= గుల్బర్గాలో ముంబై మున్నా హతం
= ఎదురు కాల్పుల్లో పోలీసులకు గాయాలు
= ఎస్‌ఐ తలలో దూసుకెళ్లిన బులెట్.. పరిస్థితి విషమం
= ప్రత్యేక హెలికాఫ్టర్‌లో హైదరాబాద్‌కు
యాదగిరి/బెంగళూరు, న్యూస్‌లైన్ : గుల్బర్గా పోలీసుల ఎన్‌కౌంటర్‌లో ముంబైకి చెందిన గ్యాంగ్‌స్టర్ మున్నా హతమయ్యాడు. ఈ సందర్భంగా ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఎస్‌ఐలు, ఒక ఏఎస్‌ఐ గాయపడ్డారు. వీరిలో ఒక ఎస్‌ఐ పరిస్థితి విషమంగా ఉంది. గుల్బర్గాలోని రోజా ప్రాంతంలో ఉన్న చోటీ దేవడా కాలనీలో బుధవారం మధ్యాహ్నం ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... ఆరు నెలల క్రితం హుమ్నాబాద్ బేస్ వద్ద ఉన్న ముత్తూట్ పైనాన్స్ కేంద్రంలో పట్టపగలే మున్నా, అతని సోదరుడు దోపిడీకి తెగబడ్డారు. వీరికి ముంబైలోని గ్యాంగ్‌స్టర్లతో సంబంధాలు ఉన్నాయి.
షార్ప్‌షూటర్లుగా ఎదిగిన వీరు ఏడేళ్ల క్రితం ఎంబీనగర్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ సుధీర్ హెగ్డేను హతమార్చారు. ఈ కేసులో మున్నా అరెస్ట్ అయ్యాడు. ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఇతనిపై ఆరు హత్యలు, అనేక దోపిడీ కేసులు నమోదయ్యాయి. అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న మున్నా కోసం పోలీసులు గాలిస్తున్నారు. చోటి దేవడా కాలనీలోని ఓ ఇంటిలో అతను ఉన్నట్లు కచ్చితమైన సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ బుధవారం ఉదయం రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, అరెస్ట్ చేసేందుకు కార్యాచరణ రూపొందించారు.
దీంతో మున్నా తలదాచుకున్న ఇంటిని స్టేషన్ బజార్ ఎస్‌ఐ మల్లికార్జున బండె, ఎస్‌ఐ మురళీ, ఏఎస్‌ఐ ఉద్దండప్ప ఆధ్వర్యంలో 20 మంది కానిస్టేబుళ్లు చుట్టుముట్టారు. అనంతరం లొంగిపోవాలని హెచ్చరికలు చేశారు. అదే సమయంలో ఇంటి లోపలి నుంచి పోలీసులపై మున్నా కాల్పులు జరిపాడు. బులెట్లు ఎస్‌ఐ మల్లికార్జున కాలు, పొట్ట, తలలో దూసుకెళ్లాయి. పోలీసులు అప్రమత్తమయ్యే లోపు ఎస్‌ఐ మురళీతో పాటు ఏఎస్‌ఐ ఉద్దండప్పకూ బులెట్ గాయాలయ్యాయి. పరిస్థితి విషమించడంతో పోలీసులు కాల్పులు జరిపారు.
కొద్ది సేపటి తర్వాత లోపలి నుంచి కాల్పులు నిలిచిపోయాయి. పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. తీవ్రంగా గాయపడిన మున్నాను ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అతను మరణించాడు. ఎదురు కాల్పుల్లో గాయపడిన పోలీసులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఎస్‌ఐ మల్లికార్జున పరిస్థితి విషమంగా మారడంతో ప్రథమ చికిత్స అనంతరం బసవేశ్వర ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆయనకు శస్త్ర చికిత్స జరిపి బులెట్లను తొలగించారు.
మెరుగైన చికిత్స కోసం ప్రత్యేక హెలికాఫ్టర్‌లో హైదరాబాద్‌కు తీసుకెళ్తున్నట్లు రాష్ర్ట పాలన, శాంతిభద్రత విభాగం ఏడీజీపీ ఎం.ఎన్.రెడ్డి తెలిపారు. సంఘటనతో గుల్బర్గా వాసులు భయాందోళనకు గురయ్యారు. రోజా ప్రాంతంలోని విద్యాసంస్థలను మూసి విద్యార్థులను ఇళ్లకు పంపించారు. నగరంలో పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. ఘటనా స్థలాన్ని ఈశాన్య రేంజ్ డీజీపీ మహమ్మద్ వజీర్ అహమ్మద్, జిల్లా ఎస్పీ అమిత్ సింగ్, ఏఎస్పీ కాశీనాథ్ తళకేరి పరిశీలించారు. మున్నా కాల్పులు జరిపిన ప్రాంతంలో పోలీసులకు రెండు పిస్తోళ్లు లభ్య మయ్యాయి.
ఎన్‌కౌంటర్
Published Thu, Jan 9 2014 4:46 AM | Last Updated on Sat, Sep 2 2017 2:24 AM
Advertisement