సరిహద్దు వివాదం..
ముంబై: మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు వివాదంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ శివసేన మండిపడింది. మహారాష్ట్ర రాజకీయ పార్టీల వల్లే ఈ అంశం తీవ్రరూపం దాల్చుతోందని కన్నడ సీఎం విమర్శించారు. రామయ్య మాటలకు ధీటుగా బదులు చెప్పాలని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌ను మంగళవారం డిమాండ్ చేసింది. బెల్గాం వివాదంపై సిద్ధరామయ్య మాట్లాడుతూ.. సరిహద్దు గురించి మహారాష్ట్రతో ఎలాంటి వివాదమూ లేదని, మహాజన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం ఈ సమస్యను పరిష్కరించుకుంటామని అన్నారు. దీనిపై సేన అభ్యంతరం వ్యక్తం చేసింది.
సరిహద్దు వివాదానికి మహాజన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయడం ఒక్కటే మార్గమని రామయ్య స్పష్టీకరించారు. ముఖ్యమంత్రి లేదా కనీసం ఉప-ముఖ్యమంత్రి అజిత్ పవార్ అయినా ఈ విషయంలో రామయ్యకు ధీటైన బదులు చెప్పాలని సేన అధికార పత్రిక సామ్నా సంపాదకీయం అభిప్రాయపడింది. బెల్గాం వివాద పరిష్కారానికి మహాజన్ కమిటీ ఒక్కటే పరిష్కారం చూపలేదని వ్యాఖ్యానించింది. స్వార్థప్రయోజనాల కోసం మహారాష్ట్ర నాయకులు బెల్గాం వివాదం సద్దుమణగకుండా చూస్తున్నారని రామయ్య విమర్శించారు.
కర్ణాటక సరిహద్దు పట్టణం బెల్గాంలో ఇబ్బందిపడుతున్న 20 లక్షల మంది మరాఠీల గురించి మాట్లాడడం తప్పెలా అవుతుందని సామ్నా నిలదీసింది. కర్ణాటక అధికారులు మరాఠీలపై అనుచితంగా వ్యవహరిస్తున్నారు కాబట్టే ఈ సమస్య కొనసాగుతూనే ఉందని ఆరోపించింది. ‘ఎంతో సంయమనంతో వ్యవహరిస్తున్న మరాఠీ ప్రజలకు రామయ్య కృతజ్ఞతలు చెప్పాలి’ అని పేర్కొంది. బెల్గాం యెల్లూర్ గ్రామంలో మహారాష్ట్రకు అనుకూలంగా ఒక ఉన్న సైన్‌బోర్డు తొలగింపుపై గత నెల హింస చెలరేగింది. దీనిపై చవాన్ రామయ్యతో ఫోన్లో మాట్లాడారు. ఈ ఘటనను సేన తీవ్రంగా ఖండించింది. ఇది కన్నడిగుల ఉగ్రవాదమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
భగవత్ వ్యాఖ్యలకు ఉద్ధవ్ సమర్థన
భారత్ హిందూదేశమన్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) వ్యాఖ్యలను శివసేన అధిపతి ఉద్ధవ్‌ఠాక్రే సమర్థించారు. ఆయన మాటల్లో తప్పేమీ లేదని స్పష్టీకరించారు. బాల్‌ఠాక్రే కూడా ఎన్నోసార్లు ఈ విషయం చెప్పారని, దీనిపై తమ వైఖరి మారబోదని విలేకరుల ప్రశ్నకు సమాధానంగా అన్నారు. ప్రస్తుతం భారత్‌లో నివసిస్తున్న వారంతా హిందూ సంస్కృతి నుంచి వచ్చినవారేనని కూడా భగవత్ ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ అన్నారు.
ప్రణాళికాసంఘం రద్దు నిర్ణయాన్ని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ విమర్శించడానికి కూడా ఉద్ధవ్ తప్పుబట్టారు. ఆ సంఘంతో ఒరిగేది ఏమీ లేదని స్పష్టం చేశారు. ‘సంఘం రద్దుపై చవాన్ అసంతృప్తితో ఉన్నట్టు కనిపిస్తోంది. ఇన్నేళ్లలో ప్రణాళికాసంఘం ప్రజలకు చేసిన మేలేంటో ఆయన తెలియజేయాలి’ అని అన్నారు. కాశ్మీరీ వేర్పాటువాద నేతతో ఢిల్లీలోని పాక్ హైకమిషన్ కార్యాలయం చర్చలు జరపడంపై మాట్లాడుతూ ఇక నుంచైనా ప్రభుత్వం పాకిస్థాన్‌తో కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. పాక్ హైకమిషన్ చర్యకు నిరసనగా ప్రస్తుతం జరుగుతున్న ఇరు దేశాల విదేశీ కార్యదర్శుల సమావేశాలను రద్దు చేస్తున్నట్టు భారత ప్రభుత్వం ప్రకటించడం తెలిసిందే.