మూఢనమ్మకాల వ్యతిరేక బిలును చట్టరూపంలోకి తేవాల్సిన అవసరముందని దివంగత హేతువాది నరేంద్ర దభోల్కర్ కుమారుడు హమీద్ నొక్కి చెప్పారు.
నాసిక్: మూఢనమ్మకాల వ్యతిరేక బిలును చట్టరూపంలోకి తేవాల్సిన అవసరముందని దివంగత హేతువాది నరేంద్ర దభోల్కర్ కుమారుడు హమీద్ నొక్కి చెప్పారు. నాగపూర్‌లో జరిగే శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లుకు ఆమోదం పొందేలా సర్కార్ చూడాలని ఆయన మంగళవారం మీడియాకు తెలిపారు. తన తండ్రి నరేం ద్ర చనిపోయిన తర్వాత మూఢనమ్మకాలు పాటించడం, చేతబడిపై నిషేధాన్ని విధిస్తూ రాష్ట్ర సర్కార్ ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని గుర్తు చేశారు. ఇప్పుడు దీన్ని చట్టం రూపంలోకి మార్చాల్సిన సమయమొచ్చిందని అన్నారు. ఈ మేరకు ఇప్పటికే ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవా న్ హామీని ఇచ్చారని, ఒకవేళ ఈ బిల్లు ఓడితే అది సర్కార్ నైతిక ఓటమి అవుతుందని పేర్కొన్నారు.
డిసెంబర్‌లో జరిగే అసెంబ్లీ సమావేశాల ముందే దీనిపై ఏకాభిప్రాయం రావల్సిన అవసరముందని తెలిపారు. మూఢనమ్మకాలు, చేతబడిపై ఎన్నో ఏళ్లుగా ఉద్యమం చేసిన నరేంద్ర దభోల్కర్‌ను ఆగస్టు 20న పుణేలోని ఓంకారేశ్వర్ బ్రిడ్జిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రజాగ్రహం పెల్లుబకడంతో ఆత్మరక్షణలో పడ్డ సర్కార్ మూఢ నమ్మకాల, చేతబడిపై నిషేధం విధిస్తూ ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. వివిధ ముసాయిదాల ద్వారా 2003లో అసెంబ్లీ ముందుకు వచ్చి న ఈ బిల్లు కోసం గత పదేళ్లుగా 29 సవరణలు చేశారు. మతాలను నమ్మించే పేరిట ప్రజలను మభ్యపెట్టేందు కోసం వినియోగిస్తున్న మూఢ నమ్మకాలను పాటించడం, చేతబడులను నిషేధిస్తూ ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని హమీద్ డిమాండ్ చేశారు.