలిపారు. ఉల్హాస్‌నగర్‌లో 6,623 అక్రమ నిర్మాణాలు ఉన్నట్టు గుర్తించినా, 100 నిర్మాణాలను కూడా క్రమబద్ధీకరించలేదు. అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు నిర్మాణ పటిష్టత అత్యంత ముఖ్యమని సీఎం చెప్పారు. పింప్రి-చించ్వాడ్లోని అక్రమ నిర్మాణాల గణాంకాల విశ్లేషణను ఈ నెలాఖరుకు సమర్పించాల్సిందిగా ఆదేశించామని తెలిపారు. వేసవిలో పోలీసు ఉద్యోగాల భర్తీ వద్దు పోలీసుల ఉద్యోగాల కోసం ముంబై, నాసిక్‌లో నిర్వహించిన పరీక్షల సందర్భంగా ఇద్దరు యువకులు మరణించడంతో.. ఇక నుంచి వేసవిలో ఇలాంటి ఉద్యోగాలను భర్తీ చేయవద్దని పలువురు సభ్యులు సభలో గురువారం సూచించారు. నాసిక్‌లో మరణించిన అంబాదాస్ కుటుంబానికి రూ.ఐదు లక్షల నష్టపరిహారం ఇవ్వాలని మాలేగావ్ ఎమ్మెల్యే దాదా భూసే ప్రభుత్వాన్ని కోరారు. పేద కుటుంబానికి చెందిన ఈ యువకుడు కుటుంబాన్ని పోషించేవాడని తెలిపారు. విక్రోలీ వద్ద ఉన్న భర్తీ కేంద్రంలో తాగునీటి వంటి కనీస సదుపాయాలు కూడా లేవ న్నారు. ఐదు కిలోమీటర్ల పరుగుపందెంలో పాల్గొన్నప్పుడు వడదెబ్బ తగిలి అంబాదాస్ మరణించాడని అన్నారు. వేసవిలో ఎండలు అధికం కాబట్టిఅక్టోబర్-డిసెంబర్ మధ్య కాలంలో ఉద్యోగాలను భర్తీ చేయాలని ఎమ్మెల్యే బాలానంద గావ్కర్ అన్నారు. ఆర్.ఆర్.పాటిల్‌కు క్లీన్చిట్ అత్యాచారాల నిరోధంపై హోంమంత్రి ఆర్.ఆర్.పాటిల్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని స్పీకర్ దిలీప్ వల్సే పాటిల్ స్పష్టం చేశారు. ప్రతి ఇంట్లో ఒక పోలీసు ఉన్నా అత్యాచారాలను నిరోధించడం సాధ్యం కాదని మంత్రి సభలో బుధవారం అన్నట్టు వార్తలు వచ్చాయి. మీడియా వచ్చిన కథనాలు, అసెంబ్లీ రికార్డులను పరిశీలించానని, పాటిల్ మాటల్లో తప్పేమీ లేదని స్పీకర్ అన్నారు. మంత్రి అలాంటి మాటేదీ అనలేదని వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా పాటిల్ మాట్లాడుతూ తనను కించపర్చాలనే దురుద్దేశంతోనే ఇలాంటి ప్రచారం జరిగిందని ఆరోపించారు. ప్రతి ఇంటికీ ఒక పోలీసును నియమించడం సాధ్యం కాదని మాత్రమే తాను అన్నానని స్పష్టం చేశారు. ఇక నుంచి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి స్పీకర్ స్పందిస్తూ మీడియా సభా కార్యకలాపాలను ప్రసారం చేయడానికి నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందా అనే విషయాన్ని పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. -
ముమ్మాటికీ సురక్షితమే: ఆర్.ఆర్.పాటిల్
ముంబై: నగరంతో పాటు రాష్ట్రంలోని ప్రజలకు భద్రత విషయంలో అపొహలు వద్దని రాష్ట్ర హోంశాఖ మంత్రి ఆర్.ఆర్.పాటిల్ అన్నారు. 26/11 లాంటి ఉగ్రవాద దాడులకు సమర్థంగా ఎదుర్కొనేందుకు పోలీసు శాఖ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. నగరంలో ముష్కరుల దాడి జరిగి మంగళవారానికి ఐదేళ్లు పూర్తి కానుండటంతో పాటిల్ సోమవారం మీడియాతో మాట్లాడారు. అసాంఘిక శక్తుల అరాచకాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసు శాఖను ఆధునీకరించామన్నారు. భారీ ఉగ్రవాద దాడులను ఎదుర్కొనేందుకు వివిధ ఫోర్స్‌లను ఏర్పాటుచేశామని వివరించారు. నగరవాసులు ముమ్మాటికీ సురక్షితంగానే ఉన్నారని, అందుకు తాను హామీని ఇస్తున్నానని తెలిపారు. 