కూతురు హరిద్రతో నళిని సత్‌వచ్చారిలో నళిని ప్రస్తుతం ఉంటున్న ఇల్లు
తమిళనాడు, వేలూరు: వేలూరు సెంట్రల్ జైలు నుంచి నళిని 28 సంవత్సరాల అనంతరం పెరోల్‌పై విడుదల అయ్యారు. ఆమెను కుమార్తె వివాహ ఏర్పాట్ల కోసం వేలూరు సత్‌వచ్చారిలోని ఒక ఇంట్లో ఉంచారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో వేలూరు సెంట్రల్ జైలులో నళినితో పాటు ఆమె భర్త మురుగన్ మొత్తం ఏడుగురు శిక్ష అనుభవిస్తున్న విషయం విధితమే. ఈ నేపథ్యంలో నళిని కుమార్తె వివాహ ఏర్పాట్లు కోసం పెరోల్ కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసు విచారణ ఈనెల 5న విచారణ జరిగింది. ఈ కేసులో నళిని నేరుగా వెళ్లి ఆమె తన కుమార్తె జన్మించినప్పటి నుంచి ఇంత వరకు ఒక్క ముద్ద అన్నం కూడా పెట్టలేదని కనీసం తల్లిగా ఎటువంటి సేవను చేయలేదని తెలిపి ఆమె వాదనలను వినిపించింది. దీంతో విచారణ జరిపిన న్యాయమూర్తి 30 రోజులు పెరోల్ ఇస్తూ తీర్పునిచ్చారు. అదే విధంగా నళిని 30 రోజులు పెరోల్‌పై ఎక్కడ ఉండబోతున్నారు అనే విషయాలనుపది రోజుల్లో జైలు అధికారులకు తెలియజేయాలని తీర్పునిచ్చింది.
నళినికి తల్లి పద్మ, కాట్పాడి బ్రహ్మపురానికి చెందిన ఒక మహిళ జామీను సంతకం చేశారు. దీంతో నళిని వేలూరు రంగాపురంలోని పులవర్ నగర్‌లో ద్రావిడ సిద్ధాంతాలకు చెందిన తమిళ పేరవై రాష్ట్ర జాయింట్ కార్యదర్శి సింగరాయర్ ఇంటిలో ఉంటూ వివాహ ఏర్పాట్లను చేసేందుకు నిర్ణయించడంతో ఆమె న్యాయవాది పుహలేంది ద్వారా జైలు అధికారులకు నకలను సమర్పించారు. ఇదిలా ఉండగా ఈనెల 20న సాయంత్రం 4 గంటలకు జైలు నుంచి పెరోల్‌పై బయటకు వస్తారని ఆశించారు. అయితే ఉన్నతాధికారుల నుంచి సమగ్రమైన ఆదేశాలు రాక పోవడంతో ఆమె రాక నిలిచి పోయింది. దీంతో నళినిని పెరోల్‌పై విడుదల చేయాలని బుధవారం సాయంత్రం వేలూరు సెంట్రల్ జైలు అధికారులకు ఆదేశాలు రావడంతో గురువారం ఉదయం 9.55 గంటలకు ఆమెను పటిష్ట పోలీస్ బందోబస్తు నడుమ బయటకు తీసుకొచ్చారు. అనంతరం ఆమెను పోలీస్ బందోబస్తుతో సత్‌వచ్చారిలోని రంగాపురంలో ఉన్న ద్రావిడ సిద్ధాంతాల తమిళ్ పేరవై ప్రధాన కార్యదర్శి సింగారాయర్ ఇంటి వద్దకు తీసుకొచ్చారు.
నళిని తల్లి పద్మ, బంధువులు కన్నీటితో హారతి: నళిని పెరోల్‌పై బయటకు వస్తారని తెలుసుకున్న నళిని తల్లి పద్మ, బంధువులు రంగాపురంలోని ఇంటి వద్దకు చేరుకున్నారు. ఉదయం 10.30 గంటలకు రంగాపురంలోని ఇంటి వద్దకు చేరుకున్న నళినికి తల్లి పద్మ హారతి పట్టారు. 28 సంవత్సరాల అనంతరం నళిని బయట ప్రపంచానికి రావడంతో నళిని తల్లి పద్మతో పాటు బంధువులు హారతి పట్టారు. ఆ సమయంలో బంధువులు, తల్లి పద్మ, నళినిని చూసి కన్నీటి పర్వతమయ్యారు.
రాజకీయనాయకులు, మీడియాతో మాట్లాడడంపై నిషేధం
30 రోజుల పెరోల్‌పై వచ్చిన నళిని రాజకీయ నాయకులతో పాటు మీడియాతో మాట్లాడకూడదని కోర్టు నిబంధనలు విధించడంతో ఎవరూ ఆమెను కలవలేక పోయారు.
వారం రోజుల్లో లండన్ నుంచి వేలూరు రానున్న కుమార్తె
లండన్‌లో ఉన్న నళిని కుమార్తె హరిద్ర వారం రోజుల్లో వేలూరుకు రానున్నారు. నళిని 30 రోజుల పాటు వేలూరు రంగాపురంలో ఉండడంతో ఆమె కుమార్తె వివాహం కూడా వేలూరులోనే జరగవచ్చునని తెలుస్తుంది. కుమార్తె వివాహం గురించి మురుగన్ ఇంత వరకు పెరోల్ కోరలేదు. వివాహ తేదీని బట్టి పెరోల్ కోరే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఇంటి వద్ద పటిష్ట బందోబస్తు: నళిని ఉంటున్న రంగాపురంలోని ఇంటి వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆమె ఉంటున్న ఇంటిలో మొదటి అంతస్తులో నళిని ఉండబోతున్నారు. దీంతో నళినిని చూసేందుకు ఎవరు వస్తారు, ఎవరు మాట్లాడతారు అనే విషయాలను పోలీసులు రిజిస్టర్‌లో నమోదు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment