ముఖ్యమంత్రికి ‘పక్షవాతం’
సాక్షి, ముంబై: ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ మధ్య విబేదాలు ఇప్పటికీ సమసిపోలేదని మరోసారి వెల్లడయింది. నాగపూర్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి తీరుపై తీవ్రంగా పవార్ మండిపడ్డారు. పృథ్వీరాజ్ చవాన్‌కు పక్షవాతం (నిర్లక్ష్య ధోరణి) అధికమయిందని విమర్శించారు. ఫైళ్లపై తుదినిర్ణయం తీసుకోవడానికి ఆయన వెనుకాడుతున్నారని పేర్కొంటూ పైవ్యాఖ్యలు చేశారు. ‘ఫైళ్లపై సంతకాల చేసే సమయంలోనే ఆయనకు ఏవో సమస్యలు వసాయి. దీంతో అనేక ఫైళ్లు టేబుళ్లపైనే పడి ఉంటున్నాయి’ అని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్ ముఖ్యమంత్రి గతంలోనే విమర్శించిన సంగతి తెలిసిందే. ఇదే విషయమై అజిత్ పవార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రికి సోకిన పక్షవాతం తగ్గక పోగా, ఇంకా పెరిగినట్టు ఉందంటూ ఎద్దేవా చేశారు.
48 స్థానాల్లో కాంగ్రెస్‌ను పోటీ చేయమనండి...
మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎంపీసీసీ) అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే కాంగ్రెస్, ఎన్సీపీ పోటీ చేయాల్సిన సీట్ల సంఖ్యపై పలు ప్రతిపాదనలు తేవడంపైనా పవార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 29, ఎన్సీపీ 19 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తే బాగుంటుందంటూ ఆయన గతంలోనే ప్రతిపాదించం తెలిసిందే. ఈ ఫార్ములాపైనా అజిత్‌పవార్ తనదైన శైలిలో నిరసన వ్యక్తం చేశారు. ‘29 ఎందుకు..ఏకంగా 48 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌ను పోటీ చేయమనండి. మా సంగతి మేం చూసుకుంటాం’ అన్నారు.
పార్టీ ఆదేశిస్తే లోక్‌సభకు పోటీ చేస్తా...
ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్ ఆదేశిస్తే లోక్‌సభకు పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నట్టు అజిత్ పవార్ పేర్కొన్నారు. బారామతి, మాఢా అని కాకుండా రాష్ట్రంలోని ఏ స్థానం నుంచి పోటీ చేయాలని ఆదేశించినా అభ్యంతరం లేదన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.