26/11 దాడులు జరిగిన సమయంలో హోంశాఖ మంత్రిగా ఉన్న పాటిల్ వివిధ వర్గాల నుంచి విమర్శలు రావడంతో ఆ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తు రాజీనామా చేశారు. 2009 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మళ్లీ గెలిచి హోంశాఖ మంత్రిగా విధులు చేపట్టారు. అప్పటి నుంచి భద్రత విషయంలో కేంద్రంతో కలిసి అన్ని చర్యలు తీసుకోవడంపైనే ప్రధాన దృష్టి కేంద్రీకరించానని పాటిల్ తెలిపారు. భవిష్యత్‌లో ముష్కరుల దాడులు జరగకుండా ఉండేందుకు సంయుక్తంగా పనిచేస్తున్నామని చెప్పారు. ఆరేబియా సముద్ర మార్గంపై నిఘా వేసి ఉంచామని వివరించారు. 26/11 దాడుల్లో పట్టుబడ్డ ఏకైక ఉగ్రవాది కసబ్‌ను ఉరి తీసి ఇతరుకు కూడా హెచ్చరికలు పంపామన్నారు. ఎవరైనా అసాంఘిక దుశ్చర్యలకు పాల్పడితే ఇలాంటి కఠిన చర్యలు ఉంటాయన్న సంకేతాలు వెళ్లేలా చేశామని వివరించారు. ఎన్ఎస్జీ సేవలు భేష్ 26/11 ఘటన సమయంలో ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు రంగంలోకి దిగిన జాతీయ భద్రత దళం(ఎన్ఎస్జీ) సేవలపై పాటిల్ ప్రశంసలు కురిపించారు. ముష్కరుల దాడుల జరిగాయన్న సంఘటన స్థలికి కేవలం 15 నిమిషాల్లోనే చేరుకొని, తదుపరి నష్టం జరగకుండా చొరవ తీసుకుంటుందన్నారు. గత ఐదేళ్లలో భద్రత కోసం సర్కార్ అన్ని చర్యలు తీసుకుంటుందని వివరించారు. వివిధ బహిరంగ ప్రాంతాల్లో, ట్రాఫిక్ జంక్షన్లు, రైల్వే స్టేషన్, భారీ ప్రభుత్వ, పైవేట్ కార్యాలయాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు అమర్చామని వివరించారు. -
శాంతి భద్రతలను కాపాడటంలో సర్కార్ విఫలం
ముంబై: పుణేలో ప్రముఖ సామాజిక కార్యకర్త నరేంద్ర ధబోల్కర్ హత్య...ఆ తర్వాత ముంబైలో మహిళా ఫొటో జర్నలిస్ట్‌పై సామూహిక అత్యాచారం...వెరసి రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని ప్రజల్లో నిరసన వ్యక్తమవుతోంది. వీరి అభిప్రాయాలను ప్రతిబింబిస్తూ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, హోం మంత్రి ఆర్.ఆర్.పాటిల్‌లపై ముర్దా (మృతులు) అనే శీర్షికతో ఓ స్థానిక చానెల్ వార్తను ప్రసారం చేసింది. శాంతి భద్రతలను కాపాడటంలో సర్కార్ విఫలమైందన్న సామాన్యుల గొంతుకను వినిపించింది. అయితే రాష్ట్రంలో ప్రజల మానప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని సామాన్యుల నుంచి మేధావుల వరకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆరోపణల దాడుల నుంచి బయటపడేందు కోసం స్వయంగా హోంశాఖ మంత్రి ఆర్.ఆర్.పాటిల్ సామూహిక అత్యాచారం కేసు నమోదైన ఎన్.ఎం.