ముంబై: పుణేలో ప్రముఖ సామాజిక కార్యకర్త నరేంద్ర ధబోల్కర్ హత్య...ఆ తర్వాత ముంబైలో మహిళా ఫొటో జర్నలిస్ట్‌పై సామూహిక అత్యాచారం...వెరసి రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని ప్రజల్లో నిరసన వ్యక్తమవుతోంది. వీరి అభిప్రాయాలను ప్రతిబింబిస్తూ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, హోం మంత్రి ఆర్.ఆర్.పాటిల్‌లపై ముర్దా (మృతులు) అనే శీర్షికతో ఓ స్థానిక చానెల్ వార్తను ప్రసారం చేసింది. శాంతి భద్రతలను కాపాడటంలో సర్కార్ విఫలమైందన్న సామాన్యుల గొంతుకను వినిపించింది. అయితే రాష్ట్రంలో ప్రజల మానప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని సామాన్యుల నుంచి మేధావుల వరకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఆరోపణల దాడుల నుంచి బయటపడేందు కోసం స్వయంగా హోంశాఖ మంత్రి ఆర్.ఆర్.పాటిల్ సామూహిక అత్యాచారం కేసు నమోదైన ఎన్.ఎం.జోషి మార్గ్ పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. నిందితుడిని విచారిస్తున్న సమయంలో అక్కడే ఉన్నారు. ప్రముఖ సంఘ సంస్కర్త దభోల్కర్ అంత్యక్రియలకు తన మంత్రివర్గ సహచరులతో కలిసి ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ హాజరయ్యారు. అలాగే గ్యాంగ్ రేప్ బాధితురాలు మహిళా ఫొటో జర్నలిస్ట్ చికిత్సపొందుతున్న ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. వీటన్నింటిని పరికిస్తే ప్రజల నుంచి ఏమేర ఒత్తిడి ఉందో, దాన్నుంచి తప్పించుకునేందుకు ముఖ్య నేతలు బయటపడేందుకు అపసోపాలు పడుతున్నారని అర్ధమవుతోంది.
ప్రతిపక్షం నుంచి విమర్శలు
ప్రజల నుంచి ఇప్పటికే తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న అధికార ప్రజాస్వామ్య కూటమి (డీఎఫ్) నాయకులకు ప్రతిపక్షాల బెడద తప్పడం లేదు. ఇటీవల జరిగిన ఈ రెండు నేరాలు రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని తేటతెల్లం చేస్తున్నాయని బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవిస్ ఆరోపించారు. శాంతి భద్రతలను కాపాడటంలో విఫలమైన హోంశాఖ మంత్రి ఆర్‌ఆర్ పాటిల్ తన పదవీకి రాజీనామా చేయాలని శివసేన డిమాండ్ చేసింది. అయితే పాటిల్ అసమర్థత వచ్చే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ ఫలితాలపై ప్రభావం చూపవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా ముందుకు వెళ్లాలని రెండేళ్ల క్రితం భావించిన ఎన్సీపీ ఇప్పుడు అడుగు వెనక్కి వేసినట్టుగా కనిపిస్తుంది. పాత సీట్ల పంపకాల ఫార్ములా ఆధారంగానే కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకుంది. ఈసారి కాంగ్రెస్ నుంచి అత్యధిక స్థానాలను ఎన్సీపీ కోరకపోవచ్చని ముంబై యూనివర్సిటీ అసొసియేట్ ప్రొఫెసర్, రాజకీయ విశ్లేషకుడు అరుణ పెండ్సే తెలిపారు. ఎన్సీపీ పార్టీలో అగ్రనాయకులుగా ఉన్న అజిత్ పవార్, ఆర్‌ఆర్ పాటిల్ అనేక విషయాల మీద ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారన్నారు. శాంతి భద్రతల విషయంలో ఆర్.ఆర్.పాటిల్, నీటి పారుదల కుంభకోణంతో పాటు కరువు నేపథ్యంలో ప్రజాగ్రహానికి గురయ్యే వ్యాఖ్యలు చేసిన అజిత్ పవార్ వల్ల ఈసారి ఎన్సీపీ ఆశించిన రీతిలో ప్రదర్శన ఇవ్వకపోవచ్చని అభిప్రాయపడ్డారు. అయితే వీరి ప్రభావం మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీపై ఎలాంటి ప్రభావం చూపదన్నారు. ‘పాటిల్, పవార్‌లు ఎన్సీపీకి చెందిన నాయకులనీ ప్రజలందరికీ తెలుసు. వారి శాఖ పనుల్లో వైఫల్యానికి వారే బాధ్యత వహించాలి. ఇది కాంగ్రెస్‌పై ప్రభావం చూపదు.
డిసెంబర్‌లో ఆహార భద్రత పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రారంభిస్తే ఓటర్లలో కాస్త అనుకూల పవనాలు వీచే అవకాశముంద’ని ఆయన తెలిపారు. అన్ని వివాదాలకు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ దూరంగా ఉంటారనే క్లీన్ ఇమేజ్‌ను కలిగి ఉన్నారని చెప్పారు. అయితే తుదగా మాత్రం ప్రభుత్వ వ్యతిరేకత, ధరల పెరుగుదల, అభివృద్ధి లేమి తదితర విషయాలు కాంగ్రెస్ పార్టీపై ప్రభావం చూపే అవకాశాన్ని ఒప్పుకోవాల్సి ఉంటుందన్నారు.
శాంతి భద్రతలను కాపాడటంలో సర్కార్ విఫలం
Published Wed, Aug 28 2013 12:36 AM | Last Updated on Wed, Aug 15 2018 5:57 PM
Advertisement
Advertisement