సాక్షి ముంబైః కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు సంయుక్తంగా నిర్వహించే సమావేశంలోనే సీట్ల పంపకాలపై నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ స్పష్టం చేశారు. కొందరు నాయకులు అసెంబ్లీ సీట్ల పంపకాల విషయంపై ప్రకటనలు చేస్తూ ఆయా నియోజకవర్గాలు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు పరోక్షంగా ఉప-ముఖ్యమంత్రి అజిత్ పవార్‌ను ఉద్దేశించి చేసినవని భావించవచ్చు. గత కొన్ని రోజులుగా సీట్ల పంపకంపై ఎన్సీపీ సీనియర్ నాయకుడు అజిత్ పవార్ దూకుడుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తమకు అధికంగా సీట్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
ఈ ప్రతిపాదనకు కాంగ్రెస్ ఎంతమాత్రమూ సుముఖంగా లేదు. ఎన్సీపీకి 144 సీట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ ఒప్పుకోకుంటే, రాష్ట్రంలోని మొత్తం 288 నియోజకవర్గాల్లో ఎన్సీపీ పోటీ చేస్తుందని అజిత్ పవార్ హెచ్చరించడం సంచలనం సృష్టించింది. దీనిపై స్పందించిన పృథ్వీరాజ్ చవాన్ పైవ్యాఖ్యలు చేశారు. ‘మా మిత్రపక్షం ఎన్సీపీతో కలిసే చాలా ఎన్నికల్లో పోటీ చేశాం. ప్రతిసారీ ఎన్నికలకు ముందు మేము ఏ నిర్ణయం తీసుకున్నా ఉమ్మడిగానే తీసుకున్నాం. ఈసారి కూడా సీట్ల పంపకాలపై సంయుక్త సమావేశం ఉంటుంది.
కొందరు నాయకులు ఇప్పుడే సీట్ల పంపకాలు జరిగినట్టు ప్రకటిస్తూ, ఆ నియోజకవర్గాలను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అలా చేయడం సరైందికాదని మిత్రపక్షానికి సూచిస్తున్నాను. సీట్ల పంపకాలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు’ అని చవాన్ వివరణ ఇచ్చారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎజెండా గురించి విలేకరులతో మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా తాము చేసిన అభివృద్ధి వల్ల మహారాష్ట్ర దేశంలోనే అగ్రగామిగా ఉందన్నారు. అభివృద్ధిలో గుజరాత్ కంటే మహారాష్ట్ర ముందున్నదని, అందరికీ మేలు జరగాలని తాము కోరుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.
ముంబైలో రూ.10 వేల కోట్లకుపైగా వెచ్చించి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేశామని, మరో రూ.15 వేల కోట్ల విలువైన పనులు కొనసాగుతున్నాయని వివరించారు. దీంతోపాటు రూ. 36 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు పరిశీలనలో ఉన్నాయని చవాన్ చెప్పారు. ఇవి పూర్తయితే ముంబై రూపురేఖలు మార తాయని పృథ్వీరాజ్ చవాన్ అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీతో పొత్తు పెట్టుకోవడానికి తాము సిద్ధమని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) బుధవారం ప్రకటించింది.
చర్చల తరువాతే నిర్ణయం
Published Wed, Jul 9 2014 11:34 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement