మతఘర్షణలు విచారకరం : మనీష్ తివారీ
Published Fri, Sep 13 2013 3:15 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
న్యూఢిల్లీ: ముజఫర్‌నగర్‌లో మతఘర్షణలు చోటుచేసుకోవడం విచారకరమని కాంగ్రెస్ నేత మనీష్ తివారీ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో అధికారంలో ఉన్న సమాజ్‌వాది పార్టీ ఈ పరిస్థితికి కారణమని ఆయన ఆరోపించారు. గురువారం ఈ విషయమై మీడియాతో మాట్లాడుతూ... ‘జరిగిన ఘటనలు విచారకరం. రాష్ట్ర ప్రభుత్వమే వీటికి బాధ్యత వహించాలి. ఘర్షణల ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని సాధారణస్థితికి తీసుకురావడం సవాలుతో కూడుకున్నదే. బాధ్యులను వెంటనే అదుపులోకి తీసుకోవాలి. ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం తగదు. ప్రజలు సంయమనం పాటించాల’న్నారు.
అఖిలేష్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలి: జమాయత్
మతఘర్షణలను నియంత్రించలేని అఖిలేష్ యాదవ్ ప్రభుత్వాన్ని వెంటనే గద్దెదించాలని జమాయత్ ఉలేమా ఏ హింద్ డిమాండ్ చేసింది. ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి మౌలానా మహమూద్ మదాని మాట్లాడుతూ.. రాష్ట్రప్రభుత్వ వైఫల్యం వల్లే మతఘర్షణల తీవ్రత పెరిగిందంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు
ముజఫర్‌నగర్ మతఘర్షణలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని, వెంటనే బాధితులకు సాయం అందించాలని కోరుతూ దాఖలైన రెండు పిటిషన్లపై స్పందించిన సుప్రీం కోర్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతోపాటు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. యూపీకి చెందిన మహ్మద్ హరుణ్‌తోపాటు మరో ఎనిమిది మంది దాఖలు చేసిన పిటిషన్‌తోపాటు సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ దాఖలు చేసిన మరో పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి పి.సదాశివం యూపీ ప్రభుత్వంతోపాటు కేంద్రానికి నోటీసులు జారీ చేశారు. భారత రాజ్యాంగంలోని 355 ఆర్టికల్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం తన విధులను నిర్వర్తించాలని పిటిషనర్లు చేసుకున్న అభ్యర్థనపై కోర్టు ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. అయితే పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ఎటువంటి చర్యలు తీసుకున్నారో వివరించాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేశారు. అంతేకాక ప్రారంభించిన సహాయ శిబిరాల వివరాలను కూడా అందజేయాలని నోటీసుల్లో పేర్కొంది.
రాజకీయం చేయొద్దు: ఆర్‌పీఎన్ సింగ్
ముజఫర్‌నగర్ మతఘర్షణలను రాజకీయం చేయొద్దని కేంద్ర మంత్రి ఆర్‌పీఎన్ సింగ్ కోరారు. సాధారణ పరిస్థితి నెలకొనేంతవరకు రాజకీయ పార్టీలు సంయమనం పాటించాలన్నారు. ఈ ఘర్షణల్లో మరణించినవారి కుంటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇటువంటి ఘర్షణలను ప్రతిఒక్కరూ ఖండించాల్సిన అవసరముందన్నారు.
Advertisement
Advertisement