సాక్షి, ముంబై: బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ బాద్‌షా అమితాబ్‌బచ్చన్ వ్యవహరించే అవకాశముంది. నగరంలో పెరుగుతున్న విషజ్వరాలైన డెంగీ, మలేరియాలను అరికట్టడం కోసం ప్రజల్లో జనజాగృతి కల్పించేందుకు ఆయనను బ్రాండ్ అంబాసిడర్‌గా చేసి లఘు చిత్రం (షార్ట్ ఫిల్మ్) చేయాలని బీఎంసీ నిర్ణయం తీసుకుందని సమాచారం. దీంతో తొందర్లోనే ముంబైవాసులకు మలేరియా, విషజ్వరాల బారినపడకుండా ఉండేందుకు తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి అమితాబ్ బచ్చన్ లఘు చిత్రం ద్వారా సందేశమివ్వనున్నారు.
నగరంలో గత కొంత కాలంగా డెంగీ, మలేరియాలు విజృంభించాయి. వీటిని అడ్డుకునేందుకు ఇప్పటికే అనేక విధాల ప్రయత్నిస్తున్న బీఎంసీ తాజాగా ఓ షార్ట్ ఫిల్మ్ రూపొందించాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ఫిల్మ్‌లో బాలీవుడ్ బాద్‌షా అమితాబ్‌ను తీసుకోవాలని భావిస్తోంది. ఆయన ద్వారా జనజాగృతి కల్పిస్తే మంచి ఫలితాలుంటాయని యోచిస్తోంది. దీనిపై తొందర్లోనే తుది నిర్ణయం తీసుకుంటామని బీఎంసీ ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అరుణ్ బామణే తెలిపారు. అయితే లఘు చిత్రం రూపొందించిన అనంతరం నగరంలోని అన్ని సినిమా థియేటర్లలో ఈ షార్ట్ ఫిల్మ్‌ను ప్రదర్శించనున్నట్టు తెలిసింది. ముంబైతోపాటు దేశవ్యాప్తంగా 2012 నుంచి మలేరియా, డెంగీ లాంటి విషజ్వరాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ముంబైలో ఇలాంటి విషజ్వరాల బారిన పడేవారిలో 50 శాతం మంది మురికివాడలలో నివసించేవారు కాకపోవడం కార్పొరేషన్‌ను కలవరపెడుతోంది.
పది నెలల్లో 31 మంది మృతి...
నగరంలో డెంగీ, మలేరియా వ్యాధులు భయాందోళనలను సృష్టిస్తున్నాయి. గత పది నెలల్లో డెంగీ, మలేరియా సోకి 31 మంది మర ణించారు. ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం..గత పది నెలల్లో 1,313 మంది డెంగీబారిన పడితే 14 మంది మరణించారు. మరోవైపు గత పది నెలల్లో ఎనిమిది వేల మందికి మలేరియా వస్తే వీరిలో 17 మంది బలయ్యారు. వారందరూ బీఎంసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
ఖాలీస్థలాలు, పాత భవనాలపై ప్రత్యేక దృష్టి...
ఖాళీ స్థలాలు, శిథిలావస్థకు చేరిన భవనాల వద్దనే అత్యధికంగా దోమల ఉత్పత్తి అవుతుంది. దీంతో ఈసారి నగరంలో ఖాళీగా ఉన్న పాత భవనాలపై బీఎంసీ ప్రత్యేక దృష్టిసారించింది. పాత, శిథిలావస్థకు చేరుకున్న భవనాల నుంచి మలేరియాకు ఊతమిచ్చే దోమలు పుట్టుకొస్తున్నాయని పలుమార్లు వెల్లడైంది. భవన నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతాల నుంచి మలేరియా దోమల సంతతి ఉత్పత్తి అవుతుందని తేలింది.
దీంతో బీఎంసీ ఇలాంటి దోమల ఉత్పత్తి అయ్యే ప్రాంతాల్లో దోమల సంతతి జరగకుండా పూర్తిగా అంతమొందించేందుకు పలువిధాల ప్రయత్నాలు చేస్తోంది.
ముంబైకర్లకు బచ్చన్ ఆరోగ్య పాఠాలు!
Published Sat, Nov 9 2013 11:41 PM | Last Updated on Wed, Apr 3 2019 4:53 PM
Advertisement
Advertisement