నాకు ఈ పుట్టిన రోజు వెరీస్పెషల్
కొరుక్కుపేట: ప్రతి ఏడాది తాను జరుపుకునే పుట్టిన రోజు కంటే ప్రత్యేక ప్రతిభావంతులతో కలసి చేసుకున్న ఈ పుట్టిన రోజు తనకు ఎంతో వెరీ వెరీ స్పెషల్ అని ప్రముఖ సినీనటి శ్రుతీహాసన్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఉంగళుక్కాగ చారిటబుల్ ట్రస్ట్, రోటరీ క్లబ్ ఆఫ్ మద్రాసు-టీ.నగర్ సంయుక్త ఆధ్వర్యంలో చెన్నై, టీనగర్ , జీఎన్.శెట్టి రోడ్డులోని లిటిల్ ఫ్లవర్ హోమ్ ఫర్ బ్లైండ్ స్కూల్‌లో సేవ్ ది బ్లైండ్ చిల్డ్రన్ ప్రోగ్రామ్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సినీనటీ శ్రుతీహాసన్ హాజరయ్యారు. సేవ్ ది బ్లైండ్ చిల్డ్రన్ ప్రోగ్రామ్ ప్రారంభించారు.
ఉంగళుక్కాగ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ సునీల్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో లిటిల్ ఫ్లవర్ హోమ్ ఫర్ బ్లైండ్ పాఠశాలకు రూ.12 లక్షలు విలువ చేసే వస్తువులను వితరణ చేశారు. అనంతరం సినీనటీ శ్రుతీహాసన్ తన పుట్టిన రోజు వేడుకలను అంధులు, బధిరుల చిన్నారులతో కలసి కోలాహలంగా జరుపుకున్నారు. భారీ కేక్ కట్ చేసి చిన్నారులకు తినిపించారు. పాఠశాల ఆవరణలో మొక్కలను నాటారు. అనంతరం శ్రుతీహాసన్ మాట్లాడుతూ ప్రతి ఏడాది పుట్టిన రోజు ఒక ఎత్తు అయితే ఈ సారి తాను అంధులు, బధిరుల చిన్నారుల సమక్షంలో జరుపుకోవడం చాలా గర్వంగా ఉందన్నారు.
నాకు ఈ పుట్టిన రోజు వెరీ వెరీ స్పెషల్ అని అన్నారు. సమాజానికి సేవలు అందిస్తున్న ఉంగళుక్కాగ ట్రస్ట్, రోటరీ క్లబ్ ఆఫ్ మద్రాసు-టీ.నగర్ లిటిల్ ఫ్లవర్ బ్లైండ్ పాఠశాలకు సహాయ పడడంపై ప్రత్యేకంగా అభినందిస్తున్నానని తెలిపారు. అనంతరం డాక్టర్ సునీల్ మాట్లాడుతూ సినీనటుడు విశాల్ సహకారంతో శ్రుతీహాసన్ తమ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.
అంతే కాకుండా 1000 మంది చిన్నారులకు స్వయంగా ఆహారం అందించడం మరీ ఆనందంగాఉందని అన్నారు. రూ.12 లక్షలు విలువ కలిగిన వస్తువులు విరాళంగా అందించామని అన్నారు. ఇందులో రెండు కంప్యూటర్‌లు, 10 కంప్యూటర్ టేబుల్స్ అండ్ చైర్స్, 2 ఆఫీసు గది టేబుల్‌లు, స్కానర్ కమ్ ప్రింటర్‌లు, అంధ చిన్నారులు ఆడుకునే బొమ్మలు, గేమ్స్ మెటీరియల్స్, మ్యూజిక్ పరికరాలు, 2 రిఫ్రిజిరేటర్‌లు, సీడీప్లేయర్‌లు, ఒక జెరాక్స్ మిషన్ తోపాటు స్టేషనరీ వస్తువులను అందించామని తెలిపారు.
అదేవిధంగా ట్రస్ట్ తరఫున ఇద్దరు పేద వికలాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేశామన్నారు. ఈ ఏడాది లో గోగ్రీన్ కార్యక్రమంలో పలు పాఠశాలలు, కళాశాలలు, రోడ్డుపక్కన, పబ్లిక్ స్థలాల్లో ఐదు వేల ఔషదధ మొక్కలు నాటుతామని వివరించారు. సమాజసేవే లక్ష్యంగా ట్రస్ట్ ముందుకెళ్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ రాజన్ ఐ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ మోహన్ రాజన్, రోటరీ క్లబ్ ఆఫ్ మద్రాసు-టీ.నగర్ అధ్యక్షుడు రవివేంకట్రామన్, నక్షత్ర పవర్ చైర్మన్ రతన్ రాజ్ రాజమాణిక్యం, పారిశ్రామికవేత్తలు అనిల్ కుమార్‌రెడ్డి, డాక్టర్ శిల్పారెడ్డి పాల్గొన్నారు.