సాక్షి, చెన్నై : అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అన్ని పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. బీజేపీ నేతలు ఒక అడుగు ముందు వెళుతున్నారు. రాష్ట్ర నేతలతో ఆ పార్టీ ఇన్‌చార్జ్ మురళీధర్‌రావు గురువారం సమాలోచనలు జరిపారు. పొత్తు అంశంపై ప్రధానంగా చర్చించారు. మేనిఫెస్టో రూపకల్పన అంశంపై దృష్టి పెట్టారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి తథ్యమని పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల ముందు రాష్ట్రంలో చతికిలబడిన బీజేపీ తర్వాత క్రమేణా పుంజుకుంటోంది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలో డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా కూటమి సైతం ఏర్పడింది. ఆ ఎన్నికల వరకు అంతా సజావుగా సాగినా తదుపరి పరిణామాలతో మిత్రులు ఆ పార్టీకి షాక్ ఇస్తూ వచ్చారు.
లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ చుట్టూ తిరిగిన పార్టీలన్నీ ప్రస్తుతం తలా ఓ దిక్కు వెళ్లాయి. ఇందులో ఎండీఎంకే నేత వైగో ఒక అడుగు ముందుకు వేసి వామపక్షాలను ఏకం చేయడమేగాక వీసీకేను కలుపుకుని ప్రజా కూటమి ఏర్పాటు చేశారు. అధికార లక్ష్యంగా తమ కూటమి ఆవిర్భవించిందని ప్రకటించారు. పీఎంకే తమదీ ఓ కూటమి అంటూ సీఎం అభ్యర్థిగా అన్భుమణి రాందాసు పేరును ఆ పార్టీ వ్యవస్థాపకుడు రాందాసు ప్రకటించారు. ఇక డీఎండీకే నేత విజయకాంత్, మరికొన్ని చిన్న పార్టీలు మౌనంగా ఉన్నాయి. వైగో ఆహ్వానించినా ఇంతవరకు ఆ పార్టీల నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో తమ నేతృత్వంలో కూటమి ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో కమలనాథులు పావులు కదుపుతున్నారు.
ఎండీఎంకేతో కలసి పనిచేస్తున్న పార్టీలు ఎలాగో తమతో చేతులు కలిపే అవకాశం లేని దృష్ట్యా పీఎంకే, డీఎండీకేపై దృష్టి సారించారు. రాష్ర్టంలో డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయం ఎన్డీఏ కూటమి అని చాటుకోవడంతో పాటు అందుకు తగ్గ ప్రయత్నాలను వేగవంతం చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా కమిటీని రంగంలోకి దించేందుకు సిద్ధమైనట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ప్రజా కూటమికి ఇతర పార్టీల నుంచి మిశ్రమ స్పందన వచ్చిన దృష్ట్యా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఏర్పాటు దిశగా ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మురళీధరరావు సిద్ధమయ్యారు.
చెన్నైలో పార్టీ వర్గాలతో ఆయన సమాలోచనలో పడ్డారు. టీనగర్‌లోని కమలాలయంలో పార్టీ వర్గాలతో మురళీధర్‌రావు గురువారం సమావేశం నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్, జాతీయ నేతలు హెచ్.రాజా, ఇలగణేషన్, సీపీ రాధాకృష్ణన్, పార్టీ రాష్ట్ర ముఖ్య నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. బీహార్‌లో ఎన్నికల పర్వం ముగియడంతో ఇక రాష్ట్రం మీద ఢిల్లీ పెద్దలు దృష్టి పెట్టారని, రాష్ర్టంలోని ప్రధాన సమస్యలపై చర్చించి, అధ్యయనం చేయడంతో పాటు వాటిని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని, జాతీయ నాయకుల ద్వారా వాటి పరిష్కారానికి తగ్గ హామీలు ఇప్పించే రీతిలో కార్యచరణ సిద్ధం చేయాలని నిర్ణయించారు. ఈ విషయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్‌ను కదిలించగా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అవతరించి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. జనరంజకమైన మ్యానిఫెస్టో రూపొందిస్తామని చెప్పారు.
పార్టీ నేతలతో మురళీధర్‌రావు సమాలోచన
Published Fri, Nov 6 2015 2:49 AM | Last Updated on Sun, Sep 3 2017 12:04 PM
Advertisement