జోషి మార్గ్ పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. నిందితుడిని విచారిస్తున్న సమయంలో అక్కడే ఉన్నారు. ప్రముఖ సంఘ సంస్కర్త దభోల్కర్ అంత్యక్రియలకు తన మంత్రివర్గ సహచరులతో కలిసి ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ హాజరయ్యారు. అలాగే గ్యాంగ్ రేప్ బాధితురాలు మహిళా ఫొటో జర్నలిస్ట్ చికిత్సపొందుతున్న ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. వీటన్నింటిని పరికిస్తే ప్రజల నుంచి ఏమేర ఒత్తిడి ఉందో, దాన్నుంచి తప్పించుకునేందుకు ముఖ్య నేతలు బయటపడేందుకు అపసోపాలు పడుతున్నారని అర్ధమవుతోంది. ప్రతిపక్షం నుంచి విమర్శలు ప్రజల నుంచి ఇప్పటికే తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న అధికార ప్రజాస్వామ్య కూటమి (డీఎఫ్) నాయకులకు ప్రతిపక్షాల బెడద తప్పడం లేదు. ఇటీవల జరిగిన ఈ రెండు నేరాలు రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని తేటతెల్లం చేస్తున్నాయని బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవిస్ ఆరోపించారు. శాంతి భద్రతలను కాపాడటంలో విఫలమైన హోంశాఖ మంత్రి ఆర్ఆర్ పాటిల్ తన పదవీకి రాజీనామా చేయాలని శివసేన డిమాండ్ చేసింది. అయితే పాటిల్ అసమర్థత వచ్చే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ ఫలితాలపై ప్రభావం చూపవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా ముందుకు వెళ్లాలని రెండేళ్ల క్రితం భావించిన ఎన్సీపీ ఇప్పుడు అడుగు వెనక్కి వేసినట్టుగా కనిపిస్తుంది. పాత సీట్ల పంపకాల ఫార్ములా ఆధారంగానే కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకుంది. ఈసారి కాంగ్రెస్ నుంచి అత్యధిక స్థానాలను ఎన్సీపీ కోరకపోవచ్చని ముంబై యూనివర్సిటీ అసొసియేట్ ప్రొఫెసర్, రాజకీయ విశ్లేషకుడు అరుణ పెండ్సే తెలిపారు. ఎన్సీపీ పార్టీలో అగ్రనాయకులుగా ఉన్న అజిత్ పవార్, ఆర్ఆర్ పాటిల్ అనేక విషయాల మీద ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారన్నారు. శాంతి భద్రతల విషయంలో ఆర్.ఆర్.పాటిల్, నీటి పారుదల కుంభకోణంతో పాటు కరువు నేపథ్యంలో ప్రజాగ్రహానికి గురయ్యే వ్యాఖ్యలు చేసిన అజిత్ పవార్ వల్ల ఈసారి ఎన్సీపీ ఆశించిన రీతిలో ప్రదర్శన ఇవ్వకపోవచ్చని అభిప్రాయపడ్డారు. అయితే వీరి ప్రభావం మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీపై ఎలాంటి ప్రభావం చూపదన్నారు. ‘పాటిల్, పవార్లు ఎన్సీపీకి చెందిన నాయకులనీ ప్రజలందరికీ తెలుసు. వారి శాఖ పనుల్లో వైఫల్యానికి వారే బాధ్యత వహించాలి. ఇది కాంగ్రెస్‌పై ప్రభావం చూపదు. డిసెంబర్లో ఆహార భద్రత పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రారంభిస్తే ఓటర్లలో కాస్త అనుకూల పవనాలు వీచే అవకాశముంద’ని ఆయన తెలిపారు. అన్ని వివాదాలకు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ దూరంగా ఉంటారనే క్లీన్ ఇమేజ్ను కలిగి ఉన్నారని చెప్పారు. అయితే తుదగా మాత్రం ప్రభుత్వ వ్యతిరేకత, ధరల పెరుగుదల, అభివృద్ధి లేమి తదితర విషయాలు కాంగ్రెస్ పార్టీపై ప్రభావం చూపే అవకాశాన్ని ఒప్పుకోవాల్సి ఉంటుందన్నారు.