- శివమొగ్గలో పేరు మోసిన రౌడీ
- బెయిల్‌పై బయటకు వచ్చి ప్రత్యర్థుల చేతిలో హతం
- నిందితుడిపై గూండా చట్టం
శివమొగ్గ : పట్టణంలో పేరు మోసిన రౌడీ నాగరాజు అలియాస్ స్పాట్ నాగ (38) మంగళవారం రాత్రి హత్యకు గురయ్యాడు. ప్రత్యర్థులు మారణాయుధాలతో విచక్షణా రహితంగా నరికివేశారు. వివరాలు... పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న నాగ మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో రోడ్డుపై నడిచి వెళ్తుండగా అతనికి ఎటువ ంటి అనుమానం రాకుండా వెంబడించిన ప్రత్యర్థులు బీహెచ్ రోడ్డు వద్ద చుట్టుముట్టారు.
మారణాయుధాలతో విచక్షణారహితంగా నరికివేశారు. అప్పటి వరకు ఎంతో ప్రశాంతంగా ఉన్న ఈ ప్రాంతం నాగ హత్యతో స్థానికులు హడిలిపోయారు. సమాచారం అందుకున్న జిల్లా ఎస్‌పీ కౌశలేంద్రకుమార్, అడిషనల్ ఎస్‌పీ దయాల్, డీవైఎస్‌పీ శివకుమార్, ఇన్స్‌పెక్టర్ మంజునాథ్ సంఘటన స్థాలాన్ని పరిశీలించారు. దొడ్డపేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే స్పాట్ నాగ హత్యకు సంబంధించి తమిళ రమేష్, రౌడీ హంది (పంది) అణ్ణి సోదరులు గిరిష్, బీఆర్‌పీ రఘు, మరి కొంత మంది హస్తం ఉందని నాగ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. నిందితుల కోసం ఎస్‌పీ ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు.
పేరుమోసిన రౌడీ : శివమొగ్గలో స్పాట్ నాగపై పలు హత్యలు, దోపిడీలు, బెదిరింపుల కేసులు ఉన్నాయి. ఇప్పటికే ఓ కేసులో జైలులో ఉన్న నాగ ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చాడు. బయటకు వచ్చినా కూడా నేరవృత్తి వీడలేదు. నాగకు రౌడీ హెబ్బెట్టు మంజుతో పాత కక్షలు ఉన్నా యి.
జైలులో ఉండగానే నాగను హత్య చేయడానికి పథకం రచించారని తెలుసుకున్న జైలు సిబ్బంది నాగను మరోజైలుకు తరలించారు. వీరి నేర ప్రవృత్తిని అదుపు చేయాలని జిల్లా కలెక్టర్ విపుల్ బన్సాల్, ఎస్‌పీ నాగపై గుండా కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే 15 రోజుల క్రితం బెయిల్‌పై బయటకు వచ్చిన నాగ హత్యకు గురికావడంతో పోలీసులు నిఘాపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.