అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం
ముంబై: పట్టణ ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాల నిరోధానికి ప్రత్యేక చట్టాన్ని తయారు చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. చట్టం రూపకల్పన కోసం బీఎంసీ కమిషనర్ నేతృత్వంలో 14 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసినట్టు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ శాసనసభకు గురువారం తెలిపారు. ఉల్హాస్‌నగర్ భవనాల క్రమబద్ధీకరణ విధానాన్ని ఇతర నగరాలకూ వర్తింపజేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఒక్కో ప్రాంతానికి ఒక్కో తరహా సమస్య ఉంటుంది కాబట్టి ప్రత్యేక విధానాలు అవసరమవుతాయన్నారు.
పింప్రి-చించ్‌వాడ్‌లో అక్రమ నిర్మాణాలపై చర్చలో పాల్గొంటూ ఆయన పైవిషయం తెలిపారు. ఉల్హాస్‌నగర్‌లో 6,623 అక్రమ నిర్మాణాలు ఉన్నట్టు గుర్తించినా, 100 నిర్మాణాలను కూడా క్రమబద్ధీకరించలేదు. అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు నిర్మాణ పటిష్టత అత్యంత ముఖ్యమని సీఎం చెప్పారు. పింప్రి-చించ్‌వాడ్‌లోని అక్రమ నిర్మాణాల గణాంకాల విశ్లేషణను ఈ నెలాఖరుకు సమర్పించాల్సిందిగా ఆదేశించామని తెలిపారు.
వేసవిలో పోలీసు ఉద్యోగాల భర్తీ వద్దు
పోలీసుల ఉద్యోగాల కోసం ముంబై, నాసిక్‌లో నిర్వహించిన పరీక్షల సందర్భంగా ఇద్దరు యువకులు మరణించడంతో.. ఇక నుంచి వేసవిలో ఇలాంటి ఉద్యోగాలను భర్తీ చేయవద్దని పలువురు సభ్యులు సభలో గురువారం సూచించారు. నాసిక్‌లో మరణించిన అంబాదాస్ కుటుంబానికి రూ.ఐదు లక్షల నష్టపరిహారం ఇవ్వాలని మాలేగావ్ ఎమ్మెల్యే దాదా భూసే ప్రభుత్వాన్ని కోరారు. పేద కుటుంబానికి చెందిన ఈ యువకుడు కుటుంబాన్ని పోషించేవాడని తెలిపారు.
విక్రోలీ వద్ద ఉన్న భర్తీ కేంద్రంలో తాగునీటి వంటి కనీస సదుపాయాలు కూడా లేవ న్నారు. ఐదు కిలోమీటర్ల పరుగుపందెంలో పాల్గొన్నప్పుడు వడదెబ్బ తగిలి అంబాదాస్ మరణించాడని అన్నారు. వేసవిలో ఎండలు అధికం కాబట్టిఅక్టోబర్-డిసెంబర్ మధ్య కాలంలో ఉద్యోగాలను భర్తీ చేయాలని ఎమ్మెల్యే బాలానంద గావ్‌కర్ అన్నారు.
ఆర్.ఆర్.పాటిల్‌కు క్లీన్‌చిట్
అత్యాచారాల నిరోధంపై హోంమంత్రి ఆర్.ఆర్.పాటిల్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని స్పీకర్ దిలీప్ వల్సే పాటిల్ స్పష్టం చేశారు. ప్రతి ఇంట్లో ఒక పోలీసు ఉన్నా అత్యాచారాలను నిరోధించడం సాధ్యం కాదని మంత్రి సభలో బుధవారం అన్నట్టు వార్తలు వచ్చాయి. మీడియా వచ్చిన కథనాలు, అసెంబ్లీ రికార్డులను పరిశీలించానని, పాటిల్ మాటల్లో తప్పేమీ లేదని స్పీకర్ అన్నారు.
మంత్రి అలాంటి మాటేదీ అనలేదని వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా పాటిల్ మాట్లాడుతూ తనను కించపర్చాలనే దురుద్దేశంతోనే ఇలాంటి ప్రచారం జరిగిందని ఆరోపించారు. ప్రతి ఇంటికీ ఒక పోలీసును నియమించడం సాధ్యం కాదని మాత్రమే తాను అన్నానని స్పష్టం చేశారు. ఇక నుంచి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
దీనికి స్పీకర్ స్పందిస్తూ మీడియా సభా కార్యకలాపాలను ప్రసారం చేయడానికి నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందా అనే విషయాన్ని పరిశీలిస్తానని హామీ ఇచ్చారు.